News

Realestate News

విశాఖ.. మేడిన్‌ అమెరికా!

 విశాఖపట్నం: ఆకర్షణీయ నగరంగా విశాఖకు సరికొత్త సొబగులద్దడానికి అమెరికాలోని ప్రఖ్యాత సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. వివిధ రంగాల్లో అభివృద్ధి చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి అవి ముందుకొస్తున్నాయి. వారంరోజులపాటు అమెరికాలో పర్యటించిన నగర ప్రజాప్రతినిధులు, అధికారుల ఎదుట ఆయా సంస్థలు అమెరికాలోని ప్రధాన వ్యవస్థలు, ప్రభుత్వ సేవల రంగంలో పెట్టుబడులు, ప్రజలకు అందుతున్న మెరుగైన సేవలపై దృశ్య, శ్రవణ నివేదికలిచ్చాయి. నగరంలో పెట్టుబడులపై అమెరికాకు చెందిన వాణిజ్య అభివృద్ధి సంస్థ (యూఎస్‌టీడీఏ) ప్రధాన భూమిక పోషించే అవకాశం ఉంది.

విశాఖ నగరాభివృద్ధికి సాంకేతిక సహాయం అందించేందుకు గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు ఒబామా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా నగర పరిధిలోని ఎమ్మెల్యేలు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారుల బృందాలు అమెరికాలోని న్యూయార్క్‌, వాషింగ్‌టన్‌, శాన్‌ఫ్రాన్సిస్కో తదితర నగరాల్లో పర్యటించాయి. ఈ నగరాల్లో పారిశుద్ధ్యం, ట్రాఫిక్‌, వీధిదీపాల నిర్వహణ, నీటి సరఫరా, మురుగునీటిపారుదల, నగర ప్రణాళిక, పచ్చదనం వంటి వ్యవస్థల్లో మెరుగుదల కోసం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. పౌర సేవలు సకాలంలో, పారదర్శకంగా అందేలా ఏర్పాట్లు చేశారు. ఇలాంటి సాంకేతిక సేవలే విశాఖవాసులకు అందేలా అమెరికా ప్రభుత్వ రంగ సంస్థ యూఎస్‌టీడీఎస్‌ కీలక పాత్ర పోషించనుంది. అమెరికాలోని నగరాలకు సాంకేతిక సహాయం అందించిన, ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలతో యూఎస్‌టీడీఎస్‌ వర్గాలు సంప్రదింపులు జరిపి విశాఖకు తీసుకురానున్నాయి. అయితే పెట్టుబడులు ఏ స్థాయిలో వస్తాయో ప్రస్తుతానికి స్పష్టత లేదు. అక్కడి ప్రఖ్యాత సంస్థలు ఇక్కడికి రావటానికి ఆసక్తిగా ఉన్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి.

* అమెరికాలోని నగరాల్లో తాగునీటి సరఫరాలో నష్టాల్లేని వ్యవస్థ అమల్లో ఉంది. ప్రతీ నీటి బొట్టుకూ లెక్కా పత్రం కచ్చితంగా ఉంది. లీకేజీలు, నీటి చౌర్యం, సరఫరాలో నష్టాలను నిరోధించే సాంకేతిక వ్యవస్థ కూడా ఉంది. ప్రతి కనెక్షన్‌కూ మీటర్లు అమర్చారు.

* వీధి దీపాల నిర్వహణలో కచ్చితత్వం అమల్లో ఉంది. సాయంత్రం వీధి దీపాల వెలిగించి తిరిగి ఉదయం నిలిపివేసే వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఈ విషయంలో మానవ సేవలు అంతంత మాత్రమే. వీధుల్లో దీపాలు వెలగకపోయినా, ఆ విషయాన్ని కంట్రోల్‌ రూంలో నుంచే గమనించి సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. విద్యుత్తు వినియోగంలోనూ పొదుపు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

* మురుగునీటి పారుదల వ్యవస్థలోనూ విశాఖలో సమూల మార్పులు రాబోతున్నాయి. నగరంలో 70 శాతం ప్రాంతాల్లో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఉన్నా, నిర్వహణ పరంగా అనేక సమస్యలున్నాయి. మ్యాన్‌హోళ్ల నుంచి మురుగునీరు రహదారులపైకి బుసలు కొట్టే పరిస్థితి. అమెరికాలోని నగరాల్లో మురుగునీటి వ్యవస్థపరంగా అద్భుతమైన విధానాలు అమల్లో ఉన్నాయి. అక్కడ మురుగు నీటిని శుద్ధి చేసి తిరిగి ఇతరత్రా అవసరాల కోసం వినియోగించే వ్యవస్థ ఉంది.

* పారిశుద్ధ్య సమస్యకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు అమెరికాలోని నగరాలు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాయి. రహదారులపై చిత్తు కాగితం కూడా కనిపించదు. భూగర్భంలోంచి మురుగు నీరు వెళుతుంది. చెత్త నుంచి బయోగ్యాస్‌, విద్యుత్తు తయారు చేసే అనేక ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. పలు సంస్థలు ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. పరిశుభ్రతపై ప్రజల్లోనూ అవగాహన, చైతన్యం ఎక్కువ. రహదారులకిరువైపులా శాస్త్రీయ పద్ధతిలో చెట్లను పెంచుతున్నారు. వీటి సంరక్షణకు సాంకేతిక వ్యవస్థ అమల్లో ఉంది. ఎవరైనా పచ్చదనానికి నష్టం కలిగించే ప్రయత్నం చేస్తే వెంటనే యంత్రాంగాన్ని సాంకేతిక వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది.

* మెరుగైన ట్రాఫిక్‌ వ్యవస్థ కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు అమెరికాలోని ప్రఖ్యాత సాఫ్టువేర్‌ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ట్రాఫిక్‌పరంగా ఎక్కడా ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా ఇట్టే గుర్తించడం, ట్రాఫిక్‌ సమస్య ఏర్పడిన వెంటనే కంట్రోల్‌ గదిలోనుంచి గుర్తించి పోలీసులను అప్రమత్తం చేయడం వంటివి చిటికెలోజరిగిపోతుంటాయి. రహదారులపై జరిగే నేరాలు, ప్రమాదాలను వెంటనేగుర్తించి నిందితులను గుర్తుపట్టే సాంకేతిక వ్యవస్థను విశాఖలోనూ విస్తృతం చేయనున్నారు.

Source By: http://eenadu.net/