విశాఖ నుంచి… శ్రీలంకకు నేరుగా విమానం
విశాఖ నుంచి… శ్రీలంకకు నేరుగా విమానం
విశాఖపట్నం నుంచి శ్రీలంకలోని కొలంబో విమానాశ్రయానికి జులై 8వ తేదీ కొత్త విమాన సర్వీసు ప్రారంభం కానుంది. వారానికి నాలుగు సర్వీసులు కొలంబోకు నడపనున్నారు. కొలంబోలో ఉదయం 7.15 గంటలకు బయలుదేరి 9.00 గంటలకు విశాఖ వస్తుంది. తిరిగి విశాఖలో ఉదయం 10.00 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు కొలంబోకు తిరిగి వెళ్తుంది. శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ఈ సర్వీసును నిర్వహించడానికి ముందుకు వచ్చింది. విశాఖ నుంచి ఫార్మా, వస్త్రాల ఎగుమతులకు కూడా ఈ విమానం అత్యంత అనుకూలంగా మారనుంది. దీంతోపాటు కొలంబో నుంచి హాంకాంగ్, చైనా, జపాన్ తదితర దేశాలకు వెళ్లడానికి కూడా విశాఖ నుంచే బోర్డింగ్ పాస్‌లు ఇచ్చే వెసులుబాటు కూడా అందుబాటులోకి రానుంది.
బ్యాగేజ్ చెక్ఇన్ కూడా విశాఖలోనే చేయించుకుని కొలంబో నుంచి పలు దేశాలకు వెళ్లడానికి అవకాశం కలగనుంది. దీంతోపాటు వీసాల కోసం ఎంబసీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇ-వీసా కూడా పొందే సదుపాయం కూడా అందుబాటులోకి రావడం మరో విశేషం. విశాఖ ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే గణబాబులు ఈ విమానం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారని ఆంధ్రప్రదేశ్ టూర్స్ ట్రావెల్స్ సంఘం ఛైర్మన్ నరేశ్‌కుమార్, అధ్యక్షుడు కె.విజయ్మోహన్లు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ బృందం రెండుసార్లు విశాఖ వచ్చి ఇక్కడి పరిస్థితులను పరిశీలించి వెళ్లారని నరేశ్‌కుమార్, విజయ్మోహన్లు వివరించారు.