News

Realestate News

విశాఖ టు విదేశాలు..

  • సులువుగా ఎగిరేయొచ్చు!!
  • ఉత్తరాంధ్రలో పారిశ్రామికవేత్తలు, పర్యాటకులకు సౌకర్యం
  • త్వరలో విశాఖ నుంచి నేరుగా కార్గో, ప్యాసింజర్‌ విమానాలు
  • 26న విశాఖలో అంతర్జాతీయ విమానయాన సదస్సులో స్పష్టత
  • హాజరుకానున్న ఫార్మా, టూర్‌ ఆపరేటర్‌ సంస్థల ప్రతినిధులు
శ్రీకాకుళం, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో పారిశ్రామివేత్తలు, విద్యార్థులు, ఫార్మా కంపెనీలకు తీపికబురు. ఇకపై విదేశాలకు వెళ్లాలంటే హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే పనిలేకుండా.. నేరుగా విశాఖ నుంచే ఎంచక్కా ఎగిరిపోవచ్చు! శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తయారవుతున్న ఫార్మా ఉత్పత్తులను ఆయా కంపెనీలు విశాఖలో కార్గో విమాన సర్వీసులు లేకపోవడంతో తొలుత హైదరాబాద్‌కు పంపి అక్కడి నుంచి పలు దేశాలకు తరలిస్తున్నాయి. కానీ ఇకపై విశాఖ నుంచే విమానాల్లో నేరుగా తరలించుకునే సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. ఈ మేరకు విశాఖపట్నం నుంచి పలు దేశాలకు సర్వీసులు నడపడానికి పలు అంతర్జాతీయ విమాన సంస్థలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి.
ఇవి ఎప్పుడు ప్రారంభమవుతాయి? అసలు ఎంతమంది ఏయే దేశాల నుంచి ముందుకు వస్తారు? ఇక్కడి ఎగుమతులు, ప్యాసింజర్‌ రద్దీ తదితర అంశాలు వీరిని ఎంతవరకు ఆకర్షిస్తాయి? అనే అంశాలపై ఈ నెల 26న విశాఖలో జరగనున్న అంతర్జాతీయ విమానయాన సదస్సు ద్వారా మరింత స్పష్టత రానుంది. ప్రధానంగా శ్రీలంక నుంచి మహిన్‌లంక, దుబాయ్‌ నుంచి ఫ్లైదుబాయ్‌, సింగపూర్‌ నుంచి సిల్క్‌ ఎయిర్‌వేస్‌, థాయ్‌లాండ్‌ నుంచి థాయ్‌ ఎయిర్‌వేస్‌, ఎయిర్‌ అరేబియాతోపాటు పదుల సంఖ్యలో విదేశీ విమానయాన కంపెనీలు ఈ సదస్సుకు హాజరవుతున్నాయి. అదేవిధంగా వివిధ దేశాల నుంచి 50 మంది వరకు టూర్‌ ఆపరేటర్లు వస్తున్నారు. కేంద్రపౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని ఏపీసీసీఐఎఫ్‌, ఎయిర్‌ట్రావెలర్స్‌ అసోసియేషన్‌, ఏపీ టూర్స్‌ అండ్‌ ట్రావెలర్స్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు ఏపీసీసీఐఎఫ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ ఓరుగంటి నరే్‌షకుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

ముందు హైదరాబాద్‌ వెళ్లాల్సిందే

ఉత్తరాంధ్ర నుంచి సింగపూర్‌, మలేసియా మినహా ఇతర విదేశాలకు వెళ్లాలన్నా ముందుగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సిందే. అక్కడి నుంచి గమ్యస్థానాలకు చేరుకుంటారు. దీంతో సమయంతోపాటు ఆర్థికంగా భారంగా మారుతోంది. దీనినుంచి తమకు విముక్తి కలిగించాలని పలువురు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ నుంచే నేరుగా పలు దేశాలకు విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇది ఆచరణలోకి వస్తే ఇక్కడ వ్యాపారులు, విద్యార్థులు, పర్యాటకులు, టూర్‌ ఆపరేటర్లకు మంచిరోజులు వచ్చినట్లే. జిల్లాలో ప్రధానంగా రణస్థలం కేంద్రంగా పలు ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను సింగపూర్‌, జపాన్‌, దుబాయ్‌, శ్రీలంక తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.
ఇక్కడ కంపెనీలకు నిపుణులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు రావాలన్నా తొలుత హైదరాబాద్‌కు వెళ్లి.. తర్వాత విశాఖ వస్తున్నారు.
జిల్లాకు చెందిన చాలామంది విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ నిపుణులుగా రాణిస్తున్నారు. వారు ఇక్కడకు రావాలంటే హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు విశాఖలో జరగబోయే సదస్సుద్వారా వేగంగా ప్యాసింజర్‌, కార్గో విమానాలు మొదలయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామికంగా విశాఖలో పరిశ్రమల ఏర్పాటుకు స్థలాలు లేకపోవడంతో ఎక్కువ కంపెనీలు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వైపే మొగ్గుచూపుతున్నాయి. అందులో భాగంగా ఫార్మా కంపెనీలతోపాటు అణువిద్యుత్‌, థర్మల్‌ విద్యుత్‌ పరిశ్రమలు, పోర్టు రాబోతున్నాయి. దీంతో వివిధ దేశాల నిపుణులు ఇక్కడికి రాకపోకలు సాగించడానికి ఎక్కువ అవకాశముంది.
ఈ నేపథ్యంలో విశాఖ ఎయిర్‌పోర్టు అత్యంత కీలకంగా మారనుంది. అలాగే ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో శ్రీకాకుళానికి ఫార్మా రంగంలో కొత్తపెట్టుబడులతోపాటు జపాన్‌ నుంచి ఆహార ఎగుమతులకు సంబంధించిన పెట్టుబడులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో సిక్కోలుకు రాకపోకలు సాగించడానికి విశాఖలో ప్రారంభమయ్యే కొత్త కార్గో, ప్యాసింజర్‌ విమాన సర్వీసులు చాలావరకు మేలు చేయనున్నాయి.
Source By : http://www.andhrajyothy.com

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo