News

Realestate News

విశాఖ జోన్‌ ఉత్తరాంధ్ర ప్రజల కోరిక

విశాఖ జోన్‌ ఉత్తరాంధ్ర ప్రజల కోరిక
మంత్రి గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర ప్రజల మూడు దశాబ్దాల కోరిక విశాఖ రైల్వేజోన్‌ అని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రజల అభీష్టం మేరకు రైల్వే జోన్‌ ప్రకటించాలని కోరారు. విశాఖ రామకృష్ణ బీచ్‌రోడ్‌లోని వైఎంసీఎ వద్ద ఆదివారం ఉదయం రాజకీయేతర ఐకాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమంలో మంత్రి గంటా పాల్గొన్నారు. 200 అడుగుల బ్యానర్‌పై తొలి సంతకం చేసి మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైల్వే జోన్‌ కోసం ఎందరో పోరాటం చేస్తున్నారన్నారు. రాజకీయేతర ఐకాస కృషి అభినందనీయమన్నారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు కూడా సంతకం చేసి తన మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక కన్వీనర్‌ శివశంకర్‌,  ఎన్‌జిఒ సంఘం నేత ఈశ్వరరావు, వీజేఎఫ్‌ అధ్యక్షులు శ్రీనుబాబు, లాలం భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

కాపుల సంక్షేమానికి చర్యలు
కాపుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం రాత్రి గవర్నర్‌ బంగ్లాలో అఖిల భారత కాపు సమాఖ్య ప్రచురించిన జర్నల్‌ను మంత్రి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కాపుల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ. వెయ్యికోట్లు కేటాయించిందన్నారు. ప్రభుత్వం అందించే చేయూతతో ఆర్థికంగా ఎదగాలన్నారు. విశాఖలో కాపు భవనం నిర్మాణానికి స్థలం కేటాయించామన్నారు. సమావేశంలో గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, కాపు సంఘం నాయకులు అర్జునరావు, పొట్టిమూర్తి తదితరులు పాల్గొన్నారు.