విశాఖ – చెన్నై పారిశ్రామిక నడవలో రహదారుల విస్తరణ

జిల్లా పాలనాధికారి యువరాజ్
అచ్యుతాపురం, న్యూస్టుడే: విశాఖ – చెన్నై పారిశ్రామిక నడవలో భాగంగా జిల్లాలో రహదారులను విస్తరించనున్నట్లు జిల్లా పాలనాధికారి యువరాజ్ చెప్పారు. విస్తరించనున్న అచ్యుతాపురం కూడలిని మంగళవారం పరిశీలించారు. 26 మీటర్ల వెడల్పుతో 200 మీటర్ల వరకు స్థానిక కూడలిని విస్తరించనున్నట్లు కలెక్టర్కు మ్యాపు ద్వారా అధికారులు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పారిశ్రామిక నడవలో భాగంగా రహదారులను విస్తరించడంతోపాటు సమీపంలో ఉండే జాతీయ రహదారులకు అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. రానున్న 20 ఏళ్లలో వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని రహదారులను విస్తరిస్తున్నట్లు చెప్పారు. రహదారుల విస్తరణకు స్థానికులు సహకరించాలని కోరారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తామన్నారు. వుడా అధికారులతోపాటు ఆర్డీవో పద్మావతి, ఇన్ఛార్జి ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.