News

Realestate News

విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవ

విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవ
భూసేకరణ పనులు వేగవంతం
పరిహారం చెల్లింపునకు రూ. 900 కోట్ల విడుదల
జిల్లాకు సంబంధించిన అంశాలపై సీఎం సమీక్ష

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు జిల్లా అధికారులను ఆదేశించారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో గురువారం జిల్లాకు సంబంధించిన అంశాలపై కలెక్టర్‌ యువరాజ్‌ నివేదిక సమర్పించారు. ప్రత్యక్ష దృశ్య శ్రవణం పద్ధతిలో దీన్ని కలెక్టరేట్‌ నుంచి జిల్లా అధికారులు డి.వి.రెడ్డి, రామశాస్త్రి, ప్రసాద్‌ తదితర అధికారులు వీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పారిశ్రామిక కారిడార్‌ భూసేకరణ పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. భూసేకరణ పరిహార మొత్తం చెల్లించేందుకు త్వరలోనే రూ. 900 కోట్లు విడుదల చేస్తామన్నారు. రాంబిల్లి మండలం పూడి గ్రామంలో రానున్న ఏషియన్‌ పెయింట్స్‌ పరిశ్రమకు అవసరమైన పర్యావరణ అనుమతులు తక్షణమే ఇచ్చేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని సీఎం కలెక్టర్‌ను ఆదేశించారు. పరిశ్రమల్లో జరిగే ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలను చేపట్టాలన్నారు. కలెక్టర్‌ యువరాజ్‌ విజ్ఞప్తి మేరకు పరిశ్రమల్లో భద్రతపరంగా తీసుకోవల్సిన చర్యలపై పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రత్యేక కోర్సుల ప్రవేశపెట్టేందుకు చర్యలను తీసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. విశాఖ చేపలరేవును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. నగరంలో పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అవసరమైతే పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి ఏలేరు రిజర్వాయర్‌కు నీటిని మళ్లించి అక్కణ్నుంచి విశాఖకు తరలించాలని సీఎం ఆదేశించారు. విశాఖను ఆకర్షణీయ నగరంగా అభివృద్ధి సాధించే దిశగా వుడా, జీవీఎంసీ రూపొందించిన ప్రతిపాదనలకు సత్వరమే ఆమోదం తెలిపే విధంగా పురపాలక శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మన్యంలో కాఫీ, పసుపు, బంగాళాదుంప సాగు విస్తీర్ణం పెంచి, గిరిజనులకు ఆర్థిక దన్నుగా నిలవాలన్నారు. పోరాటానికి సిద్ధంగా ఉండండి!

రైతులకు ప్రతిపక్షాల పిలుపు
చందనాడ (నక్కపల్లి), న్యూస్‌టుడే: తరతరాల నుంచి ఆధారంగా వస్తున్న భూములను ప్రభుత్వం చేపడుతున్న సేకరణ నుంచి రక్షించుకోవాలంటే పోరాటం ఒక్కటే మార్గమని, ఇందుకు తామంతా న్యాయ, ప్రజా పోరాటానికి నిలబడతామని మీరంతా సిద్ధంగా ఉండాలని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ప్రజలకు సూచించారు. మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా ఇక్కడి పోరాట కమిటీ ఆధ్వర్యంలో చందనాడ గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో ప్రభుత్వం భూ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. తమ పార్టీ ఇక్కడి రైతుల వెంటే ఉంటుందన్నారు. వైకాపా నేత డీవీ సూర్యనారాయణరాజు మాట్లాడుతూ తెదేపా ప్రతిపక్షంలో ఉండగా భూసేకరణ చేయమని చెప్పి, అధికారం రాగానే వారే లాక్కుంటున్నారు. నక్కపల్లి క్లస్టర్‌ పరిధిలో 27వేల ఎకరాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ నర్సింరావు మాట్లాడుతూ ప్రభుత్వం దళారీగా మారి భూములు తీసుకుంటుంటే రైతులు చూస్తు వూరుకోరన్నారు. ఈ సందర్భంగా వీరితో పాటు పలువురు నాయకులు రైతులకు మద్దతుగా ఉంటామని, ఏ ఆందోళనకైనా సిద్ధమని వెల్లడించారు.. సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు ఏజే స్టాలిన్‌, రావు జగ్గారావు, జేవీ ప్రభాకర్‌, విమలావతి, వీసం రామకృష్ణ, ఎ.బాలకృష్ణ, లొడగల చంద్రరావు, ఎం.అప్పలరాజు, పొడగట్ల పాపారావు, అయినంపూడి మణిరాజు, గొర్ల బాబూరావు, మేడేటి శంకర్‌, పి.వెంకటస్వామి, గంటా తిరుపతిరావు, పిక్కి రాంబాబు, తళ్ల భార్గవ్‌కుమార్‌, సూరకాసుల గోవిందు, టి.సత్యనారాయణ పాల్గొన్నారు.