News

Realestate News

విశాఖ ఖ్యాతి పెంచేలా ‘బ్రిక్స్‌’ నిర్వహణ

Visakhapatnam increase the reputation of ' Bricks ' management, vizag news

వన్‌టౌన్‌ :

విశాఖ ఖ్యాతి ఇనుమడించేలా బ్రిక్స్‌ సదస్సును నిర్వహించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 14 నుంచి 16వరకూ విశాఖలో జరగనున్న బ్రిక్స్‌ సదస్సు ఏర్పాట్లపై అధికారులతో మంత్రి గంటా సమీక్షించారు. అయిదు దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ సదస్సు నిర్వహణకు 8 కమిటీలు వేశామన్నారు. అతిథులకు నగరంలో వివిధ హోటళ్లలో వసతి కల్పిస్తున్నామన్నారు. ఒకరోజు రాత్రి కైలాసగిరిపై, మరో రోజు పార్కుహోటల్లో రాత్రి భోజనాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కూచిపూడి, భరతనాట్యం, థింసా వంటి సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. సదస్సు నిర్వహణకు రూ.7.50 కోట్లు ఖర్చవుతుందని అంచనావేశామని, కేంద్రం రూ. 5 కోట్లు విడుదల చేసిందన్నారు. నగర పోలీసు కమిషనర్‌ యోగానంద్‌ మాట్లాడుతూ సదస్సు నిర్వహణకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అక్టోపస్‌ దళాలను రంగంలోకి దించుతున్నట్లు చెప్పారు. విమానాశ్రయం నుంచి నోవాటెల్‌ హోటలువరకు సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. సమీక్షలో ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్‌, వెలగపూడి రామకృష్ణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, కమిషనర్‌ హరినారాయణన్‌, జేసీ జె.నివాస్‌ తదితరులు పాల్గొన్నారు.