News

Realestate News

విశాఖ ఓడరేవులో ప్రాజెక్టుల ప్రారంభోత్సవం

విశాఖ ఓడరేవులో ప్రాజెక్టుల ప్రారంభోత్సవం
మహారాణిపేట, న్యూస్‌టుడే: విశాఖ ఓడరేవులో పలు భారీ ప్రాజెక్టులను శుక్రవారం కేంద్ర నౌకాయాన, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభించారు. తొలుత వీసీటీపీఎల్‌లో కేంద్ర పారిశ్రామిక రక్షణ దళాల(సీఐఎస్‌ఎఫ్‌)కు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారి నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం వీసీటీపీఎల్‌ భారీ క్రేన్లను, ఈవీటీఎల్‌లో ఇనుప ఖనిజ హ్యాండ్లింగ్‌ కాంప్లెక్స్‌, కాలుష్య నియంత్రణకు సీహార్స్‌ కూడలి నుంచి కాన్వెంట్‌ కూడలి వరకూ నిర్మించిన రక్షణ గోడను ప్రారంభించారు. పోర్టులో సుందరీకరణ, పచ్చదనం కోసం వేలాది మొక్కలు నాటే బృహత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రులు మన్సుఖ్‌ ఎల్‌మాండవీయ, కె.రాధాకృష్ణన్‌, పార్లమెంట్‌ సభ్యుడు కె.హరిబాబు, ఎమ్మెల్సీ మాధవ్‌, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, వీపీటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవాలు ఇవీ.. నీ విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(వీసీటీపీఎల్‌)లో రూ. 151 కోట్ల విలువైన భారీ కంటైనర్‌ హ్యాండ్లింగ్‌ క్రేన్లను మంత్రి గడ్కరీ ప్రారంభించారు. ఇందులో రెండు భారీ పానమాక్స్‌ క్యారీ క్రేన్లు, నాలుగు రబ్బర్‌ టైర్డ్‌ గాంట్రీ క్రేన్లను లాంఛనంగా ప్రారంభించారు. వీటి ద్వారా గంటలకు 27 నుంచి 30 వరకూ కంటైనర్లలోకి సరకు ఎగుమతి, దిగుమతి చేయవచ్చు.
విశాఖ ఓడరేవులో ఎస్సార్‌ వైజాగ్‌ టెర్మినల్‌ లిమిటెడ్‌(ఈవీటీఎల్‌) ఆధ్వర్యంలో నిర్మించిన ఇనుప ఖనిజ హ్యాండ్లింగ్‌ కాంప్లెక్స్‌ను శుక్రవారం కేంద్ర రవాణా, జాతీయ రహదార్లు, షిప్పింగ్‌ మంత్రి నితిన్‌ గడ్కరీ జాతికి అంకితం చేశారు. డిజైన్‌-బిల్ట్‌-ఫైనాన్స్‌- ఆపరేట్‌- ట్రాన్స్‌ఫర్‌(డీబీఎప్‌ఓటీ) విధానంలో ఈవీటీఎల్‌కు విశాఖ ఓడరేవు(వీపీటీ)కి మధ్య ఒప్పందంలో భాగంగా దీనిని నిర్మించారు. రూ. 830 కోట్ల వ్యయంతో 24 ఎంటీఏపీ సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేశారు. దేశంలోని అతి పెద్దదైన ఇనుప ఖనిజ హ్యాండ్లింగ్‌ కాంప్లెక్స్‌గా ఘనత సాధించింది. ఒక రోజులో నౌకల నుంచి 12 వేల టన్నుల సరకును ఎగుమతి, దిగుమతి చేసే సామర్థ్యం ఉంది.
 అనంతరం  సీహార్స్‌ కూడలి నుంచి కాన్వెంట్‌ కూడలి వరకూ నిర్మించిన రక్షణ గోడను, పోర్టు ఆవరణలో 2 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.