News

Realestate News

విశాఖ ఉత్సవ్‌లో స్థానిక కళాకారులకు అవకాశం ఇవ్వాలి

విశాఖ ఉత్సవ్‌లో స్థానిక కళాకారులకు అవకాశం ఇవ్వాలి
రాష్ట్ర మంత్రి అయ్యన్నను కోరిన కళాకారులు
ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని, విశాఖ ఉత్సవ్‌లో జిల్లాకు చెందిన కళాకారులకు అవకాశం ఇవ్వాలని విశాఖ కళా సంఘాల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శి వి.ఎన్‌.మూర్తి, చెన్నా తిరుమలరావులు రాష్ట్రమంత్రి అయ్యన్నపాత్రుడికి వినతిపత్రాన్ని అందజేశారు. కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో బినామీ ఈవెంట్‌ మేనేజర్లతో కుమ్మక్కై లక్షలాది రూపాయలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గతంలో మాదిరిగా విశాఖ సాంస్కృతిక ఉత్సవాల్లో ప్రాంతీయులకు ప్రాధాన్యత ఇవ్వాలని, స్థానిక కళా ప్రముఖులతో కూడిన సాంస్కృతిక ఉత్సవ కమిటీలను పునరుద్ధరించాలని కోరారు. దీనిపై స్పందించిన రాష్ట్రమంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ జిల్లా యంత్రాంగంతో చర్చించి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.