News

Realestate News

విశాఖలో సీ హారియర్‌ హెలికాప్టర్‌ మ్యూజియం

విశాఖలో సీ హారియర్‌ హెలికాప్టర్‌ మ్యూజియం

మార్చి నాటికి పర్యాటక ప్రగతి పనులు కొలిక్కి

బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌, అరకు ఎకో టూరిజం అభివృద్ధి

జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

ఈనాడు, విశాఖపట్నం: విశాఖలో సీ హారియర్‌ హెలికాప్టర్‌ ప్రదర్శనశాల ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు. టీయూ-142 యుద్ధవిమాన ప్రదర్శనశాల తరహాలో దీని ఏర్పాటుకు అవసరమైన కమిటీని ఏర్పాటు చెయ్యాలని సూచించారు. బుధవారం రాత్రి తన కార్యాలయంలో జిల్లా పర్యాటక ప్రగతిపై కలెక్టర్‌.. పర్యాటక శాఖ, ఏపీటీడీసీ, వుడా అధికారులతో సమీక్షించారు. పనులన్నీ మార్చి మాసాంతానికి కొలిక్కి రావాలని సూచించారు. పనుల ప్రగతిలో ఏమైనా ఆటంకాలుంటే ఎప్పటికప్పుడు చర్చించాలన్నారు. అరకు ఎకో టూరిజంతోపాటు బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌ పనులకు అవసరమైన స్థల సేకరణ, ఇతర చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు. లంబసింగిలో రూ. 5 కోట్లతో జరుగుతున్న రిసార్ట్స్‌ పనుల ప్రగతిపై ఆరా తీశారు. మార్చి నెలాఖరులో ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. యారాడ తీరంలోని దేవాదాయ భూమి లీజు పద్ధతిపై పార్కింగ్‌కు వినియోగించేలా ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా పర్యాటక అధికారి పూర్ణిమాదేవికి సూచించారు. రుషికొండ బీచ్‌ను బ్లూ ఫ్లాగ్‌ కింద అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నందున ఇక్కడ సురక్షితమైన స్విమ్మింగ్‌ జోన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. మంగమారిపేట ప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి ఎదురవుతున్న న్యాయపరమైన చిక్కులు, ఇతర అంశాలపై ప్రాంతీయ సంచాలకుడు శ్రీనివాసన్‌తో చర్చించారు. తొట్లకొండ అభివృద్ధికి విడుదల చేసిన రూ.కోటి నిధులతో తక్షణమే పనులు ప్రారంభించాలని వుడా ఈఈ సతీష్‌కు సూచించారు. సమీక్షలో సంయుక్త కలెక్టర్‌ జి.సృజన, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మిషాసింగ్‌, పర్యాటకశాఖ ఈఈ గంగరాజు, ఏపీటీడీసీ డీవీఎం ప్రసాద్‌రెడ్డి, దాసు తదితరులు పాల్గొన్నారు.