విశాఖలో.. ‘విరాట్’పర్వం!
500 ఎకరాల్లో మెగా టూరిజం ప్రాజెక్టుకు సన్నాహాలు
ఐఎన్ఎస్ విరాట్తోసహా ఇతర పర్యాటక సొబగులు
మూలకుద్దు ప్రాంతం అనువైనదిగా గుర్తింపు

విరాట్ కోసం.. నిధుల వేట!
ఐఎన్ఎస్ విరాట్ విమాన వాహక యుద్ధ నౌకను లంగరువేసి విశాఖ తీసుకురావడానికే రూ. 300 కోట్లు వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నిధులు ఎక్కడెక్కడ నుంచి సమకూర్చాలన్న దానిపై ఇప్పటికే స్పష్టతకు వచ్చిన అధికారులు పర్యాటక మంత్రిత్వ శాఖతోపాటు నౌకాయాన, ఆర్థిక మంత్రిత్వ శాఖలకు నిధుల కోసం రాష్ట్రం తరఫున ప్రతిపాదనలు పంపడానికి రంగం సిద్ధంచేస్తున్నారు. ఒక్క విరాట్‌ను ఏర్పాటుచేస్తే సరిపోదని.. దీనికి అనుగుణంగా ఇతర పర్యాటక హంగులతో మెగా టూరిజం ప్రాజెక్టుగా మారిస్తే పర్యాటకులను మరింతగా ఆకట్టుకునే వీలుందని భావిస్తున్నారు. జిల్లాకు పర్యాటకుల తాకిడి ఏటా పెరుగుతూనే ఉంది. గతేడాది జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను స్వదేశీ పర్యాటకులు 1.80 కోట్ల మంది సందర్శిస్తే.. విదేశీ పర్యాటకులు 78,266 మంది సందర్శించారు. విశాఖలో పర్యాటకాభివృద్ధికి మంచి అవకాశాలున్న నేపథ్యంలో విరాట్ కింద ఎంత వెచ్చించినా ఫర్యాలేదనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. భారీ ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నిధులు సమకూర్చే పరిస్థితిలో రాష్ట్రప్రభుత్వం లేకపోవడంతో కేంద్రంపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. విరాట్ ఏర్పాటుకు గోవా, మహారాష్ట్ర పర్యాటక శాఖలు పోటీపడుతుండడంతో ఈ భారీ ప్రాజెక్టు ఎవరివైపు మొగ్గుచూపుతుందో వేచిచూడాల్సిందే.
భీమిలి తీరంలో..
ప్రతిష్ఠాత్మక విరాట్ కొలువుదీరాలంటే 18 ఎకరాల స్థలం కావాలి.. ఈ యుద్ధనౌకతోపాటు పర్యాటకంగా వసతులు ఇతర హంగులు కల్పించే దిశగా పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకు భీమిలి మండలంలోని మూలకుద్దు ప్రాంతంలో 500 ఎకరాల స్థలం అనువైన ప్రాంతంగా గుర్తించారు. ప్రభుత్వ భూమి కొంత ఉంటే.. మరికొంత భూమి సేకరించాల్సి ఉంటుంది.. రెండు నెలల్లో ఈ మెగా ప్రాజెక్టు పూర్తిస్థాయి రూపంతో పర్యాటక శాఖ మరోమారు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం.