విశాఖలో..నాలుగు ఆర్థిక నగరాలు
లక్షమందికి ఇళ్ల నిర్మాణం
వచ్చే నెలలో ప్రాజెక్టు ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ వెల్లడి

వన్‌టౌన్, న్యూస్‌టుడే: విశాఖ నగర శివారు ప్రాంతాల్లో నాలుగు ఆర్ధిక నగరాల నిర్మాణం ద్వారా సుమారు రూ. 15 వేల కోట్ల నుంచి రూ. 20 వేల కోట్ల వరకు విశాఖ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు కలెక్టరు కార్యాలయంలో వివిధ రంగాలపై సమీక్షలు నిర్వహించారు. గృహనిర్మాణం, ఐటీ, పరిశ్రమల ఏర్పాటు, భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను ఆయా రంగాలకు చెందిన వారితో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన చెప్పిన విశేషాంశాలు…
* ప్రయివేటు భాగస్వామ్యంతో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని ఫిబ్రవరిలో ప్రారంభిస్తాం.
* అచ్యుతాపురం, ఆనందపురం మండలాల పరిధిలో కొత్త ఆర్థిక నగరాలు రానున్నాయి. అచ్యుతాపురంలో 330 ఎకరాల ప్రైవేటు భూముల్లో ఇళ్ల నిర్మాణానికి నిర్మాణదారులు ముందుకొచ్చారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 380 ఎకరాల్లో ఇళ్లను నిర్మించేందుకు అవకాశాలున్నాయి. ఆనందపురం ప్రాంతంలో ఇళ్ల కోసం 400 ఎకరాలను గుర్తించాం. అచ్యుతాపురం నుంచి నక్కపల్లి వరకు విస్తరించి ఉన్న పరిశ్రమల్లో పని చేస్తున్నవారికి చేరువలో ఇళ్లను నిర్మిస్తే వారికి సౌకర్యంగా ఉంటుంది.
* బహుళ అంతస్థుల భవనాలను నిర్మిస్తున్నచోట విద్య, వైద్యం, వినోదం, షాపింగ్ వంటి సకల సౌకర్యాలు కల్పిస్తాం.
* కోల్‌కతా వంటి నగరాల్లో తక్కువ విస్తీర్ణంలోనే భవంతులను నిర్మించి అల్పాదాయ, మధ్యతరగతి ప్రజలకు గృహ వసతి కల్పిస్తున్నారు. భవన నిర్మాతలు వాటిని పరిశీలించి రావాలి.
* కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అందరికీ ఇళ్ల పథకం కింద 30 చదరపు మీటర్ల నుంచి 60 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇళ్లను నిర్మిస్తే బ్యాంకు వడ్డీలో రూ. 2.20 లక్షల వరకు రాయితీ ఇస్తుంది.
* విశాఖ జిల్లాలో చేపట్టనున్న ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుకు కలెక్టర్ కన్వీనరుగా ఉంటారు.
* వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆధ్వర్యంలో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు ఐటీ టవర్లు విశాఖకు రానున్నాయి. దీనిపై ఆ సంస్థ సీఈవో సంప్రదింపులు జరిపారు. ఇవి వస్తే భవిష్యత్తులో లక్షమందికి ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయి.
* విశాఖలో ఐటీ ఉద్యోగుల కోసం పదివేల ఇళ్లను నిర్మిస్తాం.
* ఈ నెల 19న అమరావతిలో ఐటీ రంగ పురోగతిపై నిర్వహించే సమావేశానికి ఐటీ పారిశ్రామికవేత్తలు హాజరు కావాలి.
* విశాఖ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే వారి కోసం వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యం కల్పించేందుకు చర్యలను తీసుకుంటాం.
ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాస్తాం.
* విశాఖ నుంచి ఏటా 40 లక్షల నుంచి 50 లక్షల టన్నుల రెడీమేడ్ వస్త్రాలు ఎగుమతవుతున్న దృష్ట్యా విమానాశ్రయంలో కార్గో టెర్మినల్ ఏర్పాటుకు చర్యలను తీసుకుంటాం.
* విశాఖ, విజయవాడ మీదుగా కొలంబో నగరానికి విమానం నడిపే అంశాన్ని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రితో చర్చిస్తాం.
* విశాఖ ఐటీ సెజ్‌లో 43 సంస్థలకు స్థలాలు కేటాయించామని, ఇప్పటికీ నిర్మాణాలు చేపట్టని సంస్థలపై త్వరలో చర్యలు తీసుకుంటాం.
* వుడా ఆధ్వర్యంలో రానున్న మరో ఐటీ టవర్‌కు త్వరలోనే అనుమతులిస్తాం.
సమీక్షలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జేసీ సృజన, వుడా వీసీ బాబూరావునాయుడు, టౌన్షిప్ సంస్థ ఎండీ రామనాధ్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.