News

Realestate News

విశాఖకు పెట్రో పవర్‌

Visakhapatnam petrol Power
  • పెట్రో వర్సిటీకి శంకుస్థాపన 
  • నైపుణ్య వృద్ధి సంస్థకు శ్రీకారం 
  • ‘ప్రధాని ఉజ్వల్‌’ ప్రారంభం 
  • పెట్రో వర్సిటీ విద్యార్థులకు నాలుగేళ్ల తర్వాత ఉద్యోగాలు 
  • దానికి అంతర్జాతీయ ఖ్యాతి తెస్తాం 
  • కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ 
  • దేశం చూపు నవ్యాంధ్ర వైపు 
  • పుష్కలంగా నైపుణ్యం, వనరులు 
  • విశాఖ-రాజమండ్రి మధ్య పెట్రోలియం హబ్‌: చంద్రబాబు 

విభజన హామీల్లో మరొకటి సాకారమవుతోంది. ప్రతిష్ఠాత్మకమైన పెట్రో లియం వర్సిటీకి విశాఖలో శంకుస్థాపన జరిగింది. గురువారం విశాఖ వేదికగా మరో రెండు ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలూ మొదల య్యాయి. ‘నైపుణ్యాభివృద్ధి సంస్థ’తోపాటు… నిరుపేదల వంట కష్టాలు తీర్చేలా గ్యాస్‌ అందించే ‘ఉజ్వల్‌’ పథకానికీ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, ధర్మేంధ్ర ప్రధాన్‌ తదితరులు పాల్గొన్నారు. ‘ఏపీ ముఖచిత్రం మారు తోంది’ అని వెంకయ్య ఉద్ఘాటించారు.

దేశంలో అభివృద్ధి యాగం
ఏపీ ముఖచిత్రం మారుతోంది.. బాబు-మోదీ అభివృద్ధి జోడీ
నాడు సమాధి రాళ్లుగానే పునాది రాళ్లు.. నేడు పరిస్థితి మారింది
ఢిల్లీ – ఏపీ కలవాలి.. సీఎం-పీఎం చర్చించుకోవాలి: వెంకయ్య
ఏపీలో 62 వేల కోట్ల పెట్టుబడులు.. ఏడాదిలోగా
35 వేల కోట్లతో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన
హెచ్‌పీసీఎల్‌ విస్తరణకు డిసెంబరులో శ్రీకారం: ధర్మేంద్ర ప్రధాన్‌  

వంగలి (విశాఖపట్నం జిల్లా), అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): దేశంలో అభివృద్ధి యాగం జరుగుతోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీని అవినీతి పరుల పాలిట చండశాసనుడిగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, వెంకయ్య తదితరులు గురువారం విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలిలో పెట్రో వర్సిటీకి శంకుస్థాపన చేశారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ (స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌), ఇంటింటికీ గ్యాస్‌ కనెక్షన్లు అందించే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు, వెంకయ్య ప్రసంగించారు. ‘‘కేంద్రం మేకింగ్‌ ఆఫ్‌ డెవలప్డ్‌ ఇండియా లక్ష్యంతో ముందుకుసాగుతోంది. గతాన్ని తలచుకుని కాలక్షేపం చేయడం మా లక్ష్యం కాదు. సీఎం, పీఎం జోడీ రాషా్ట్రన్ని, దేశాన్ని ముందుకు తీసుకుపోతోంది’’ అని వెంకయ్య అన్నారు. ప్రతి గ్రామానికి పక్కా రోడ్లు, దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, ఏపీలో అనేక విద్యాసంస్థలు స్థాపించడం వెనుక మోదీ, చంద్రబాబు కృషి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుందని తెలిపారు. ‘‘గతంలో పునాదిరాళ్లు సమాధిరాళ్లుగా మిగిలిపోయేవి. ఇప్పుడా పరిస్థితి లేదని స్పష్టంచేశారు. ఏపీలో చంద్రబాబు ముందు చూపువల్ల కరెంటు కోతలు లేని రాష్ట్రంగా ఎదిగింది’’ అని వెంకయ్య పేర్కొన్నారు.

నావంతు సహకారం…

ఏ దేశమేగినా..ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టు ఎక్కడకు వెళ్లినా తెలుగు ప్రజలకు తన వంతు సహకారం అందిస్తానని వెంకయ్య తెలిపారు. ఢిల్లీ, ఏపీ కలవాలని… సీఎం, పీఎం సమస్యలపై చర్చించుకోవాలని సూచించారు. ‘హోదా’పై చేసిన విమర్శలను మరోమారు తిప్పికొట్టారు. ‘‘కొందరు డబ్బు పాచిపోయిందని విమర్శిస్తున్నారు. కేంద్రానిదైనా, రాషా్ట్రనిదైనా డబ్బు డబ్బే. వెచ్చిస్తున్న ప్రతి పైసా కష్టార్జితం’’ అని తెలిపారు. విద్యార్థులకు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. ఈ కేంద్రం ద్వారా ఏటా పది వేల మందికి శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాకిస్థాన్‌ కిరాయి మూకలకు ధైర్యంగా సమాధానం చెప్పింది మోదీ ప్రభుత్వమని… ఈ విషయంలో సైనికులకు ప్రతి ఒక్కరూ జేజేలు పలకాలని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక తిరోగమనంలో ఉంటే భారత దేశం మోదీ నేతృత్వంలో బలమైన శక్తిగా ఎదుగుతోందన్నారు.

ఎడ్యుకేషన్ హబ్‌గా సబ్బవరం
‘దేశానికి పెద్ద వనరు యువత. అది ఏపీలో పుష్కలంగా ఉంది. అలాగే సహజ వనరులకు కొదవ లేదు. యువతకు ప్రపంచాన్ని జయించే శక్తి ఉంది. గూగుల్‌ దేశవ్యాప్తంగా 20 మంది యువకులను ఎంపిక చేస్తే అందులో 13 మంది ఏపీకి చెందినవారే’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 1.22 లక్షల కోట్లతో పెట్రోలియం సెక్టార్‌లో అభివృద్ధి పనులను కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. స్కూళ్లు, కళాశాలలు అన్నీ డిజిటలైజ్‌ చేస్తున్నామని, ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తూ టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్నామని చెప్పారు. పరిశ్రమల అవసరం ఎలా ఉందో పరిశుభ్రత ఆవశ్యకత అంతే ఉందన్నారు.
వారంలో ఒక పూట సమాజం కోసం వెచ్చించాలని సీఎం కోరారు. అలాగే ప్రతి నెలా నాలుగో శనివారం ప్రజల కోసం, పరిశుభ్రత కోసం, స్వచ్ఛ భారత్‌ కోసం చైతన్యం తెచ్చేలా ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. దేశం మొత్తం ఏపీవైపే చూస్తోందన్నారు. విశాఖలోని సబ్బవరం ఎడ్యుకేషన్‌ హబ్‌గా ఎదుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సబ్బవరంలో ఇప్పటికే మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలు వెలిశాయని, భవిష్యత్తులో అవసరాలకోసం మరో 350 ఎకరాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. విశాఖ నుంచి రాజమండ్రి వరకు పెట్రోలియం హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఎన్డీఏ హయాంలోని దీపం పథకాన్ని పెడితే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్పేసిందన్నారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి వంద శాతం గ్యాస్‌ కనెక్షన్లు అడిగానని, కిరోసిన్‌ వినియోగం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కార్యక్రమంలో ఉజ్వల యోజన పథకం కింద పలువురు లబ్ధిదారులకు గ్యాస్‌ కనెక్షన్లు అందజేశారు.