News

Realestate News

విద్యా హబ్‌గా అనకాపల్లి

vizagrealestatenews

కలెక్టర్‌ యువరాజ్‌

నెహ్రూచౌక్‌(అనకాపల్లి), న్యూస్‌టుడే: విద్యాహబ్‌గా అనకాపల్లిని అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యువరాజ్‌ తెలిపారు. అనకాపల్లి పట్టణంలో స్థానిక జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జూనియర్‌ కళాశాల ఏర్పాటుకు ఆయన శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణానికి మూడేళ్లక్రితమే జూనియర్‌ కళాశాల మంజూరైనప్పటికీ స్థల కేటాయింపు ఆలస్యం కావడంతో నిర్మాణం జరగలేదన్నారు. రూ.2.68కోట్లు నాబార్డు నిధులతో ఈ కళాశాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ అనకాపల్లిని విద్యాకేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషిచేస్తానన్నారు. గ్రామీణ జిల్లాలో విద్యార్థులందరికీ అన్నికోర్సులు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. వచ్చే ఏడాదికి జూనియర్‌ కళాశాలను డిగ్రీ స్థాయికి తీసుకెళ్తామన్నారు. ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రత్యేకశ్రద్ధ తీసుకొని కళాశాల ఏర్పాటుకు కృషి చేశారన్నారు. కూండ్రం, అనకాపల్లిలో ఈ ఏడాదే తరగతులు ప్రారంభించడానికి కృషి చేస్తామన్నారు. పేదవిద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి బోధన అందివ్వడానికి తెదేపా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఆర్డీవో బి.పద్మావతి, తెదేపా నాయకులు బుద్ద నాగజగదీశ్వరరావు, మళ్ల సురేంద్ర, ఎంపీపీ కొణతాల వెంకటసావిత్రి, తహసీల్దార్‌ కృష్ణమూర్తి, హెచ్‌ఎం డీవీఎస్‌.శర్మ, డి.శ్రీనివాసరావు, కొత్తూరు సర్పంచి మేడిశెట్టి రాధ పాల్గొన్నారు.