News

Realestate News

విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకోవాలిCM to students: innovate and contribute to knowledge society - Sakshi

విశాఖ జ్ఞానభేరి సదస్సులో సీఎం చంద్రబాబు సూచన

సీఐఐ భాగస్వామ్య సదస్సుల్లో రూ.16 లక్షల కోట్ల ఒప్పందాలు

వాజ్‌పేయీ హయాంలో పోరాడి సెల్‌ఫోన్లు అందుబాటు లోకి వచ్చేందుకు కృషి చేశా

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కన్నవారికి ప్రాధాన్యం ఇస్తా

సాక్షి, విశాఖపట్నం: విద్యార్థులు వినూత్నంగా ఆలోచించి జ్ఞానం, కొత్త ఆవిష్కరణలతో ముందుకు దూసుకెళ్లాలని, నైపుణ్య విలువలను పెంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నాలెడ్జ్‌ ఉన్న వారే ప్రపంచాన్ని శాసిస్తారని చెప్పారు. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించిన జ్ఞానభేరి సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. ప్రపంచస్థాయి యూనివర్సిటీల ఫ్యాకల్టీలతో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు అనుసంధానం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, తాను స్కాలర్‌గా ఉన్నప్పుడే ఎమ్మెల్యే కావాలనుకుని సాధించానని తెలిపారు.

34 లక్షల మందికి ఉద్యోగాలు  
విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సుల్లో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో 34 లక్షల మందికి ఉద్యోగాలొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  వాజ్‌పేయీ హయాంలో టెలికాం రంగంలో డీరెగ్యులేషన్‌ కోసం తాను పోరాడి సెల్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చేందుకు కృషి చేశానన్నారు. ఇప్పుడు ఆ సెల్‌ఫోన్లకు, సోషల్‌ మీడియాకు యువత బానిసలవుతున్నారని చెప్పారు.

విభజన సమయంలో రాష్ట్రానికిచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. ఒకప్పుడు ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలున్న వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో అనర్హులను చేస్తూ చట్టం చేశామని, ఇప్పుడు అవసరమైతే ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కన్నవారికి ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. ‘‘ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ పాటించమన్నాను. జనాభా పెరుగుతోంది.. నీరు, భూమి పెరగడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పదేళ్లలో జనాభాను నియంత్రించాం. దీంతో జనాభా తగ్గిపోతోంది.

కొందరు పెళ్లిళ్లు కూడా చేసుకోవడం లేదు. కొందరు చేసుకున్నా పిల్లలు వద్దనుకుంటున్నారు. మన తల్లిదండ్రులు వద్దనుకుంటే మనం పుట్టేవారమా? అందుకే మళ్లీ నేనే ప్రమోట్‌ చేస్తున్నా. పిల్లల్ని కనండి.. పరిమితులొద్దు’’ అంటూ సీఎం చంద్రబాబు విద్యార్థుకు ఉద్బోధించారు. జ్ఞానభేరి కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఏయూ వీసీ జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచార సభలా సాగిన సదస్సు  
విశాఖలో ప్రభుత్వం నిర్వహించిన జ్ఞానభేరి సదస్సు ఎన్నికల ప్రచార సభను తలపించింది. విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించాలన్న లక్ష్యంతో అన్ని విశ్వవిద్యాలయాల్లో జ్ఞానభేరి పేరిట సదస్సులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి కార్యక్రమం తిరుపతిలో జరగ్గా, రెండో సదస్సును గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహించారు. గంటన్నర ఆలస్యంగా సాయంత్రం 4 గంటలకు సభా ప్రాంగణం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంలో తన రాజకీయ ప్రవేశం, సాధించిన విజయాల గురించి చెప్పుకోవడానికే మొగ్గు చూపారు. తాను స్కాలర్‌గా ఉన్నప్పుడే ఎమ్మెల్యే కావాలని లక్ష్యంగా నిర్దేశించుకుని సాధించానన్నారు.

హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీని ఏర్పాటు చేశానని, బిల్‌గేట్స్‌తో మాట్లాడి మైక్రోసాఫ్ట్‌ సంస్థను హైదరాబాద్‌కు తెచ్చానని, 9 ఏళ్ల పరిపాలనలో 300 ఇంజినీరింగ్‌ కాలేజీలు మంజూరు చేశానని, అనంతపురానికి కియా మోటార్స్‌ తెచ్చానని సుదీర్ఘంగా చెప్పుకొచ్చారు. ఇది రాజకీయ సభ కానప్పటికీ వాటి గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉందన్నారు. పట్టిసీమను పూర్తి చేశానని, పోలవరం కూడా పూర్తి చేస్తానన్నారు. నదుల అనుసంధానం తన స్వప్నమని పేర్కొన్నారు. ఎప్పటిలాగే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొంతమంది సహకరిస్తున్నందు వల్లే కేంద్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

విద్యార్థులతో ముఖాముఖి రద్దు
జ్ఞానభేరిలో ముఖ్యమంత్రితో విద్యార్థులు ముఖాముఖి మాట్లాడతారని అధికారులు ప్రకటించారు. కానీ, సీఎం చంద్రబాబు గంటన్నర సేపు ప్రసంగించాక సదస్సును ముగించేశారు. సీఎంతో ఎన్నో విషయాలు పంచుకుందామని వచ్చిన విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో విద్యార్థులకు పనికొచ్చే అంశాలు కంటే తాను చేసిన అభివృద్ధి పనుల గురించే చెప్పుకోవడంతో విద్యార్థులు విస్తుపోయారు.

సీఎం ప్రసంగం కొనసాగుతుండగానే విద్యార్థులు సదస్సు ప్రాంగణం నుంచి నిష్కృమించారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకుండా వెళ్లిపోయారు. దీంతో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. విశాఖ జ్ఞానభేరి సదస్సుకు 16 వేల మంది విద్యార్థులు వస్తారని అధికారులు ప్రచారం చేసినా, వాస్తవానికి అందులో సగం మంది కూడా హాజరు కాలేదు.

సీఎం ఓట్ల బాణం వేసినట్టు ఉంది  
‘‘జ్ఞానభేరి సదస్సు అంటే ఎంతో గొప్పగా ఊహించుకుని వచ్చాం. తీరా ఇక్కడ ముఖ్యమంత్రి ప్రసంగంలో రాజకీయాల గురించే ఎక్కువగా మాట్లాడారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో విద్యార్థుల ఓట్ల కోసం సీఎం బాణం వేసినట్టు ఉంది’’   – గౌతమ్, ప్రైవేట్‌ కళాశాల డిగ్రీ విద్యార్థి

జ్ఞానభేరికి వస్తే పిల్లలను కనమంటారా?
‘‘జ్ఞానభేరి కార్యక్రమంలో జ్ఞానం కలిగిస్తారనుకుంటే ముఖ్యమంత్రి విసుగు తెప్పించారు. విద్య, ఉద్యోగం, ఉపాధి, విజ్ఞానం గురించి చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఇద్దరు కాదు ఇంకా పిల్లలను కనండని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎన్నికల్లో పోటీకి ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వ్యక్తులకు ప్రాధాన్యం ఇచ్చే రోజులు వస్తాయని చెప్పడమేనా ముఖ్యమంత్రి ఇచ్చే సందేశం’’   – పి.సందీప్‌కుమార్, బీటెక్‌ విద్యార్థి