విద్యార్థులను ఆటల్లో ప్రోత్సహించండి: పీవీ సింధు
విద్యార్థులను ఆటల్లో ప్రోత్సహించండి: పీవీ సింధు

విద్యార్థులను ఆటల్లో ప్రోత్సహించండి: పీవీ సింధు
విద్యార్థులను చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి,
పద్మశ్రీ పి.వి.సింధు తెలిపారు.
పట్టణంలోని ప్రశాంతినికేతన్ పాఠశాల 28వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.
రావుగోపాలరావు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమానికి సింధు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈమెకు అనకాపల్లివాసులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సింధు మాట్లాడుతూ విద్యార్థుల ఆసక్తిని
గుర్తించి దీనికి తగ్గ శిక్షణ అందిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
తాను క్రీడల్లో రాణిస్తూనే ఎంబీఏ చదువుతున్నానని గుర్తుచేశారు.
ఏ రంగంలో రాణించాలన్నా దానికి కఠోర శ్రమ అవసరమన్నారు.
బ్మాడ్మింటన్ క్రీడాకారిణిగా ఎంతో శ్రమించి ఈ స్థానానికి చేరుకున్నానని..
తనకొచ్చిన ఈ గుర్తింపు వెనుక తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందని తెలిపారు.
ప్రశాంతి నికేతన్ పాఠశాలలో పదిపాయింట్లు సాధించిన విద్యార్థులకు గత ఐదేళ్లుగా రూ. లక్ష చొప్పున నగదు బహుమతి
అందించడం అభినందనీయమన్నారు.
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ పీవీ సింధును విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని అన్ని రంగాల్లో
రాణించాలన్నారు. పాఠశాల కరస్పాండెంట్ డి.వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పది పాయింట్లు సాధించిన విద్యార్థులకు
అందించే ఆర్థిక సాయం వారి ఉన్నత చదువులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి, డైట్ ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్ దాడిరత్నాకర్,
అర్జున అవార్డు గ్రహీత పి.రమణ,
తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి చందు గంగపుత్ర, వినియోగదారుల సంఘ అధ్యక్షులు వికాస్ పాండే,
విశ్రాంత ఏసీపీ ఖాన్, పాఠశాల కరస్పాండెంట్ డి.చంద్రశేఖర్ పాల్గొన్నారు.
అంతకుముందు కశ్మీర్ ఉగ్రవాద దాడిలో మృతిచెందిన జవాన్లకు నివాళి అర్పించారు.
గత ఏడాది పదోతరగతి పరీక్షలో పదిపాయింట్లు సాధించిన ప్రశాంతి నికేతన్ పాఠశాల విద్యార్థులు డి.అపర్ణ తేజస్వి,
కిరణ్మయి, జాహ్నవి, ఎం.రమ్య, పి.లక్ష్మీసాయి, వెన్నెల, ఉదయ్‌కిరణ్, రోహిత్‌సాయి,
పవన్‌కుమార్, రోహిత్ కుమార్, మనోహర్, నవీన్, రాజేష్, మార్తారుత్, అమీషాదత్తా,
అనీషా శర్మలకు రూ.లక్ష చొప్పున నగదు బహుమతి పీవీ సింధు చేతులమీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా సింధు, ఆమె తండ్రి రమణను సత్కరించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు: ప్రశాంతినికేతన్ పాఠశాల 28వ వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులు
నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
నర్సరీ నుంచి పదోతరగతి వరకు విద్యార్థులు నిర్వహించిన నృత్యాలు అలరించాయి.
దేశభక్తి గీతాలు, భరతనాట్యం, కూచిపూడి, పాశ్చాత్య నృత్యాల్లో విద్యార్థులు అలరించారు.