విద్యాభివృద్ధికి రోటరీ మరింత చేయూత
విద్యాభివృద్ధికి రోటరీ మరింత చేయూత
జిల్లాలో వెనుకబడిన పాఠశాలలకు డిజిటల్ పరికరాలు

దేశంలో విద్యాభివృద్ధి రోటరీక్లబ్ ద్వారా విస్తృత సేవలు అందిస్తున్నామని రోటరీక్లబ్ జిల్లా గవర్నర్ జి.విశ్వనాథం తెలిపారు.
పట్టణంలో గురువారం ఆయన పర్యటించి పలు కార్యక్రమాలను ప్రారంభించారు.
అనంతరం న్యూకాలనీ పాలూరి చిదంబరం రోటరీ హాల్లో క్లబ్ అధ్యక్షులు అర్రెపు కామేష్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా రోటరీక్లబ్ విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు బెంచీలు, శుద్ధ తాగునీటి యంత్రాలు, విద్యార్థులకు నోటుపుస్తకాలు, ప్రతిభ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నామన్నారు.
విద్యార్థుల్లో ప్రతిభ వెలికితీసేందుకు యువజనోత్సవాలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేస్తున్నామని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ వరకు వెనుకబడిన ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి ఈ ఏడాది 500 పాఠశాలలకు డిజిటల్ పరికరాలు అందజేశామన్నారు.
మిగిలిన పాఠశాలలకు 2019లో అందజేస్తామన్నారు.
కేరళ వరద బాధితులకు 3 వేల ఇళ్లు నిర్మాణం రోటరీ తరఫున చేపడుతున్నామన్నారు.
అనంతరం మలేషియా రోటరీ సభ్యులు గంగయ్య ఆర్థిక సహాయంతో రూ.2.50 లక్షలు విలువచేసే బెంచీలను, మార్టూరు, వెదురుపర్తి, మునగపాక, అనకాపల్లి పాఠశాలలకు
అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా సహాయ గవర్నర్ బుద్ద రమణాజీ, క్లబ్ కార్యదర్శి పీజే.నాయుడు, కోశాధికారి బి.సోమసుందర్,
కంటి ఆసుపత్రి ఛైర్మన్ ఉప్పల రవిరామ్జోహర్, పూర్వపు అధ్యక్షులు బుద్ద సత్యనారాయణ, రామకృష్ణ, సతీష్, జిల్లా ఉపవిద్యాశాఖాధికారి కేవీ.గౌరీపతి పాల్గొన్నారు.