News

Realestate News

వాల్తేరు రికార్డు గత 8 ఏళ్లలో అత్యధిక సరుకు రవాణా

వాల్తేరు రికార్డు
గత 8 ఏళ్లలో అత్యధిక సరుకు రవాణా
డివిజన్‌ పని సామర్థ్య సూచీ 34.81
పురోగతిని వెల్లడించిన డీఆర్‌ఎం

వాల్తేరు రైల్వే డివిజన్‌ సరుకు రవాణాలో రికార్డు సాధించింది. గత 8ఏళ్లలో చూస్తే తాజాగా సాధించిన 56.54 మిలియన్‌ టన్నుల రవాణానే రికార్డుగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందులో అత్యధికంగా 19.79 మిలియన్‌ టన్నుల బొగ్గును రవాణా చేశారు. ఇది గతసారి కన్నా 16.62 శాతం అధికం. అలాగే ఎరువుల్ని7.46 శాతం, లైమ్‌స్టోన్‌ను 12.50శాతం గతేడాదికన్నా అధికంగా తరలించారు. అలాగే 33 రేక్‌ల మామిడిపండ్లను తరలించి రూ.8.13 కోట్లను రైల్వే గడించింది.

ఈనాడు – విశాఖపట్నం, న్యూస్‌టుడే – రైల్వేస్టేషన్‌
వాల్తేరు రైల్వే డివిజన్‌ గత 8 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే ఈ ఏడాది అత్యధిక సరుకును రవాణా చేసినట్లు డీఆర్‌ఎం ముకుల్‌ శరణ్‌ మాథుర్‌ వెల్లడించారు. 56.54 మిలియన్‌ టన్నుల సరుకును రవాణా చేసి రికార్డు సృష్టించినట్లుగా తెలిపారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. వాల్తేరు డివిజన్‌ పని సామర్థ్య సూచీలో (పెర్‌ఫార్మెన్స్‌ ఎఫీషియన్సీ ఇండెక్స్‌-పీఈఐ) ఉత్తమంగా ఉందని, ప్రస్తుతం 34.81గా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. 2017-18లో రూ.7213.94 కోట్లు ఆదాయం రాగా.. ఇందులో స్థూల పని ఖర్చు రూ.2511.34 కోట్లుగా ఉందని తెలిపారు. దీన్ని మరింత మెరుగ్గా తీసుకెళ్తామని ఆయన వివరించారు. డివిజన్‌ను మరింత అభివృద్ధిపథంలో తీసుకెళ్లేందుకు తమ అధికారులు శాయశక్తులా కృషిచేస్తారని తెలిపారు. ప్రస్తుతం బనారస్‌ వరకు రైలు ప్రతిపాదనలో ఉందని, అయితే ప్రస్తుతం రైల్వేలో రేక్‌ల కొరత   ఉందని వివరించారు. త్వరలో తమకు రేక్‌ వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. అలాగే అరకు వరకు రెండో విస్టాడోమ్‌ కోచ్‌ కోసం కూడా రైల్వేబోర్డుకు లేఖలు రాశామని తెలిపారు. ఈ ఏడాదిలో విశాఖ రైల్వేస్టేషన్‌ పునరాభివృద్ధిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అన్నారు. డివిజన్‌లో రైల్వే ఎలాంటి వృద్ధి సాధించిందో పలు గణాంకాల్ని ఆయన మీడియా ముందు ఉంచారు.
ప్రకటనల ఆదాయం: బ్రాండింగ్‌ ప్రకటనల్లో భాగంగా స్వర్ణజయంతీ ఎక్స్‌ప్రెస్‌ రైలు మొత్తం ఆర్‌ఐఎన్‌ఎల్‌ సంస్థ ఒక్కో రేక్‌కు రూ.1కోటి చెల్లిస్తోంది. దీంతో 4 రేక్‌లకు రూ.4కోట్లు ఆదాయం వస్తోంది.

ప్రత్యేక రైళ్లు..: 2017-18లో డివిజన్‌ నుంచి 533 ప్రత్యేక రైళ్లు నడిచినట్లు అధికారులు వెల్లడించారు.ప్రయాణికుల వసతుల్లో కొన్ని..
16 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సేవల్ని తీసుకొచ్చారు. ఇందులో 12 రైల్వేస్టేషన్లు కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ÷ విజయనగరం రైల్వేస్టేషన్‌లో రైల్వే వారసత్వ సంపద ఉట్టిపడేలా వెయిటింగ్‌హాల్‌ను ఏర్పాటు చేశారు. విశాఖ రైల్వేస్టేషన్‌లో ఆర్ట్‌ గ్యాలరీని తెచ్చారు. ÷ సీఎస్‌ఆర్‌ కింద రూ.72లక్షలతో విశాఖలో అధునాతన మరుగుదొడ్లను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో..
ప్రాజెక్టులు, పనులకు వెచ్చించిన మొత్తం – రూ.386 కోట్లు
రెవెన్యూలో భాగంగా పెట్టిన ఖర్చులు – రూ.2563 కోట్లు
భద్రత కోసం పెట్టిన ఖర్చు – రూ.350 కోట్లు

భద్రత కోసం..
17 లెవెల్‌ క్రాసింగ్‌ల మూసివేత.. 24 చోట్ల పరిమిత ఎత్తులో సబ్‌వేల ఏర్పాటు
పట్టాల్ని నిత్యం పర్యవేక్షిస్తున్న సిబ్బందికి జీపీఎస్‌ వ్యవస్థతో కూడిన పరికరాల అందజేత. లోపాల నివారణ సులభతరం.

నీలిరంగులో ప్లాట్‌ఫామ్‌లు
పారిశుద్ధ్య ప్రక్రియను సులభతరం చేసేలా విశాఖ రైల్వేస్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫామ్‌ల్లోని పట్టాల్నీ నీలిరంగులో అప్రాన్‌లను ఏర్పాటు చేశారు. దీనివల్ల జిడ్డుదనం ఉండదు. సులభంగా వ్యర్థాల్ని నీటితో స్ప్రే చేయడం ద్వారా తొలగించవచ్చు.

విద్యుత్తు ఆదా..:
విశాఖలోని డీఆర్‌ఎం కార్యాలయం, రైల్వే ఆసుపత్రి, డీఎల్‌ఎస్‌, ఈఎల్‌ఎస్‌ల్లో 1 మెగావాట్‌ సామర్థ్యం ఉన్న సోలార్‌ పలకల్ని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఏడాదికి రూ.22.55 లక్షలు ఆదా.
డివిజన్‌లో మొత్తం 112 రైల్వేస్టేషన్లను 100శాతం ఎల్‌ఈడీ వినియోగంగా తీర్చిదిద్దారు. దీంతో ఏటా 2లక్షల యూనిట్లు ఆదా అవడంతో పాటు రైల్వేకు రూ.15.45 లక్షలు మిగులుతోంది.
30 వాట్‌ల సామర్థ్యం ఉండే 160 ఎల్‌ఈడీ బల్బుల్ని విశాఖ, విజయనగరం, రాయగడ, కోరాపూట్‌, జగదల్‌పూర్‌, కిరండూల్‌ స్టేషన్లలోని రోలింగ్‌ స్టాక్‌ పాయింట్లలో ఉంచారు.

అవార్డులు: వాల్తేరు డివిజన్‌ తాజాగా 63వ రైల్వే వారోత్సవాల అవార్డుల్లో 11 షీల్డ్‌లను సొంతం చేసుకుంది. అలాగే వివిధ విభాగాల్లో 18 జనరల్‌ మేనేజర్‌ అవార్డుల్నీ అందుకుంది. ఇందులో కేకేలైన్‌లోని 249వ బ్రిడ్జిని 58రోజుల రికార్డు సమయంలో పూర్తిచేయడం ఒకటి. ఇది ఒక పూర్తి రైల్వేస్టేషన్‌ను నిర్మించడంతో సమానమని, దీన్ని ఉన్నతాధికారులు అభినందించినట్లు డీఆర్‌ఎం తెలిపారు.

తనిఖీలు:
2017-18లో టికెట్‌ లేకుండా ప్రయాణించిన 3.5 లక్షల మందిని గుర్తించారు. వీరినుంచి రూ.13.063 కోట్లను జరిమానాగా వసూలు చేశారు.
1770 ప్రత్యేక ఆకస్మిక తనిఖీలు చేసి, వాటిద్వారా రూ.6.726 కోట్ల ఆదాయాన్ని సమకూర్చారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo