News

Realestate News

వచ్చేస్తోంది.. ‘రింగ్‌’రోడ్డు!

వచ్చేస్తోంది.. ‘రింగ్‌’రోడ్డు!
4.4 కి.మీ.లకు రూ.5 కోట్ల కేటాయింపు
జీవీఎంసీ, వుడా భాగస్వామ్యం
ట్రాఫిక్‌ కష్టాలకు చెల్లుచీటి!

విశాఖ నగరానికి ప్రధాన ద్వారంలా ఉండే గాజువాక శిఖలో మరో మణిహారం చేరనుంది. ఇప్పటికే పారిశ్రామిక ప్రాంతంగా పేరుగాంచిన ఈ పట్టణంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రింగ్‌రోడ్డు నిర్మాణం కానుంది. పెరుగుతున్న పట్టణ రద్దీని దృష్టిలో పెట్టుకుని జీవీఎంసీ, వుడా భాగస్వామ్యంతో 4.4 కిలోమీటర్ల పొడవైన ప్రత్యామ్నాయ రింగురోడ్డును అభివృద్ధి చేయనున్నారు. మూడు రోజుల క్రితం ఈ రహదారి పనులకు శంకుస్థాపన జరగడంతో వాహనదారులు, స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈరోడ్డు అందుబాటులోకి వస్తే గాజువాక ప్రధాన రహదారి, కణితిరోడ్డులో ట్రాఫిక్‌ కష్టాలకు తెరపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

గాజువాక, న్యూస్‌టుడే
కణితిరోడ్డు వంటిల్లు కూడలి నుంచి పంపుహౌస్‌, గోపాల్‌రెడ్డినగర్‌, వినాయకనగర్‌, రాయలు (జగ్గు)సెంటరు నుంచి కణితిరోడ్డును కలిపేలా ఈ రింగు రోడ్డును తీర్చిదిద్దుతారు. గతంలో వుడా 130 అడుగుల రోడ్డుకోసం విశాలమైన స్థలం కేటాయించగా దీన్ని కలుపుతూ సర్కిల్‌రోడ్డును తీసుకురాబోతున్నారు. ఇటీవల వుడా వీసీ బాబూరావునాయుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఈ రోడ్డును పరిశీలించి వెళ్లారు. ఈ రహదారిలో ఒక కి.మి.రోడ్డును రూ.1.4 కోట్లతో జీవీఎంసీ, మిగిలిన 3.4 కి.మి.రోడ్డును వుడా రూ.3.6కోట్లతో అభివృద్ధి చేస్తుందని జోన్‌-5 డి.ఇ.ఇ. నాగేశ్వరరావు తెలిపారు.

ఇటు పెదగంట్యాడ, అటు ఉక్కు నిర్వాసితకాలనీల నుంచి గాజువాక రావడానికి ఈ రహదారి వెసులుబాటుగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే జీవీఎంసీ నిధులతో రాయలు(జగ్గు)కూడలి వద్ద పనులు ప్రారంభమయ్యాయి. ఆరునెలల్లో మొత్తం ఈ రింగు రోడ్డు చేరువలోకి వస్తుందని జీవీఎంసీ అధికారులు వివరించారు.

మొత్తం 130 అడుగుల వెడల్పు ఉండే ఈ రహదారిలో అటూ ఇటూ 40 అడుగుల చొప్పున రహదారులు, మధ్యలో 50 అడుగుల వెడల్పుతో పచ్చని ప్రాంతం(గ్రీన్‌ బెల్ట్‌ డివైడర్‌)ను అభివృద్ధి చేస్తారు. ఇందులో పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఆట పరికరాలు, పెద్దలు కూర్చునేలా బల్లలు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు.