లక్ష్యాలు.. లెక్కలకు పొంతనేది?
లక్ష్యాలు.. లెక్కలకు పొంతనేది?
బ్యాంకర్ల తీరుపై కలెక్టర్ ఆగ్రహం
మెగా గ్రౌండింగ్ మేళాను ఈ నెల 12న నిర్వహిస్తున్నామని,
దీన్ని విజయవంతం చేయాలని బ్యాంకర్లను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ కోరారు.
మంగళవారం ఉదయం కలెక్టరేట్ సమావేశమందిరంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక మద్దతు పథకం,
ఆదరణ-2 పథకం కింద గత ఏడాది నుంచి ఇంత వరకు మంజూరు చేసిన యూనిట్ల గ్రౌండింగ్ మేళాను పెద్ద ఎత్తున నిర్వహించాలని
ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.
జిల్లాలో వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో రూ.44.64 కోట్ల విలువ చేసే 10,537 యూనిట్లను ఒకేసారి ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందన్నారు.
దీనికి అనుగుణంగా అధికారులంతా సమాయిత్తం కావాలన్నారు.
* బ్యాంకు శాఖల వారీ నిర్దేశిత లక్ష్యాలు సాధించే క్రమంలో ఎంతో వ్యత్యాసం ఉందని,
దీనికి కారణాలు ఏమిటని కలెక్టర్ ప్రశ్నించారు.
క్షేత్ర స్థాయిలో పథకాలను అమలు చేయడంలో బ్యాంకర్లు అలక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,
రాయితీ మొత్తాలను తమ వద్ద ఉంచుకొని వ్యాపారాలు చేసుకుంటున్నాయని,
పథకాలను మాత్రం లబ్ధిదారులకు చేర్చడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు.
* బ్యాంకుల వారీ నిర్దేశిత లక్ష్యాలను, సాధించిన ప్రగతిని కలెక్టర్ సమీక్షిస్తూ లక్ష్యాలకు, బ్యాంకులు చూపుతున్న లెక్కలకు పొంతన లేదని లీడ్
బ్యాంకు మేనేజరు, సహాయ మేనేజర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే పద్ధతి కొనసాగిస్తే వెనక్కి పంపిస్తానని హెచ్చరించారు.
జేసీ సృజన, జేసీ2 సిరి, ఎల్డిఎం శ్రీనాథ్ ప్రసాద్, ఏఎల్డిఎం జెఎల్ఎన్ మూర్తి,
వివిధ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.
* ఈనెల 12వ తేదీలోపు మంజూరు అయిన అన్ని యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని,
లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.
రాయితీ మొత్తాలతో పాటు డిపాజిట్లను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. రుణాల రికవరీకి సహకరింబోమన్నారు.