రైల్వేజోన్ ఖాయం
ఎలాంటి సందేహాలొద్దు
స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఈనాడు, విశాఖపట్నం

పర్యావరణహితంగా లోకోమోటివ్‌లు
విశాఖలో ఇదివరకే ఉన్న డీజిల్ లోకోషెడ్ (డీఎల్ఎస్)లో హైహార్స్ పవర్‌తో కూడిన 100 లోకోమోటివ్‌లు సరిపడేంత సామర్థ్యాన్ని అదనంగా పెంచుతున్నట్లు రైల్వేమంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు. ఇక్కడి లోకోమోటివ్‌లు పర్యావరణహితంగా.. ఉంటాయని స్పష్టం చేశారు. తక్కువ ధరతో తయారై, ఎక్కువ నాణ్యతనిచ్చే లోకోమోటివ్‌లు మనదేశంలో తయారవుతున్నట్లు తెలిపారు. విశాఖ రైల్వేస్టేషన్‌ను విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విశాఖ – అరకు మధ్య విస్టాడోమ్ కోచ్‌ను నడిపితే దీన్నసలు ఆదరిస్తారా అని కొందరు అనుమానాలు వ్యక్తంచేశారని, కానీ ఈ కోచ్‌కు మంచి స్పందన వస్తోందని చెప్పారు. విశాఖ రైల్వేస్టేషన్ వేదికగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వ్యాగన్ వర్క్‌షాప్ వల్ల నిరుద్యోగ సమస్య తగ్గుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇందులోని ఉద్యోగాలు ఆర్ఆర్బీ ద్వారా భర్తీ అవుతాయని, స్థానిక యువతకూ మేలు జరిగేలా చూడాలని డీఆర్ఎం ఎం.ఎస్. మాథుర్‌ను కోరారు. విశాఖకు వచ్చిన రెండు ప్రాజెక్టులూ అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవిగా డీఆర్ఎం మథూర్ అభివర్ణించారు. వ్యాగన్ వర్క్‌షాప్‌కు ఈ నెల 20న ఆర్ఎఫ్పీ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని.. రెండేళ్లకాలంలో పనులు పూర్తవుతాయన్నారు. కార్యక్రమం కోసం విశాఖ రైల్వేస్టేషన్‌లోని 8వ నెంబరు ప్లాట్‌ఫామ్‌పై వేదికను ఏర్పాటు చేశారు. ఏడీఆర్ఎం అజయ్ అరోరా, ఆర్వీఎన్ఎల్ జీఎం ఎం.శ్రీనివాస్, సీనియర్ డీఎంఈ పాత్రో తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వీరంతా కలిసి విశాఖ వేదికపై జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రాజెక్టుల శంకుస్థాపన సూచకంగా ఫలకాల్ని ఆవిష్కరించారు.
వ్యాగన్ వర్క్‌షాప్ ప్రత్యేకతలివి..
నెలకు 200 వ్యాగన్లను ఓవర్‌హాలింగ్ చేసే సామర్థ్యాల్ని కలిగేలా నిర్మిస్తారు.
ప్రస్తుత వాల్తేరు డివిజన్‌కు సంబంధించిన వ్యాగన్ల ఓవర్‌హాలింగ్ ప్రక్రియ రాయంపాడు, రాయ్‌పూర్, ఖరగ్‌పూర్ వ్యాగన్ వర్క్‌షాపుల్లో జరుగుతోంది.
2015-16లో వడ్లపూడిలో ఈ వ్యాగన్ వర్క్‌షాప్ ఏర్పాటుకు అనుమతులొచ్చాయి.
ప్రాజెక్టుకు మంజూరైన మొత్తం రూ. 213.97 కోట్లు. ఇంకా రూ. 28.81 కోట్ల అవసరం ఉంది.
240 ఎకరాల్ని కేటాయించారు.
ప్రాజెక్టు నమూనాలన్నీ 2016లో పూర్తయ్యాయి. పూర్తిస్థాయి ప్రతిపాదనలు గత ఏప్రిల్‌లో పూర్తయ్యాయి.
మే 6న టెండర్లు పిలిచారు. రూ. 274.56 కోట్ల విలువైన పనులతో కూడిన ఈ టెండర్లను ఈ నెల 20న తెరుస్తారు.
డీఎల్ఎస్ విస్తరణ ప్రత్యేకతలు..
1965లో ఏర్పాటైన విశాఖ డీజిల్ లోకోషెడ్‌కు జాతీయస్థాయిలో మంచి పేరుంది.
ప్రస్తుతం దీని పరిధిలో 285 లోకోమోటివ్‌లు ఉన్నాయి.
4500హెచ్‌పీ సామర్థ్యంతో ఉన్న హైహార్స్పవర్ లోకోలు 2013లోనే 79 కేటాయించారు. దీన్ని 100కు పెంచేందుకు విస్తరణ చేయనున్నారు.
విస్తరణ కోసం 10 ఎకరాలు కేటాయించారు. దీని నిర్మాణానికి రూ. 67.5 కోట్లు ఖర్చవుతాయి.