News

Realestate News

రైల్వేజోన్‌ ఖాయం

రైల్వేజోన్‌ ఖాయం
ఈ ఏడాది నుంచే మెడ్‌టెక్‌జోన్‌లో ఉత్పత్తి ప్రారంభం
ఎంపీ హరిబాబు
ఈనాడు – విశాఖపట్నం

విశాఖ నగరానికి రైల్వేజోన్‌ రావడం ఖాయమని, ఆ మేరకు భాజపా రాజకీయ నిర్ణయం తీసుకుందని, దానిని ఎప్పుడు ప్రకటిస్తారన్నది త్వరలో తెలుస్తుందని విశాఖ ఎంపీ హరిబాబు పేర్కొన్నారు. మంగళవారం ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే…

విశాఖవాసుల చిరకాల వాంఛ రైల్వేజోన్‌ మంజూరుకు భాజపా కట్టుబడి ఉంది. దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ వ్యతిరేక నివేదిక ఇచ్చినా.. కేంద్రం రాజకీయ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గత జూన్‌ 13న నిర్వహించిన సమావేశంలో నాతో స్పష్టంగా చెప్పారు. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరణను కూడా అడ్డుకున్నాం. డీసీఐ ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో కేంద్రం తన నిర్ణయాన్ని పక్కన పెట్టింది. అనకాపల్లి – ఆనందపురం ఆరువరుసల జాతీయ రహదారి నిర్మాణాన్ని కూడా సాకారం చేశాం. రూ. 2,561 కోట్ల ఈ ప్రాజెక్టు మూడేళ్లలో అందుబాటులోకి వస్తుంది.

విశాఖలో ఐ.ఐ.ఎం.ను ఏర్పాటు చేసి యుద్ధప్రాతిపదికన తాత్కాలిక భవనంలో తరగతులు ప్రారంభించాం. తాజాగా పూర్తైన బ్యాచ్‌లో ప్రతి ఒక్కరికీ సగటున కనీసం రూ.లక్షకన్నా అధికంగా నెలసరివేతనం అందింది. జాతీయ సంస్థలకు నిధులివ్వడం లేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. కేంద్రం దశలవారీగా, పనుల పూర్తి ఆధారంగానే మంజూరు చేస్తుంది. ప్రతీ జాతీయ సంస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి కనీసం ఏడేళ్లు పడుతుంది. విశాఖలోని సంస్థలకు ఏడేళ్లలోపే నూతన ప్రాంగణాలు సమకూరాయి.

విశాఖ రైల్వే అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చించడానికి రైల్వేశాఖ నిర్ణయించింది. నూతన రైల్వే వ్యాగన్‌ వర్క్‌షాపు నిర్మాణం, ఎలక్ట్రిక్‌, డీజిల్‌ లోకోషెడ్ల విస్తరణ, ఆధునికీకరణ పనులకు రూ. 690 కోట్లను వెచ్చించనుంది. వీటివల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రైల్వేల పరంగా నాణ్యమైన సేవలందుతాయి. మెడ్‌టెక్‌ పార్కు నిర్మాణానికి కేంద్రం తరపున పూర్తి సహకారాన్ని అందిస్తున్నాం. ఆ పార్కు ప్రతినిధులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నా. 175 సంస్థలు తమ విభాగాల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. కొన్ని ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించాయి. ఈ ఏడాదిలోనే కొన్ని సంస్థల నిర్మాణం పూర్తై ఉత్పత్తి కూడా మొదలవుతుంది.

భారత పెట్రోలియం, శక్తి సంస్థ (ఐ.ఐ.పి.ఇ.) కాకినాడకు వెళ్లాల్సింది. విశాఖ నగరంలో అయితే సమర్ధ సేవలకు అవకాశం ఉంటుందని ఇక్కడకు తీసుకొచ్చాం. దీనికి ఇప్పటికే కేంద్రం రూ. 230 కోట్లను కేటాయించింది. రాష్ట్రప్రభుత్వం ఆ సంస్థకు కేటాయించిన స్థలానికి సంబంధించి కొన్ని ఇబ్బందులున్నాయి. అవి పరిష్కారమైన వెంటనే పనులు మొదలవుతాయి. అచ్యుతాపురంలో రూ. 150 కోట్లతో ఎం.ఎస్‌.ఎం.ఇ. టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు చేశాం. దీని పనులు జరుగుతున్నాయి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐ.ఐ.ఎఫ్‌.టి.), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ (ఐ.ఐ.పి.), ప్యాకేజింగ్‌ పార్క్‌ తదితర సంస్థలు కూడా విశాఖలో ఏర్పాటు కావాల్సి ఉన్నా.. కాకినాడకు మళ్లించారు. అక్కడ ఏర్పాటు చేయాల్సిన ఐ.ఐ.పి.ఇ.ని ఇక్కడికి మార్చినందుకే అలా చేయాల్సి వచ్చింది. ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ పరిశోధనల కోసం ‘సమీర్‌’ను ఇక్కడే ఏర్పాటు చేశాం. విశాఖ విమానాశ్రయంలో అంతర్జాతీయ కార్గో టెర్మినల్‌ను కూడా తెచ్చాం. ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో ఆరిలోవలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేసి వేలాదిమంది యువతకు శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేశాం. దీన్ని త్వరలో కేంద్రప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ విశ్వవిద్యాలయంగా కూడా మార్చనుంది.