News

Realestate News

రైతన్నకు తీపి కబురు

రైతన్నకు తీపి కబురు!
రుణ పరిమితి గణనీయంగా పెంపు
చెరకు పంటకు రూ. 10 వేల వరకు..
రబీ, ఖరీఫ్‌ సీజన్లలో రూ. 2714 కోట్ల మేర రుణాలివ్వాలని నిర్ణయం
6 లక్షల మందికి ప్రయోజనం
న్యూస్‌టుడే – పాతశ్రీకాకుళం
జిల్లా రైతాంగానికి తీపి కబురు. నూతన ఆర్థిక సంవత్సరంలో రబీ, ఖరీఫ్‌ కాలాల్లో వేసే పంటలకు గాను ఆయా రైతులకు బ్యాంకులు ఇచ్చే రుణాల పరిమితిని గణనీయంగా పెంచాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఏటా ఏప్రిల్‌ నెలలో ఖరారయ్యే కొత్త రుణ పరిమితికి సంబంధించి కొద్ది రోజుల క్రితం అధికార యంత్రాంగం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల అధికారులు తమ పరిధిలోని రైతులకు రుణాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. చెరకు పంటకు గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎకరాకు రూ. 50 వేలు మాత్రమే రుణం ఇవ్వగా, కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ. 60 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలో ప్రధానంగా పండించే వరి పంటకు నిరుడు ఎకరానికి రూ. 27 వేలు మాత్రమే ఇవ్వగా, ఈ సారి దాన్ని రూ. 30 వేలకు పెంచారు. మిగిలిన పంటలకు సైతం గతంలో కంటే రుణపరిమితి పెంచారు. అధికార యంత్రాంగం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో సుమారు 6 లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం  చేకూరుతుందని లీడ్‌ బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి.రుణాల చెల్లింపులోనూ మినహాయింపు… అధికారిక వర్గాల లెక్కల ప్రకారం ప్రస్తుత ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు ఖరీఫ్‌ సీజన్‌ కొనసాగుతుంది. అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అనే సంస్థ జిల్లాలో ఫసల్‌ బీమా యోజనను పర్యవేక్షిస్తోంది. ఏ కారణంగానైనా పంట నష్టపోతే గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని పరిహారం ఇవ్వనున్నారు. బీమా కింద తీసుకున్న రుణమొత్తంలో రెండు శాతం మొత్తాన్ని ప్రీమియంగా చెల్లిస్తే సరిపోతుంది. అలాగే రుణాల తిరిగి చెల్లింపుల్లో కూడా కొంతమేర మినహాయింపులు ఇస్తున్నారు. ఖరీఫ్‌ కోసం తీసుకున్న రుణం చెల్లించకపోయినా రబీ సీజన్‌కు కూడా రుణం తీసుకునే వీలు కల్పిస్తున్నారు. ఇప్పటివరకు రెండు సీజన్‌లకు వేర్వేరుగా రుణాలు తీసుకునే విధానాన్ని తొలగిస్తూ రెండింటికి కలిపి ఒకేసారి రాయించుకుని అవసరమైనప్పుడు తీసుకునే వెసులుబాటు కూడా కల్పించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఏడాదిలోపు చెల్లించేవారికి, రూ. లక్షలోపు రుణానికి అసలు వడ్డీ ఉండనే ఉండదు. రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు పావలా వడ్డీ వర్తింపజేస్తారు.జిల్లా రైతులకు  ప్రయోజనకరం
జిల్లాలోని రైతులకు బ్యాంకులు ఇవ్వాల్సిన రుణాల పరిమితిని పెంచడం ద్వారా అన్నివర్గాల రైతులు పెద్దఎత్తున ప్రయోజనం పొందేందుకు అవకాశం ఉంది. ఇంచుమించుగా అన్ని పంటలకు గణనీయంగా పెంచడం జరిగింది. దీనవల్ల జిల్లాలో 6లక్షలకుపైగా రైతులు గతంకంటే ఎక్కువ రుణాలను పొందగలరు. గతేడాది మొత్తంగా నిర్ణయించుకున్న లక్ష్యానికి 85శాతం మేర రుణాలను ఇవ్వగా ఈసారి మరింత ఎక్కువ శాతాన్ని నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

-పి.వెంకటేశ్వరరావు, లీడ్‌బ్యాంక్‌ జిల్లా మేనేజర్‌, శ్రీకాకుళం

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo