News

Realestate News

రూ.72 లక్షలతో గిడ్డంగుల నిర్మాణం

రూ.72 లక్షలతో గిడ్డంగుల నిర్మాణం
డీసీసీబీ ఛైర్మన్‌ సుకుమార్‌వర్మ
రాంబిల్లి, న్యూస్‌టుడే: జిల్లాలో ఎనిమిది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో (పీఏసీఎస్‌) రూ.72 లక్షలతో గిడ్డంగులు నిర్మించనున్నట్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్‌ సుకుమార్‌వర్మ తెలిపారు. స్థానిక పీఏసీఎస్‌లో ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాన్ని ఆయన స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబుతో కలిసి ప్రారంభించారు. జిల్లాలో 14 పీఏసీఎస్‌లలో మీసేవా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సంఘాలను ఆర్థికంగా బలంగా మార్చడానికి వీటిని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. దీంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. డీసీసీబీ శాఖల్లో ఏటీఎంలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే ఖరీఫ్‌లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కూడా సరఫరా చేయనున్నుట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని అన్ని సంఘాల పరిధిలో రైతులకు స్వల్పకాలిక రుణాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు పంట రుణాలు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ సీఈవో వీరబాబు, ఏజీఎం ఎల్‌.అప్పలరాజు, డైరెక్టర్‌ ఎం.గురున్నాథరావు, దిన్‌బాబు, జీవీవీ రమణమూర్తిరాజు (శ్రీనుబాబు), పీఏసీఎస్‌ సీఈవో సుంకర రవి పాల్గొన్నారు.

Source : http://www.eenadu.net/