News

Realestate News

రూ.211.58 కోట్ల ఖర్చుతో 147 పనులు

రూ.211.58 కోట్ల ఖర్చుతో 147 పనులు
పీఎంజీఎస్‌వై రెండో దశకింద జిల్లాకు మంజూరు
కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడి
విశాఖపట్నం, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌యోజన పథకం (పిఎంజిఎస్‌వై) రెండో దశ కింద జిల్లాకు రూ.211.58కోట్ల విలువ చేసే 147 రహదారుల పనులు మంజూరయ్యాయని జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో పిఎంజిఎస్‌వై పనుల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ పనులకు సంబంధించిన టెండర్లు త్వరగా ఖరారుచేసి పనులు చేపట్టాలన్నారు. ప్రభుత్వపరంగా 61 పనులకు అనుమతులు రావల్సి ఉందని, అవి వచ్చేటట్టు చూడాలని ఆదేశించారు. పిఎంజిఎస్‌వై తొలి దశ కింద రూ.169.58 కోట్ల వ్యయంతో చేపట్టిన 54 పనుల్లో 30 పనులు పురోగతిలో ఉన్నాయని, మిగతా 24 పనులు టెండర్లు, అటవీ అనుమతుల స్థాయిలో ఉండడాన్ని కలెక్టర్‌ తప్పుపట్టారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టనున్న పది పనులను పోలీసు భద్రత నడుమ చేపట్టాలని ఆదేశించారు. పిఎంజిఎస్‌వై పనుల నిర్వహణకు కేంద్రం రూ.15కోట్లు విడుదల చేసిందని, ఆయా పనులతో చేపట్టే పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. పిఆర్‌ ఎస్‌ఈ వేణుగోపాల్‌, సీసీఎఫ్‌ రాహుల్‌పాండే, వివిధ శాఖలకు చెందిన అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

అలసత్వం వహిస్తే జీతాల నిలిపివేత
మరుగుదొడ్ల నిర్మాణం, జియో ట్యాగింగ్‌ విషయంలో అలసత్వం వహిస్తే జీతాలను నిలిపివేస్తామని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌ నుంచి ఆయన మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. జిల్లాలో ఇంకా 30,054 మరుగుదొడ్లు పనులు పూర్తికావల్సి ఉందని, వీటిలో అత్యధికం గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పారు. ఆయా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, జియో ట్యాగింప్‌ పనులను వేగవంతం చేయాలన్నారు. మైదాన ప్రాంతంలో ఉన్న 28 మండలాలు, గిరిజన ప్రాంతంలో ఉన్న అనంతగిరి మండలాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించామని, మిగతా వాటిని సాధ్యమైనంత త్వరగా ప్రకటిస్తామని చెప్పారు. పంచాయతీల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు అవసరమైన స్థలాలను సేకరించాలని ఆదేశించారు. ఇంతవరకు స్థలాలను గుర్తించకపోవడం పట్ల కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. ఆర్డీఓలు చేయవల్సిన పనులు సైతం తానే చూడాలంటే ఎలా అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. ఉపాధి హామీ కింద గత నాలుగేళ్లలో జిల్లాలో చేపట్టిన పనుల్లో 32,258 పనులు అసంపూర్తిగా వదిలేశారని, వాటిని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జేసీ 2 సిరి, డీపీఓ కృష్ణకుమారి, ఇతర అధికారులు కల్యాణచక్రవర్తి, రమణమూర్తి, మెహర్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo