News

Realestate News

రూ. 1500 కోట్లు కావాలి!

తక్షణ అవసరంగా సూచించిన ఉన్నతస్థాయి అధికార బృందం
ఈ నగదు పంపిణీతో మళ్లీ సాధారణ పరిస్థితి సాధ్యమని నివేదిక
గత 4 రోజుల్లో ప్రజలకు పంపిణీ చేసింది రూ. 1005 కోట్లు

నగరంలో నగదు కొరత తీరి మళ్లీ సాధారణ పరిస్థితి ఏర్పడాలంటే తక్షణం రూ. 1,500 కోట్ల నగదు ఖాతాదారుల చేతుల్లోకి వెళ్లాల్సి ఉంటుందని ఉన్నతస్థాయి అధికార బృందం అంచనా వేసింది. పలువురు బ్యాంకర్లు, రాష్ట్ర ప్రభుత్వశాఖల అధికారులతో ఏర్పడిన ఈ బృందం క్షేత్రస్థాయిలోని అంశాలను పరిశీలించి ఈ అభిప్రాయానికి వచ్చింది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు యోచిస్తున్నాయి.
గత మంగళవారం రాత్రి రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాక నగరంలో కల్లోల పరిస్థితి ఏర్పడింది. బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్ద జనం రద్దీ భారీగా ఉంటోంది. గడిచిన నాలుగు రోజుల్లో నగరంలో రూ. 1,000 కోట్లను నగదు మార్పిడి కింద బ్యాంకులు ప్రజలకు చెల్లించాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో భారతీయ స్టేట్‌బ్యాంకు (ఎస్‌బీఐ), ఆంధ్రాబ్యాంకు ముందు వరుసలో ఉన్నాయి. మిగతా బ్యాంకులు కూడా నగదు లభ్యత మేరకు సరఫరా చేస్తున్నాయి. రూ. 4 వేల విలువైన రూ. 1,000, రూ. 500 పాత నోట్లను తీసుకుని కొత్తగా వచ్చిన రూ. 2 వేలు, వందల నోట్లు అందజేస్తున్నారు. నగర పరిధిలోని 700 ఏటీఎం కేంద్రాల్లో గత 4 రోజుల్లో మరో రూ. 5 కోట్ల నగదు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. అంటే మొత్తం రూ. 1,005 కోట్ల నగదు ప్రజలు చేతుల్లోకి వెళ్లింది. రూ. 2 వేలు, వంద నోట్ల కారణంగా ప్రజల అవసరాలు తీరడం లేదు. రూ. 2 వేల నోటిస్తే మార్కెట్లో చిల్లర లభించే పరిస్థితి లేదు. కొత్త సిరీస్‌ రూ. 500 నోట్లు వచ్చినా ఈ సమస్యకు కొంత పరిష్కారం లభించేది. మరో వారం రోజుల తరువాత గానీ రూ. 500 నోట్ల గురించి చెప్పలేమని అధికారవర్గాలంటున్నాయి. నగదు కొరత తీరాలన్నా, బ్యాంకుల, ఏటీఎం కేంద్రాల ముందు ప్రజలు బారులు తీరే పరిస్థితి పోవాలన్నా వెంటనే రూ. 1500 కోట్లను పంపిణీ చేయాల్సి ఉంటుందని ఉన్నతస్థాయి అధికారుల బృందం చెబుతోంది. నగదు మార్పిడి రూపంలో రూ. 1,000 కోట్లు, ఏటీఎంల నుంచి మరో రూ. 500 కోట్లను బడ్వాటా చేయాల్సి ఉంటుందని పేర్కొంది. సాధ్యమైనంతవేగంగా రూ. 500 నోట్లు బ్యాంకుల నుంచి ప్రజల చేతుల్లోకి వెళ్లేలా కూడా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తగు చర్యలు తీసుకోవాలని ఈ బృందం సూచించినట్లు తెలుస్తోంది.

నగదు కొరత … దుకాణాల మూత
ఆదివారం నగరంలోని 90 శాతం దుకాణాలు మూతపడ్డాయి. వ్యాపారం అంతంత మాత్రం కావడం, ఆపై ఆదాయ పన్ను శాఖ అధికారుల నిఘాతో ప్రధాన వ్యాపార సంస్థలలకు షెట్టర్లు పడ్డాయి. మూడో కంటికి తెలియకుండా పసిడి వ్యాపారం జోరుగా సాగుతోందన్న సమాచారంతో ఆదాయ పన్నుశాఖ అధికారులు అప్రమత్తమై వాటిపై నిఘా పెట్టారు. ఈ నెల 8న రాత్రి జరిగిన అమ్మకాలపైనా వివరాలు సేకరిస్తున్నారు. దుకాణాల్లో సీసీ కెమెరాల పుటేజీని కూడా పరిశీలించే యోచనతో వారున్నారు. దీంతో నగరంలోని చాలావరకు పసిడి దుకాణాలు మూతపడ్డాయి. మిగతా వ్యాపారరంగాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. కొన్ని దుకాణాలు తెరిచినా వ్యాపారాలు అంతంత మాత్రమే. ఆదివారం నగరంలో దాదాపు అన్ని బ్యాంకులూ పని చేసినా బారులు తీరిన ప్రజలకు సరిపడా నగదు మార్పిడి చేయలేకపోయాయి. చాలా బ్యాంకుల్లో 4 వేలకు బదులు రూ. 2 వేలు, రూ. 2,500 చొప్పున మార్పిడి చేశారు. ఏటీఎం కేంద్రాలూ ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యే మూతపడ్డాయి. చాలా కేంద్రాల్లో నగదు లేదంటూ బోర్డులు వేలాడ తీశారు. ముఖ్యమైన కూడళ్లలో జాతీయ బ్యాంకుల ఏటీఎంలు పని చేసిన చోట భారీగా ప్రజలు బారులు తీరారు. కలెక్టరు ప్రవీణ్‌కుమార్‌ జోక్యం చేసుకొని బ్యాంకులకు స్వయంగా వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించి సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడారు. సోమవారం తగినంత నగదు ప్రజలకు అందజేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని బ్యాంకర్లకు సూచించారు.

పేదలకు ఎంత కష్టం…
నగర జనాభాలో 60 నుంచి 70 శాతం పేదలే. వీరిలో ఎక్కువమంది పక్క జిల్లాల నుంచి ఉపాధి కోసం వలసలు వచ్చినవారే. వీరందరికీ కూలి చేస్తే తప్ప కడుపు నిండని పరిస్థితి. వీరంతా ఎక్కువగా నిర్మాణ రంగంలో సేవలందిస్తున్నారు. కూలీలుగా, మేస్త్రిగా, ఫంబర్‌, పెయింటర్‌, కార్పొంటర్‌, ఎలక్ట్రీషియన్‌… ఇలా పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. నగరంలో దాదాపు 2.50 లక్షల నుంచి 3 లక్షల కుటుంబాలకు నిర్మాణ రంగమే ప్రధాన జీవనాధారం. పెద్ద నోట్లను రద్దు చేశాక వీరి పరిస్థితి దయనీయంగా మారింది. రోజు వారీగా, వారానికోసారి సంబంధిత బిల్డర్లు వీరందరికీ చెల్లింపులు చేస్తుంటారు. బిల్డర్లంతా రద్దయిన పెద్ద నోట్లనే వీరందరికీ అందజేస్తున్నారు. లేదంటే కొత్త నోట్లు వచ్చే వరకు వేచి ఉండాలంటున్నారు. చేసేది లేక అత్యధికులు పాత పెద్ద నోట్లను తీసుకొని మర్నాడు బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. దీనివల్ల అటు పనులు కోల్పోవడంతోపాటు ఇటు నగదు మార్పిడి కూడా సక్రమంగా జరగక మళ్లీ వెనక్కి తిరుగుతున్నారు. చాలామంది రెండేసి రోజులు పనులకు వెళ్లని పరిస్థితి ఉందని పలువురు ఆవేదన చెందుతున్నారు.