News

Realestate News

రియల్‌ ఎస్టేట్‌

vizag news

ఆసియాలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి ఉన్న పేరుప్రతిష్ఠలు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. విస్తారమైన సాగరతీరంతోపాటు అయిదో నెంబరు జాతీయ రహదారికి అనుకొని ఎన్నో ప్రకృతి అందాలు సొంతం చేసుకున్న విశాఖలో ప్రపంచ స్థాయి విద్యా, వైద్య, వాణిజ్య సంస్థలు నెలకొల్పడంతో నగరం కీర్తి మరింత రెట్టింపైంది. విద్య, వైద్యం, వ్యాపారం, పరిశ్రమలకు తగ్గట్టుగానే జనాభా కూడా విపరీతంగా పెరుగుతోంది. వారి అవసరాలకు అనుగుణంగా నివాస స్థలాలు, ఇళ్లకు ఎనలేని గిరాకీ పెరిగింది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల ప్రజల ప్రధాన అవసరాలు తీరుస్తున్న నగరంలో నివాసం ఏర్పరచుకోవడం అంటే ఎంతో గొప్పగా భావిస్తున్నారు.
దీంతో ‘రియల్‌’ వ్యాపారానికి మరింత ­వూపు వచ్చింది.

ప్రశాంత జీవనం.. పెట్టుబడి దృష్టి.. ఈ రెండింటి గురించి ఆలోచించేవారు విశాఖ మార్కెట్‌వైపు దృష్టిసారిస్తున్నారు. ఐటీ, ఫార్మా రంగాల వృద్ధికి ఆస్కారం ఉండటం.. మౌలిక సదుపాయాలు మెరుగవుతుండటం.. ఇలాంటి కారణాల వల్ల విశాఖ స్థిరాస్తి రంగం మెరుగైన దిశగా అడుగులేస్తోంది. విశాఖలోని లాసన్స్‌బే, మురళీనగర్‌, సీతమ్మధార, అక్కయ్యపాలెం, బాలయ్యశాస్త్రి లేఅవుట్‌, షీలానగర్‌, లంకెల పాలెం, గాజువాక, దువ్వాడ, ముడసర్లోవ, సింహాచలం, పెందుర్తి వంటిచోట్ల అపార్టుమెంట్లకు గిరాకీ ఎక్కువ. ఇక్కడే వెంచర్లూ వస్తున్నాయి. మొదటి నుంచి మధురవాడకు మంచి డిమాండ్‌ ఉంది. ఇక్కడ ఫ్లాటు కోసం చదరపు అడుగుకు రూ.1800 నుంచి రూ.2000 దాకా పెట్టాలి. బీచ్‌రోడ్డు, సీతమ్మధార వంటి ప్రాంతాల్లో రూ.2000 నుంచి రూ.3000 చెబుతున్నారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన వందలాది ప్రైవేటు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఉన్నప్పటికీ ప్రజల అవసరాలు తీర్చలేకపోతున్నాయి. పెరుగుతున్న గిరాకీని దృష్టిలో పెట్టుకొని విశాఖ నగరాభివృద్ధి సంస్థ కూడా రియల్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టి ప్రజల అవసరాలను తీరుస్తూనే సంస్థ ఆదాయాన్ని ఏటా ద్విగుణీకృతం చేస్తోంది. నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఇప్పటికే పలు లేఅవుట్లు, అపార్ట్‌మెంట్లు నిర్మించి లాటరీ, వేలం పాటల ద్వారా ప్రజలకు అందజేసింది. తాజాగా మధురవాడ సమీపంలోని పరదేశిపాలెం వద్ద ‘ఓజోన్‌ వేలీ’ వేసిన భారీ లే అవుట్‌కు విశేష స్పందన రావడంతో ఐటీ సెజ్‌లకు ఆనుకోని ‘సైబర్‌ వేలీ’ పేరుతో మరో భారీ లేఅవుట్‌ వేసి ఏప్రిల్‌ నెలాఖరుకల్లా వేలం వేసేందుకు సిద్ధం చేసింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘హరిత’ గృహనిర్మాణ పథకంలో భాగంగా 720 ఇళ్లను నిర్మిస్తోంది. దీనికి వచ్చిన స్పందన మేరకు రెండో దశలో మరో 750 ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంచేసింది. మరోవైపు ‘రొ హౌసింగ్‌’ పేరుతో 86 ‘విల్లా’లు నిర్మిస్తోంది. అటు శ్రీకాకుళం నుంచి ఇటు తూర్పుగోదావరి వరకు నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న వుడా పరిధిలో ప్రజలకు మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు స్థిరాస్తి వ్యాపారంలోనూ వుడా ప్రగతిపథంలో ప్రయాణిస్తుంది. ప్రైవేటు రంగంలో కూడా నగరానికి అన్నివైపులా పలు కంపెనీలు వెంచర్లలో నిర్మాణాలు చేపట్టాయి.

విశాఖలో వుడా ఆవిర్భావం- అభివృద్ధి
విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఆవిర్భావానికి ముందు 1962 వరకు టౌన్‌ ప్లానింగ్‌ ట్రస్టు(టీపీటీ)గా ఉండేది. విశాఖపట్నం నగరంతోపాటు పరిసరాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతం చేసేందుకు వీలుగా టీపీటీకి ఉన్నతి కల్పిస్తూ 1978, జూన్‌ 17న వుడాగా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పట్టణ ప్రాంతాల అభివృద్ధి చట్టం-1975 ప్రకారం దీని పరిధిని విశాఖ నగర పాలక సంస్థతోపాటు భీమునిపట్నం, గాజువాక, అనకాపల్లి, విజయనగరం నాలుగు పురపాలక సంఘాల వరకు విస్తరించారు. దీని పరిధిలో 1721 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 178 పంచాయతీలు, 287 గ్రామాలు కూడా ఉన్నాయి. ప్రణాళికల ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, గృహనిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పథకాల రూపకల్పన, వాటిని అమలు చేయడం, బృహత్తర ప్రణాళిక అమలులో భాగంగా వివిధ అభివృద్ధి పథకాలను సమన్వయపర్చడం తదితరాలు వుడా విధుల్లో ప్రధానమైనవి. వుడా ఆవిర్భవించాక విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ ప్రాంతీయం (వీఎంఆర్‌), విజయనగరం, భీమునిపట్నం, గాజువాక, అనకాపల్లి పట్టణాలను కలుపుకొని జోనల్‌ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటికి ఆమోదం తెలిపింది.

విధులు, బాధ్యతలు
భూసేకరణ, అభివృద్ధి పథకాలు చేపట్టడం
శాటిలైట్‌ టౌన్‌షిప్స్‌, స్థలాలు, ఇతర సేవలు చేపట్టి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి చర్యలు తీసుకోవడం
హడ్కో ఆర్థిక సహాయంతో ప్రజోపయోగ గృహనిర్మాణ పథకాల కింద వివిధ ఆదాయ వర్గాల వారి కోసం గృహనిర్మాణ పథకాలు అమలు చేయటం
రహదారుల్ని వెడల్పు చేయడం, కొత్త రహదారులను వేయడం
కార్యాలయాలు, వాణిజ్య, దుకాణ సముదాయాలను నిర్మించడం
వుడా చేపట్టే టౌన్‌షిప్స్‌, కాలనీలు, లేఅవుట్లలో మౌలిక సౌకర్యాలు కల్పించడం
వివిధ ఆదాయ వర్గాలకు అందుబాటులో ఉండేలా నివాస స్థలాలు, ఇళ్లు నిర్మించి కేటాయించడం
వినోద సంబంధిత కార్యక్రమాలు అభివృద్ధి చేయడం
నగరం, పట్టణాల్లో చెట్లు పెంచడం

నిధులు, ఆర్థిక వ్యవహారాలు
అభివృద్ధి ఛార్జీలు, నివాస స్థలాలు, ఇళ్ల నిర్మాణం, వాటి విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం, దుకాణాల ద్వారా వచ్చే అద్దెలు రూపేణా సొంత నిధులు సమకూరుతాయి. వివిధ పద్దులు, పథకాల కింద ఖర్చు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమయానుకూలంగా లభించే వార్షిక నిధులు, ప్రత్యేక సహాయాలు, రుణాల ద్వారా సమకూరే ఆర్థిక లావాదేవీలన్నీ సొంద నిధుల కిందకి వస్తాయి. సంస్థ పరిధిలోని గణాంక శాఖ పర్యవేక్షణతోపాటు మొత్తం నిధుల ఖర్చుపై రాష్ట్ర ప్రభుత్వ అకౌంటెంట్‌ జనరల్‌ వుడా జమా ఖర్చులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు.

తాజాగా మరిన్ని..
వీఎంఆర్‌ పరిధిలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన పథకాల ద్వారా వుడా రూ.350 కోట్లు ఆర్జించింది.
సాగర తీరాన అందమైన ప్రాంతంలో వుడా ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కైలాసగిరి పర్యాటక ప్రదేశానికి ‘ఉత్తమ పర్యాటక ప్రాంతం’గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
రాష్ట్రంలోనే తొలిసారిగా అదే కైలాసగిరిపై రోప్‌వే ఏర్పాటుచేసి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చింది.
విశాఖ-భీమిలి మధ్య రహదారిని వెడల్పుచేసి అందంగా తీర్చిదిద్దడంలో భాగంగా తొలి దశలో రెండు కిలోమీటర్లలో దీన్ని పూర్తిచేసింది.
కైలాసగిరిపై పర్యాటకులకు అనువుగా సర్క్యులర్‌ ట్రైన్‌ను ప్రవేశపెట్టింది.