రాష్ట్ర పండగగా ఆదివాసీ దినోత్సవం
రాష్ట్ర పండగగా ఆదివాసీ దినోత్సవం
10 వేల మందితో భారీ ఊరేగింపు
కలెక్టర్ ప్రవీణ్ కుమార్
వర్షంలోనూ సీఎం పర్యటన సన్నాహాల పరిశీలన
పాడేరు, న్యూస్‌టుడే
ఈ నెల 9న జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాష్ట్ర పండగగా నిర్వహించేందుకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోందని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివాసీ దినోత్సవం నాడు పాడేరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ఏర్పాట్లు పరిశీలించేందుకు మంగళవారం ఆయన పాడేరులో పర్యటించారు. అల్పపీడన ద్రోణి ప్రభావంగా పాడేరు పట్టణంలో మంగళవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈ వర్షంలోనే కలెక్టర్‌తోపాటు అధికార యంత్రాంగమంతా సీఎం పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నిర్మాణంలో ఉన్న సీఎం సభావేదికను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట సంయుక్త కలెక్టర్ సృజన, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బాలాజీ, ఏఎస్పీ అమిత్ బర్దర్, సంయుక్త కలెక్టర్-2 సిరి ఉన్నారు. సభావేదిక చుట్టుపక్కల వర్షపు నీరు నిల్వ ఉంటున్న విషయం గుర్తించారు. నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు ఆదేశించారు. జూనియర్ కళాశాల లోపల ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ ప్రచార స్టాళ్లను పరిశీలించి తగు సూచనలిచ్చారు. మోదకొండమ్మ ఆలయ ప్రాంగణంలో తీసుకోవాల్సిన భద్రత చర్యలపై ఎస్పీ రాహుల్దేవ్శర్మతో చర్చించారు. అనంతరం అడారిమెట్ట గ్రామాన్ని సందర్శించి అక్కడ ఏర్పాట్లు జరుగుతున్న తీరును పరిశీలించారు.
అన్ని ఐటీడీఏల భాగస్వామ్యం
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అడారిమెట్టలో నిర్వహించే గ్రామదర్శిని కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. చింతలవీధి పంచాయతీ పరిధిలోని ఎనిమిది గ్రామాల ప్రజలు గ్రామదర్శినికి హాజరవుతారని తెలిపారు. అక్కడ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల సభాస్థలి వరకూ 10 వేల మందితో భారీ ఊరేగింపు ఉంటుందన్నారు. మధ్యాహ్నం బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలు (ఐటీడీఏ) ఈ వేడుకల్లో భాగం పంచుకుంటాయని తెలిపారు. వర్షం కారణంగా పనులకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు సూచనలిచ్చారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేశామన్నారు. అడారిమెట్టలో నిర్వహించే గ్రామదర్శిని కార్యక్రమంలో విలువిద్య క్రీడా ప్రదర్శన ఉంటుందని తెలిపారు. గిరిజన క్రీడాకారులతో సీఎం ముచ్చటిస్తారని కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన వారంతా సీఎంతో మాట్లాడతారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) పథ సంచాలకులు సత్యసాయి శ్రీనివాస్, డ్వామా పథ సంచాలకులు కళ్యాణ చక్రవర్తి, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విజయ్‌కుమార్, ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి ప్రభాకరరావు, కుమార్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Notice: compact(): Undefined variable: limits in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Notice: compact(): Undefined variable: groupby in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
399