రాష్ట్రాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్రే కీలకం

మంత్రి గంటా శ్రీనివాసరావు
విశాఖ: రాష్ట్రాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశాఖలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గురుపూజోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. విజ్ఞానవంతమైన, విద్యావంతమైన రాష్ట్రంగా రూపుదిద్దేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలోని 44 వేల పాఠశాలల్లో రూ.10వేల కోట్లతో మౌలిక వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు అమలులో ఉపాధ్యాయులు, విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం ఈ ఏడాది ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులకు, పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులు, పలువురు విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, జెడ్పీ ఛైర్పర్సన్ లాలం భవాని, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.