Posted on November 07, 2016 by vijay kumar in Realestate News
రంజింపజేసిన పౌరాణిక నాటిక సన్నివేశ పోటీలు
కొమ్మాది,న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయి పౌరాణిక నాటిక సన్నివేశ ఘట్టాల పోటీలు ఆదివారం ముగిశాయి. ‘సింహాద్రి అవార్డ్స్’ పేరిట శిల్పారామం, ఏపీ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీసాయి శ్రీనివాస కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడురోజులుగా ఈ పోటీలు నిర్వహించారు. రావణ గర్వభంగం నాటకంతో ప్రారంభమైన ఈ పోటీల్లో చివరిరోజు నవ క్రాంతి కల్చరల్ అసోసియేషన్ (హైదరాబాద్) వారి మహిషాసురమర్ధిని, అదే ప్రాంతానికి చెందిన శ్రీ సర్వేశ్వర నాట్య మండలి కళాకారులతో ప్రదర్శించిన శ్రీకృష్ణరాయబారం నాటక ఘట్టాలతో ముగిశాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సంస్థలకు, కళాకారులకు సింహాద్రి అవార్డ్స్లతో పాటు నగదు బహుమతులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. అంతకుముందు 5వార్డు తెదేపా అధ్యక్షుడు పిళ్లా నరసింగరావు ఆర్థిక సహాయంతో కళాకారుల సామూహిక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సినీనటుడు సుమన్ పాల్గొని నంది అవార్డు గ్రహీత బి.వి.ఎన్.పాత్రో దంపతులతో పాటు ఉత్తరాంధ్రలో సీనియర్ పౌరాణిక నటులను ఘనంగా సత్కరించారు. నాటక రంగంలో రాణించిన ఎందరో నటులు నేడు దుర్భర జీవనం గడుపుతున్నారని, వారితో పాటు పౌరాణిక నటుల సంక్షేమానికి ఒక వేదికగా ఏర్పడితే తనవంతు కృషి చేస్తానన్నారు. ముగింపోత్సవంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ నాటకరంగాన్ని ప్రోత్సహించేందుకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. అనంతరం జానపద కళారూపాలు, బుర్రకథలను కళాకారులు ప్రదర్శించారు. సాయిశ్రీనివాస్ కల్చరల్ అసోసియేషన్ ఛైర్మన్ విజయ్‌కుమార్, తెదేపా జిల్లా సాంస్కృతిక నిర్వహణ కార్యదర్శి పిళ్ళా రాంబాబు, సంఘం అధ్యక్షులు మద్దూరి సుబ్రమ్మణ్యం, కార్యనిర్వాహకులు వంకాయల మారుతీప్రసాద్, మధురవాడ జోన్ రంగస్థల కళాకారుల ఐక్య సంఘం అధ్యక్షులు పోతిన వెంకటరామారావు, తెదేపా నాయకులు పిళ్ళా వెంకటరావు, పోతిన వెంకటరావు, కోరాడ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.