News

Realestate News

యూనిట్లు పెట్టకపోతే భూములను వెనక్కి తీసుకోండి!

Power consumption in IT hub meeting picture

పర్యావరణంతోనే ఐటీ రంగానికి భవిష్యత్తు
సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఐటీ సెజ్‌లో నిర్ణీత గడువులోగా యూనిట్ల స్థాపన జరగకపోతే వాటికి కేటాయించిన భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ టక్కర్‌ ఆదేశించారు. బుధవారం విశాఖకు వచ్చిన ఆయన పలు అంశాలపై అధికారులతో కలిసి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పరిశ్రమలు, ఐటీ, గృహనిర్మాణం తదితర రంగాల పరిస్థితిని సమీక్షించారు. ఏప్రిల్‌ నెల్లో తీసుకున్న నిర్ణయాలను సకాలంలో అమలు చేయకపోవడం పట్ల ఆగ్రహం వెలుబుచ్చారు. ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకున్న సీఎస్‌ సాయంత్రం 4.30 గంటల వరకూ సమీక్షలు జరుగుతూనే ఉన్నాయి. అంశాలవారీగా సీఎస్‌ సమీక్ష వివరాలు ఇలా..

ఐటీ రంగంపై…
విశాఖలో ఐటీ రంగానికి అనుకూల పర్యావరణాన్ని అభివృద్ధి చేయాలన్నారు. లేకుంటే ఐటీ పరిశ్రమలు తరలిపోయే ప్రమాదం పొంచిఉందని, దీనిపై ఐటీ పరిశ్రమ ప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలన్నారు. ఐటీ సెజ్‌లో డిఫంక్‌ అయిన పరిశ్రమలకు చెందిన 8 లక్షల చదరపు అడుగల స్థలాన్ని 30 రోజుల వ్యవధిలో వెనక్కి తీసుకొని కొత్త పరిశ్రమలకు కేటాయించాలన్నారు. ఐటీ సెజ్‌లో 19వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరిలో పదివేల మందికి ఇళ్లు లేవని, వారి ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా గృహనిర్మాణ పథకాలను అమలు చేయాలని అధికారులకు సూచించారు. గృహ నిర్మాణ పథకాలను అమలు చేసే సంస్థను ఎంపిక చేసి పీపీపీ కింద అమలు చేయాలన్నారు. 18నెలల్లో గృహనిర్మాణ పథకాలు పూర్తి చేయాలన్నారు. ఐటీరంగ విస్తరణకు అనువైన వాతావరణం కల్పించే బాధ్యతను జేసీ నివాస్‌, ఏపీఐఐసీ, ఎస్‌.టి.పి.ఐ. అధికారులు చేపట్టాలని సీఎస్‌ సూచించారు.

నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి
విశాఖలో రానున్న పరిశ్రమలకు కావాల్సిన నీటి అవసరాలపై దృష్టి సారించాలని సీఎస్‌ సూచించారు. సముద్రపు నీటిని శుద్ధి చేసి వాడుకోవడం, పునర్వినియోగంపైనా దృష్టి సారించాలన్నారు. రిజర్వాయర్లలో పూడికలు తొలగింపు ద్వారా నీటి సామర్థ్యాలను పెంచుకోవాలన్నారు.

ఈ ఏడాది జనవరిలో జరిగిన భాగస్వామ్య సదస్సులో 38 పరిశ్రమల ఏర్పాటుకు సంస్థలు ముందుకు వచ్చాయని, వీటిని ఆర్‌-2, ఆర్‌-3 కేటగిరీల్లో ఉన్నాయన్నారు. భూములు కేటాయించి స్థాపనకు సిద్ధంగా ఉన్న పరిశ్రమలను ఆర్‌2 కేటగిరీలో, భూముల కేటాయింపులు జరుగుతున్న పరిశ్రమలను ఆర్‌3 కేటగిరీలో పెట్టారన్నారు. ఈ రెండు కేటగిరీల్లో 24 పరిశ్రమలు ఉన్నాయని, వీటి ద్వారా రూ.73,657 కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. వీటివల్ల 43,800 మందికి ఉపాధి కలగనుందని వివరించారు. ఆయా పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా సత్వరమే అనుమతులు మంజూరుచేసి ప్రారంభించేందుకు చర్యలను చేపట్టాలని సూచించారు.

* నక్కపల్లిలో అయిదు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన 600 ఎకరాల భూసేకరణను సత్వరమే చేపట్టాలని ఏపీఐఐసీ ఎండీ శ్రీధర్‌ను ఫోన్‌లో ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధులను హడ్కో వంటి సంస్థల నుంచి రుణంగా తీసుకోవాలని సూచించారు.

* కొత్తగా రానున్న పరిశ్రమల్లో విశాఖ ఉక్కు విస్తరణకే రూ. 38 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నారు. ఉక్కు నీటి అవసరాలను తీర్చేందుకు దృష్టి సారించాలని సీఎస్‌ ఆదేశించారు.

* ఏషియన్‌ పెయింట్స్‌, కోకాకోలా ప్లాంటు, హెచ్‌పీసీఎల్‌ విస్తరణ, ఔషధరంగ పరిశ్రమలతో పాటు ఇతర రంగాలకు చెందినవి ఉన్నాయి. ఇవన్నీ పనులను ప్రారంభించే దశలో ఉన్నాయి.

అతిథ్య రంగం పుంజుకోవాలి
పారిశ్రామిక, ఐటీ రంగాల్లో గణనీయ పురోగతిని సాధిస్తున్న విశాఖలో అతిథ్య రంగం మరింతగా పుంజుకోవాలని, నగర సందర్శనకు వచ్చే వారిని ఆకట్టుకొనేలా రాయితీలతో కూడిన ఆహారా పదార్థాలను అందించాలని సీఎస్‌ సూచించారు. పర్యాటకంగా కూడా పలు ప్రాజెక్టులు, ప్యాకేజీలు రూపొందించాలన్నారు.

రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తాం…
గృహ నిర్మాణ రంగంపై సీఎస్‌ టక్కర్‌ బిల్డర్లుతో సమావేశయ్యారు. ఈ రంగంలో పెద్దఎత్తున ప్రాజెక్టులు చేపట్టేవారికి ప్రభుత్వం రాయితీలు కల్పించనుందన్నారు. దీనికి సంబంధించి త్వరలో కొత్త విధానం తీసుకురానున్నామని వివరించారు. టౌన్‌షిప్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విశాఖలో 3లక్షల ఇళ్లకు డిమాండ్‌ ఉందని, పారిశ్రామిక సముదాయాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టులను చేపట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తామన్నారు. బిల్డర్లు, బ్యాంకర్లతో కలిసి కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీ వేస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్‌ ఎన్‌.యువరాజ్‌, జీవీఏంసీ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌, వుడా వీసీ బాబారావునాయుడు, జేసీ నివాస్‌, ఎపిఐఐసి ఈడీ మహేశ్వరరెడ్డి, వుడా అదనపు వీసీ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.