యారాడలో విరాట్ టౌన్షిప్
200 ఎకరాల్లో అభివృద్ధి
ప్రతిపాదించిన అధికారులు
ఈనాడు – విశాఖపట్నం

యుద్ధ విమానాల వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్ భారత నౌకాదళంలో 1987 నుంచి సేవలందిస్తోంది. ఇది వచ్చే నెల 6న సేవల నుంచి తప్పుకోవటానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. దీనిని పర్యాటక ఆకర్షణీయ ప్రాజెక్టుగా రూపొందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం. ఇందుకు సుమారు రూ. 1000 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేశారు. 13 అంతస్థులుగా ఉన్న ఈ నౌకను భీమిలి తీరంలో నిలిపి కొంత భాగాన్ని మ్యూజియంగా, మరికొంత భాగాన్ని పర్యాటక హోటల్‌గా మార్చాలని అధికారులు భావించారు. దీనికి అనుబంధంగా 200 ఎకరాల్లో మరిన్ని ఆకర్షణలతో ప్రత్యేక టౌన్షిప్ నిర్మిస్తే పర్యాటకులు పోటెత్తుతారని అంచనా వేశారు. భీమిలి తీరానికి ఆనుకుని అంత ఖాళీ స్థలం దొరకలేదు. దీంతో అధికారులు మరో ప్రతిపాదన వైపు మొగ్గు చూపించారు. విశాఖ తీరం పొడవునా 200 ఎకరాల సువిశాల స్థలం కోసం వుడా అధికారులు పరిశీలించారు. తాజాగా యారాడ సమీపంలో అనువైన స్థలం ఉందని గుర్తించారు. నగరంలోని సుందర తీరాల్లో ఈ ప్రాంతం ఒకటి. ఇక్కడికి వెళ్లాలంటే కొండ మీదుగా రాకపోకలు సాగించాల్సి రావటంతో పర్యాటకంగా అంతగా అభివృద్ధి చెందలేదు. ఇక్కడ ఐ.ఎన్.ఎస్.విరాట్ టౌన్షిప్ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవాలంటే ఐదు నక్షత్రాల హోటళ్లు కావాలి. ఈ నేపథ్యంలో యారాడ ప్రాంతాన్ని పర్యాటక నగరంగా అభివృద్ధి చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.
కేంద్రం నిధులిచ్చేనా?
విరాట్ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ. వెయ్యి కోట్లు. ఇందులో కనీసం 50 శాతం కేంద్రం భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. యుద్ధనౌకను మ్యూజియంగా, నక్షత్ర హోటల్‌గా నిర్వహించాలంటే సామాన్య విషయం కాదు. నౌకను నీటిలోనే ఉంచాలి కాబట్టి దీనికి అనుకూలంగా జెట్టీని నిర్మించాలి. నిత్యం సాంకేతిక నిపుణుల బృందాన్ని అందుబాటులో ఉంచాలి. దీనికి భారీ వ్యయం తప్పదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అటు నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో భారం మొత్తం రాష్ట్రమే భరించాల్సిన పరిస్థితి.