మేనేజ్మెంట్ విద్యార్థులకు సృజనాత్మక భావాలు అవసరం

ఎం.వి.పి.కాలనీ, న్యూస్టుడే: మేనేజ్మెంట్ విద్యార్థులకు కేవలం సాంకేతిక పరిజ్ఞానం ఒక్కటే సరిపోదని.. సృజనాత్మక భావాలు అవసరమని ఎల్.జి.పాలిమర్స్ డైరెక్టర్(ఆపరేషన్స్) ఎస్.వి.ప్రవీణ్ అన్నారు. సోమవారం ఎంవీపీకాలనీ ఇంటిగ్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్(ఐ.ఐ.ఎ.ఎం.) కళాశాలలో 30వ బ్యాచ్ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పరిశ్రమల్లో 70 శాతం మేర మేనేజ్మెంట్ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారని.. విస్తృతమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిని అందిపుచ్చుకునేలా విద్యార్థులు సన్నద్ధమవ్వాలన్నారు. కళాశాల కార్యదర్శి, డీన్ డాక్టర్ ఎస్.పి.రవీంద్ర మాట్లాడుతూ మేనేజర్లుగా రాణించాలంటే అన్ని అంశాలపై నిశిత పరిశీలన అవసరమన్నారు. కార్యక్రమంలో ఐ.ఐ.ఎ.ఎం. కళాశాల డైరెక్టర్ డాక్టర్ విజయా రుద్రరాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూర్యతేజ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.