News

Realestate News

మెల్లమెల్లగా.. డిజిటల్‌ అడుగులు!

మెల్లమెల్లగా.. డిజిటల్‌ అడుగులు!
జిల్లాలో ఇప్పటికి ఇచ్చినవి 20 వేల కనెక్షన్లే..
మార్చి మాసాంతానికి లక్ష్యం 3 లక్షలు
ఇదీ ‘ఫైబర్‌ గ్రిడ్‌’ పురోగతి
ఈనాడు, విశాఖపట్నం
పథకం: ఏపీ ఫైబర్‌ డిజిటల్‌ లింక్‌
ప్యాకేజీ: బేసిక్‌: రూ.149,
స్టాండర్డ్స్‌: రూ.399, ప్రీమియం: రూ. 599
ట్రిపుల్‌ ప్లే సేవలు: – టెలిఫోన్‌ (వాయిస్‌): ఏపీ ఫైబర్‌ ఫోన్‌ నుంచి ఏపీ ఫైబర్‌ ఫోన్‌కు కాల్స్‌ ఉచితం, ఇతర ల్యాండ్‌ లైన్‌కు నిమిషానికి 50 పైసలు, మొబైల్‌ ఫోన్లకు నిమిషానికి రూపాయి, విదేశీ కాల్స్‌కు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఛార్జీల ప్రకారం వసూలు చేస్తారు.
ఐపీ టెలివిజన్‌: 250 టీవీ ఛానళ్లు (ఇందులో 30 హెచ్‌డీ ఛానళ్లు) అందుబాటులోకొస్తాయి.
అంతర్జాలం: అధిక వేగం, వైఫై సౌకర్యంతో అపరిమిత అంతర్జాల సౌకర్యం. గృహ వినియోగదారులకు 15 ఎంబీపీఎస్‌, గృహేతర వినియోగదారులకు 100 ఎంబీపీఎస్‌ వేగంతో..
విలువ ఆధారిత సేవలు: కోరుకున్న సినిమాలు, వీడియో కాన్ఫరెన్స్‌, ఈ-కామర్స్‌, టెలి మెడిసన్‌, ప్రోగ్రామ్‌ రికార్డింగ్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌, ఆన్‌లైన్‌ బిల్లుల చెల్లింపులు, ఆండ్రాయిడ్‌ అప్లికేషన్లు, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల సమాచారం, సేవలు, క్లౌడ్‌ ఆధారిత సేవలు తదితరమైనవి..

సమాచార విప్లవం రావాలి.. ప్రజల జీవన విధానంలో సమూల మార్పులు తేవాలి.. ఈ అడుగులు అభివృద్ధి దిశగా వడివడిగా పడాలి.. ఇదీ సర్కారు లక్ష్యం.. ఈ క్రమంలోనే తెరపైకి తెచ్చిన డిజిటల్‌ సేవల ప్రక్రియ మూడడుగులు ముందుకు.. ఆరడుగుల వెనక్కి చందాన సాగుతోంది. రాష్ట్రంలో తొలిసారిగా గతేడాది మార్చిలో విశాఖలో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌ గ్రిడ్‌ సేవలు ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. దీనికెన్నో కారణాలు కనిపిస్తున్నాయి.

అరకొరగా అందుబాటులోకి..: టీవీ, అంతర్జాలం, ఫోను సౌకర్యాలను కేవలం రూ. 149కే అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏపీ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌తో చర్యలకు ఉపక్రమించింది.
నగరంలో 5.42 లక్షల కేబుల్‌ కనెక్షన్లున్నాయి. ఇందులో డీటీహెచ్‌ కనెక్షన్లు 70 వేల వరకు ఉన్నాయి. గ్రామీణంలో 2.20 లక్షల వరకు కేబుల్‌ కనెక్షన్లు.. 1.30 లక్షలు డీటీహెచ్‌ కనెక్షన్లు ఉన్నాయి. మన్యంలోని 11 మండలాల్లో కేబుల్‌ సేవలు అంతంత మాత్రంగా ఉండడంతో డీటీహెచ్‌ వైపే మొగ్గుచూపుతున్నారు.

విశాఖ నగరం సహా గ్రామీణం, మన్యంలో ఫైబర్‌ నెట్‌ సేవలను అందుబాటులోకి తెచ్చినా.. గృహాలకు కనెక్షన్లు చేరువ కావటం లేదు. కేవలం 1300 కిలోమీటర్ల మేరకే ఫైబర్‌ కేబులు నడపగలిగారు. దాదాపు 140 వరకు 33 కేవీ సబ్‌స్టేషన్ల పరిధిలో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినా.. అక్కడ్నుంచి గృహాలకు చేరువ చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం కేబుల్‌ ఆపరేటర్లపై ఉంచింది.

ప్రస్తుతం కేబుల్‌ కనెక్షనుకు ఆపరేటర్లు రూ.250 చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని సదుపాయాలతో నిర్ణయించిన ధర రూ. 149. చాలాచోట్ల ఎన్‌లాగ్‌ కేబుల్‌తో కనెక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వ డిజిటల్‌ సేవలకు ఫైబర్‌ కేబుల్‌ ఏర్పాటు చేయాలి. ఈ కారణంగానే ఆపరేటర్లు ఆసక్తి చూపడంలేదు. పైగా రూ. 149లో ప్రభుత్వానికి రూ. 49 పోగా మిగిలింది కేబుల్‌ ఆపరేటర్లకు వస్తుందనే వాదన ఉంది. కనెక్షన్ల ప్రక్రియ పూర్తిస్థాయిలో ఏర్పాటయితే ఈ నెట్‌వర్క్‌పై ప్రభుత్వ పెత్తనం ఎక్కువవుతుందన్నది కొన్ని వర్గాల ఆరోపణ. దీంతో పైకి సహకరిస్తున్నట్లు కనిపిస్తున్నా.. లోలోన సహాయ నిరాకరణ కనిపిస్తోంది.

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధి మొత్తానికి ఫైబర్‌ సేవలను అందుబాటులోకి తెచ్చామని, మన్యానికీ, మైదానానికీ సేవలు చేరువ చేశామని ఫైబర్‌ నెట్‌ యంత్రాంగం చెబుతున్నా.. జిల్లా వ్యాప్తంగా 8.92 లక్షల కనెక్షన్లకుగాను కేవలం 20 వేలే ఇవ్వగలిగారు. మార్చినాటికి నిర్దేశించుకున్న 3 లక్షల కనెక్షన్ల లక్ష్యం అనుమానంగానే కనిపిస్తోంది.

నగరంలోని ఎంవీపీ కాలనీ, సీతమ్మధార, జగదాంబకూడలి, దొండపర్తి, అక్కయ్యపాలెం, మురళీనగర్‌, గాజువాక, వడ్లపూడి, అనకాపల్లి, భీమిలి తదితర ప్రాంతాలతోపాటు మన్యంలో అరకు, చింతపల్లి, పాడేరు, జీకేవీధి, ధారకొండ తదితర ప్రాంతాలకు సేవలను అందుబాటులోకి తెచ్చారు.

పేరుకు కనెక్షన్‌ రూ.149  అని చెబుతున్నా ఇందులో మూడు విభాగాలున్నాయి. పైగా రూ. 149కి అదనంగా ఫైబర్‌ సెటప్‌ బాక్సు రూ. 50, జీఎస్టీ భారం రూ. 36, కేబుల్‌ ఆపరేటర్‌ సర్వీసు ఛార్జి దూరాన్ని బట్టి.. అదనం కానున్నాయి.

రెండు దశల్లో..: రాష్ట్రంలో రెండు దశలుగా అన్ని విభాగాలను ఫైబర్‌ నెట్‌ పరిధిలోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ సంకల్పం. గృహాలు, పంచాయతీలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, మండల కార్యాలయాలు, మున్సిపాలిటీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఈ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయాలన్నది ఉద్దేశం. అంతర్జాల సౌకర్యం, ఆన్‌లైన్‌ సేవలు, వర్చువల్‌ డిజిటల్‌ తరగతులు, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ప్రభుత్వంతో పంచాయతీలు అనుసంధానమవుతాయి. భూగర్భ కేబుల్‌ టెండర్ల ప్రక్రియ పూర్తయితే ఈ పనులు వేగవంతమవుతాయని అధికారులు భావిస్తున్నారు.

ఇకపై ముఖాముఖి..: నేరుగా ప్రజలతోపాటు అధికారులతో ముఖ్యమంత్రి ఇతర ప్రభుత్వ అధిపతులు లైవ్‌లో మాట్లాడే  వీలుంది. ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా చర్యలకూ అవకాశం ఉంది. పైగా లైవ్‌ టీవీతోపాటు సందేశాలు, రిమైండర్లు, వాతావరణం, డిజిటల్‌ క్లాస్‌ రూములు, ఎఫ్‌ఎం రేడియో, షోషల్‌ మీడియా అప్లికేషన్లు,  ఇలా సమస్త సమాచారం అందుబాటులోకి రానుంది.
ఫైబర్‌ గ్రిడ్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 27న జాతికి అంకితం ఇవ్వనున్న నేపథ్యంలో మంగళవారం ట్రయల్‌రన్‌ నిర్వహించారు. నేరుగా రాష్ట్రపతి, ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉన్నందున సీఎం దత్తత గ్రామం పెదలబుడుతోపాటు మన్యంలోని పలు గ్రామాల అంగన్‌వాడీ కేంద్రాలు, వైద్యశాలలు, విద్యాలయాల్లో సేవల తీరును ట్రయల్‌ రన్‌ వేశారు. ఏయూ దూర విద్య కేంద్రం ప్రాంగణంలోని ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ కార్యాలయం నుంచి అధికారులు ఈ ప్రక్రియను పరిశీలించారు.

ఫైబర్‌ గ్రిడ్‌ కార్యక్రమానికి కేబుల్‌ ఆపరేటర్లకు, ఎంఎస్‌వోలకు ఆహ్వానాలందాయి. ఐదు బస్సులతోపాటు మరికొన్ని వాహనాలు జిల్లా నుంచి బయలుదేరినట్లు అధికారులు తెలిపారు.

మార్చినాటికి మరిన్ని కనెక్షన్లు
జిల్లాలో మార్చి నాటికి 3 లక్షల ఫైబర్‌ నెట్‌ కనెక్షన్లు ఇవ్వాలన్నది మా ముందున్న లక్ష్యం. ఇప్పటికి 20 వేల కనెక్షన్లు ఇచ్చాం. ఈ ప్రక్రియ వేగవంతం చేస్తాం. నగరంలో అన్ని ప్రాంతాలకు సేవలను అందుబాటులోకి తెచ్చాం. సమీపంలోని కేబుల్‌ ఆపరేటర్లను సంప్రదిస్తే కనెక్షను ఇస్తారు. ఫైబర్‌ నెట్‌ లింకు ద్వారా సాధారణ టీవీ కూడా స్మార్ట్‌ టీవీగా వాడుకోవచ్చు. టెలిఫోన్‌ సౌకర్యం, వీడియో కాలింగ్‌, మొబైల్‌ ఫోన్‌లో ఉండే వాట్సప్‌ ఇతర ఆండ్రాయిడ్‌ అప్లికేషన్లన్నీ టీవీలోనే చూసుకుని వినియోగించుకోవచ్చు. విద్య, వైద్య, వ్యవసాయ తదితర  సమాచారాలూ ఎప్పటికప్పుడు పొందే వీలుంది.

– వి.భానుప్రకాష్‌, జిల్లా మేనేజర్‌, ఏపీ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌