మెరుగైన విద్యుత్తు సేవలే లక్ష్యం
మెరుగైన విద్యుత్తు సేవలే లక్ష్యం
రూ. 160.50 కోట్లతో జిల్లాలో ఉపకేంద్రాల నిర్మాణం
ఎస్సీ, ఎస్టీలకు అదనంగా 2.60 లక్షల ఎల్ఈడీ బల్బులు
ఈపీడీసీఎల్ ఎస్ఈ సూర్యప్రకాశ్
విశాఖపట్నం, ఈనాడు
డీడీయూజీవై కింద జిల్లాలో 52,449 గృహాలకు విద్యుత్తు సౌకర్యం కల్పించామని తెలిపారు. విద్యుత్తు సౌకర్యం కల్పించడానికి.. గ్రామాలకు రవాణా వ్యవస్థ లేని 178 ఆవాస ప్రాంతాలకు 1,740 సౌర విద్యుత్తు లాంతర్లు అందజేసినట్లు వెల్లడించారు.
అంతరాయాలు లేని మెరుగైన విద్యుత్తు సేవలు అందించడమే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ ఆపరేషన్స్ విభాగం పర్యవేక్షక ఇంజినీరు (ఎస్ఈ) టి.వి.సూర్యప్రకాశ్ తెలిపారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఈయన ‘ఈనాడు’తో మాట్లాడారు. జిల్లా భౌగోళిక పరిస్థితిపై పూర్తిస్థాయి అవగాహన ఉన్నందున సిబ్బంది సహకారంతో మెరుగైన విద్యుత్తు సేవలు అందించే చర్యలు చేపడతామన్నారు. జిల్లా కేంద్రంలో 24 గంటల పాటు విద్యుత్తు అంతరాయాలు లేకుండా.. ప్రజలకు, పరిశ్రమలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్తుకు ఆటంకాలు లేకుండా చూస్తున్నట్లు చెప్పారు. విద్యుత్తు సేవల్లో అసౌకర్యానికి గురైతే తమ దృష్టికి తీసుకురావచ్చన్నారు.
మార్చిలోగా ఉపకేంద్రాలు పూర్తి
జిల్లాలో ప్రపంచ బ్యాంకు నిధులు రూ.120 కోట్లతో 33/11 కేవీ విద్యుత్తు ఉప కేంద్రాలు 30 మంజూరయ్యాయని ఎస్ఈ సూర్యప్రకాశ్ తెలిపారు. సమీకృత విద్యుత్తు అభివృద్ధి పథకం (ఐపీడీఎస్) కింద రూ.17.50 కోట్లతో పట్టణాలకు 19 ఉపకేంద్రాలు, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (డీడీయూజీవై) కింద రూ. 23 కోట్లతో 14 ఉపకేంద్రాలు మంజూరైనట్లు చెప్పారు. మార్చి నాటికి వీటన్నింటి నిర్మాణం పూర్తి చెయ్యాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. రూ. 730 కోట్లతో విశాఖ నగరంలో భూగర్భ విద్యుత్తు లైను నిర్మాణ ప్రక్రియ టెండర్ల దశలో ఉందన్నారు.
మండల కేంద్రాల్లో బల్బుల పంపిణీ
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు అదనంగా రెండు చొప్పున ఎల్ఈడీ విద్యుత్తు బల్బులు ఈనెల 3 నుంచి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో బల్బుకు రూ.5 చొప్పున చెల్లించాలని ఆధార్, విద్యుత్తు బిల్లు, ఓటరు గుర్తింపు కార్డుగానీ చూపించి బల్బులు తీసుకెళ్లొచ్చన్నారు. జిల్లాలో 1,30,350 కుటుంబాలున్నాయని.. వీరికి ఎల్ఈడీ బల్బులు అందించడానికి ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. సంచార వాహనం ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈనెల 10లోగా పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని ఎస్ఈ సూర్యప్రకాశ్ తెలిపారు.