‘మెడిటెక్’ భూములపై సర్వేకు ప్రత్యేకాధికారి నియామకం

పెదగంట్యాడ :
నడుపూరు ప్రాంతంలో ఏర్పాటు కానున్న మెడిటెక్ పార్కు భూములకు సంబంధించి పూర్తిస్థాయి సర్వే, రైతులకు పరిహారం పంపిణీకి ఓ ప్రత్యేకాధికారిని కలెక్టర్ నియమించారు. మెడ్‌టెక్ కోసం 274 ఎకరాలను కేటాయించిన సంగతి తెలిసిందే. అందులో సుమారు 190 ఎకరాలకు పైగా రైతులు సాగుచేస్తున్న భూములు ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ భూములకు సంబంధించి తొలుత 200మంది రైతులతో రెవెన్యూ అధికారులు జాబితాలు తయారు చేశారు. ఇందులో మాజీసైనికులు సైతం ఉన్నారు. అయితే ఆ జాబితాల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కలెక్టర్ స్పందించారు. సంబంధిత భూములను మరోసారి సర్వేచేసి, పూర్తిగా అర్హులైన వారితో జాబితాలు తయారుచేయాలని ఐలా కమిషన్ వేణుగోపాల్‌ను ప్రత్యేకాధికారిగా కలెక్టర్ నియమించారు. వారం రోజుల్లో విచారణ జరిపి అర్హుల జాబితాను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని, దాని ఆధారంగా రైతులకు పరిహారం పంపిణీ జరుగుతుందని ప్రత్యేకాధికారిగా నియమితులైన వేణుగోపాల్ ‘న్యూస్‌టుడే’కు వివరించారు.