News

Realestate News

మెట్రో మెలిక!

మెట్రో మెలిక!
20శాతం నిధులివ్వడంలో స్పష్టత ఇవ్వని ప్రభుత్వాలు
రాష్ట్రం నుంచి వెళ్లని అంగీకారపత్రం
18 నెలలైనా పెండింగ్‌లోనే ప్రాజెక్టు
అనుమతులు ఇవ్వడంలోనూ కేంద్ర ఆర్థికశాఖ వెనకడుగు
అంచనా వ్యయం పెరిగే అవకాశం
మెట్రో మాట వింటుంటేనే విశాఖ వాసులకు విసుగెత్తుతోంది. ఇదిగో ఇప్పుడు అప్పుడు అంటూ కాలయాపన చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తుండటంతో ఈ ప్రాజెక్టు ఒక ప్రహసనంగా మారింది. అసలు ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇంకా నిధులిచ్చేందుకే సమాయత్తం కాలేదన్నది తాజా సంకేతాల్ని బట్టి తెలుస్తోంది.

ఈనాడు-విశాఖపట్నం:మెట్రో ప్రాజెక్టుకు అనుమతులు రావాలంటే.. ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులమీద స్పష్టత రావాలి. తొలిగా రాష్ట్రం నుంచి నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్రానికి అంగీకారపత్రాన్ని పంపితే.. దాన్ని పరిశీలించి కేంద్రమూ నిధులు కేటాయిస్తూ అనుమతులు ఇస్తుంది. ఇది ప్రక్రియ. కానీ.. 2015 డిసెంబరులో డీపీఆర్‌ దిల్లీకి వెళ్లినా.. ఈ ప్రక్రియలో మెరుగుదల లేకపోవడంతో మొత్తానికే ప్రాజెక్టు పెండింగ్‌లో ఉండిపోతోంది. కేంద్రం, రాష్ట్రం తలో 20శాతం నిధులు ఈ ప్రాజెక్టుకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే.. రూ.2300కోట్ల నుంచి రూ.2700కోట్ల మధ్య ఒక్కో ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఇది చెల్లించేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు.

రాష్ట్రంలో అమరావతి మెట్రోకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది. ఇటు విశాఖ మెట్రో కూడా వరసలో ఉంది. అయితే రెండు ప్రాజెక్టులకు వ్యయం భరించడం కష్టం అవుతుండటంతో ముందుగా అమరావతి మెట్రో రైల్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. ప్రత్యామ్నాయంగా విశాఖ మెట్రోను పీపీపీ విధానం కింద నిర్మించవచ్చనే అంచనాలకు వచ్చారు. ఇటు రాష్ట్రం, అటు కేంద్ర ప్రభుత్వంలో విశాఖ మెట్రో మీద ఈ ఆలోచన వరకే ప్రక్రియ నడిచి ఆగిపోయింది. ఆ తర్వాత ఎలాంటి మెరుగుదల కనిపించడంలేదు. ఈ ఫైలు ఇప్పటికీ కేంద్ర ఆర్థిక శాఖ విభాగాల్లోనే పెండింగ్‌లో పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులమీద స్పష్టత ఇచ్చి ఖర్చు పెట్టేందుకు సిద్ధమవ్వనిదే ఎలా నిర్ణయం వెలువడే అవకాశం లేదన్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.

అనుమతి వస్తేనే ఏదైనా..
విశాఖ మెట్రో ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుందనేది.. టెండరు ప్రక్రియకు వెళ్లేందుకు అనుమతులు వస్తేగానీ చెప్పే పరిస్థితి కనిపించడంలేదు. ప్రస్తుతం కేంద్ర ఆర్థికశాఖలో పెండింగ్‌లో ఉన్న విశాఖ ప్రాజెక్టుకు నిధులపరంగా స్పష్టమైన సంకేతాలు ఉంటేగానీ అనుమతించే అవకాశం ఉండదు. అక్కడ అనుమతులు వచ్చేస్తే ఫైలు నేరుగా కేంద్ర పురపాలికశాఖకు వెళ్తుంది. అక్కడ ఇన్‌ప్రిన్సిపుల్‌ అనుమతులు తీసుకున్న తర్వాతే టెండరు ప్రక్రియకు వెళ్లాల్సి ఉంటుంది.

కొత్త పాలసీ కూడా రావాలి..
ప్రత్యేకించి మెట్రో రైల్‌ ప్రాజెక్టు కొత్త పాలసీ తెస్తున్నట్లు ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించారు. నూతన ఆర్థిక విధానాలతో పాటు సాంకేతిక వినియోగంలో మార్పులు తదితర అంశాలపై కొన్ని విధివిధానాలు తీసుకురాబోతున్నారు. ఈ నూతన పాలసీ ఏర్పాటు నేపథ్యంలో కూడా విశాఖ మెట్రో ఆలస్యమవుతోంది. ఎందుకంటే.. విధివిధానాలు బయటికి రానిదే భావవ్యక్తీకరణ టెండర్లకు వెళ్లేందుకు ఆస్కారం లేదు. ఈ పాలసీ రావడానికి మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు.

విమానాశ్రయం వచ్చాకే భోగాపురం దాకా..
నగరం నుంచి భోగాపురం వరకు మెట్రో రైలును విస్తరించాలనే ఒక ప్రతిపాదన నడుస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న ప్రతిపాదనలకే అనుమతి తీసుకోవడం ప్రధానమన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మధురవాడ నుంచి భోగాపురం మధ్య ఎక్కడా పెద్ద స్టేషన్లు వచ్చే అవకాశం ఇప్పట్లో లేదు. కాబట్టి.. విమానాశ్రయం వచ్చిన తర్వాత, రాకపోకలు మొదలైన తర్వాతే విస్తరణ గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విస్తరణ వల్ల మరో రూ.6వేల కోట్ల వరకు భారం పడే అవకాశం ఉంది.

కనిపించని ఒత్తిడి..
విశాఖ మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలమీద ఎలాంటి ఒత్తిడీ లేనట్లు స్పష్టమవుతోంది. రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా ఈ ప్రాజెక్టు మీద పేరుకు దిల్లీ వెళ్లొస్తున్నారుగానీ.. ఈ పని ఇప్పుడప్పుడే అవదనేది తాజా పరిణామాల బట్టి అంచనాకు రావాల్సి వస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

అంచనా వ్యయాలూ మారొచ్చు..
పీఆర్‌ను 2015లో తయారుచేశారు. అంటే.. అప్పటి ధరల ప్రకారమే అంచనాలు వేశారు. ఇది జరిగి ఏడాదిన్నర అవుతోంది. ఈ ప్రాజెక్టుకు ఎప్పుడు గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుందో ఇంకా స్పష్టత లేదు. కాబట్టి.. ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగడంతో పాటు ప్రభుత్వాల మీద కూడా భారం పడే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన తర్వాత.. పురపాలకశాఖ ఆధ్వర్యంలో ఈ ధరల సవరణ జరుగుతుంది.

పలు సంస్థల ఆసక్తి..
విశాఖ మెట్రో ప్రాజెక్టు చేపట్టేందుకు ఇప్పటికే పలు సంస్థలు ముందుకొచ్చాయి. మొదట్లో చైనా సంస్థలు, ఆ తర్వాత సింగపూర్‌, మలేషియాకు చెందిన పలు కంపెనీలు విశాఖలో పర్యటించి వెళ్లాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరికొన్ని సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతోంది. టెండర్లు పిలిచాక మరిన్ని సంస్థలు ముందుకొస్తాయనే ఆశాభావంతో ఉన్నారు. అనుమతులు రాగానే.. ప్రణాళిక మీద సీఎం చంద్రబాబునాయుడు ఓ ప్రజెంటేషన్‌ కూడా ఇచ్చేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo