News

Realestate News

‘మెట్రో’కు మార్గం సుగమం

Metro rail porject news in vizag picture

ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణం

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: విశాఖ సిగలో మరో అద్భుత ప్రాజెక్టు వచ్చి చేరనుంది. మెట్రోరైలు ప్రాజెక్టుపై కమ్ముకున్న నీలినీడలన్నీ తొలగిపోయాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిధులలేమితో ప్రాజెక్టుపై పలు సందేహాలు తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వ- ప్రయివేటు భాగస్వామ్యం ద్వారా చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈనెల 8న ఆమోదించగా, 10న రాష్ట్ర ప్రభుత్వం కూడా తన సమ్మతిని తెలిపింది. దీంతో విశాఖ మెట్రో బాధ్యతలు చూస్తోన్న అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామకృష్ణారెడ్డి, దిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌(డీఎంఆర్‌సీ) కార్యనిర్వాహక ఇంజినీరు కేవీఎన్‌ రవి, ఇతర బృంద సభ్యులు నగరంలోని మెట్రో రైలు ప్రాజెక్టుకు ఎంపిక చేసిన మార్గాలను పరిశీలించారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌తో సమావేశమై ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణపై చర్చించారు. భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన చేపట్టడానికి కలెక్టర్‌ కూడా అంగీకరించారు.

మూడు కారిడార్లు… 45 కిలోమీటర్లు…
విశాఖ నగరంలో మూడు కారిడార్లలో 45 కిలోమీటర్ల పరిధిలో మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు.
కారిడార్‌ 1: కొమ్మాది నుంచి గాజువాక వరకూ
కారిడార్‌ 2: గురుద్వారా నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ మీదుగా పాతపోస్టాఫీసు వరకూ
కారిడార్‌ 3: తాటిచెట్లపాలెం నుంచి రైల్వేస్టేషన్‌, ద్వారకాబస్‌స్టేషన్‌, సిరిపురం మీదుగా పార్కు హోటల్‌ వరకూ
ఆయా మార్గాల స్థితిగతులపై దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(డీఎంఆర్‌సీ) సలహాదారు శ్రీధరన్‌ సర్వే నిర్వహించి, నివేదిక సమర్పించారు. ప్రయాణికుల రాకపోకలు, వాహన రద్దీ తదితర అంశాలను తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జీవీఎంసీ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. రూ.13వేల కోట్ల వ్యయం అవుతుందని నివేదిక సమర్పించారు. దీనికి తొలుత కేంద్ర ప్రభుత్వం ఆసక్తి కనపరచలేదు. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టును పక్కనపెట్టారు. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం(పీపీపీ)ద్వారా నిర్మించడానికి అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. తాజాగా కేంద్రం ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతోపాటు, నగరంలో పరిస్థితులను తెలుసుకోవాలని అమరావతి మెట్రోరైలు కార్పొరేషన్‌ అధికారులను ఆదేశించింది.

రూ.13,488 కోట్లతో ప్రాజెక్టు…
విశాఖపట్నం మెట్రోరైలు ప్రాజెక్టుకు రూ.13,488 కోట్లు ఖర్చవుతుందని తాజాగా అధికారులు అంచనా వేశారు. వాటిలో 20 శాతం గ్రాంటు రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 20 శాతానికి సంబంధించి నగరంలో చేపట్టనున్న భూసేకరణ భారాన్ని మోయడానికి ఆమోదం తెలిపింది. మిగతా 60 శాతం నిధులు ప్రయివేటు కంపెనీల నుంచిపెట్టుబడి పెట్టించనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ల ఆహ్వానం, ఇతర ప్రక్రియలకు సాధారణంగా రెండేళ్ల సమయంపడుతుండగా, నగరంలో మెట్రోకు 8 నెలల నుంచి ఏడాదిలోపే ఆయా పనులన్నీ పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అర్బన్‌ మాస్‌ ట్రాన్సిస్ట్‌ కంపెనీ ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంస్థ బాధ్యతలను తీసుకోనుంది. ప్రాజెక్టు నిర్మాణంలో న్యాయపరమైన,ఆర్థిక, సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా వీరు బాధ్యతలు వహిస్తారు.

ఐదెకరాల సేకరణ…
నగరంలో మెట్రోరైలు ప్రాజెక్టు కోసం కేవలం ఐదెకరాలు సేకరిస్తే సరిపోతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. 42 స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. భూగర్భంలో నుంచి ప్రాజెక్టుకు ఆస్కారం లేదని, పైవంతెన నుంచి వెళ్లేలా ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రైలు దిగువన ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

నాలుగేళ్ల వ్యవధి…
మెట్రోరైలు ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దశలవారీగా నిర్మాణం చేపట్టినా, వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ఒప్పందం చేసుకుంటామన్నారు. మెట్రో ఆమోదం లభించి, పీపీపీ ఒప్పందం కూడా పూర్తయితే ప్రాజెక్టు పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నారు.

విజయవాడ మెట్రో పొడిగింపు…
విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టు ప్రస్తుతం ఉన్న 26 కిలోమీటర్ల పరిధిని 45 కిలోమీటర్లకు(విజయవాడ-గుంటూరు-అమరావతి) పొడిగిస్తూ సవివర పథక నివేదిక(డీపీఆర్‌) తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో, నెలరోజుల్లోగా దాన్ని సిద్ధం చేసి సమర్పించడానికి సన్నాహాలు చేస్తున్నామని అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టు మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామకృష్ణారెడ్డి తెలిపారు. త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించి రూ.100 కోట్లు విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. నిధులు విడుదలైన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు.