News

Realestate News

మూడు రోజుల్లో అంతా సర్దుకుంటుంది!

ఆసుపత్రులో, పెట్రోలు బంకుల్లో 24 వరకూ పాతనోట్ల చెల్లుబాటు
బ్యాంకర్లతో సమావేశమైన కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా నెలకొన్న నగదు కొరత రెండు మూడురోజుల్లో కొలిక్కి రానుందని జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్సు సమావేశమందిరంలో కలెక్టర్‌ నగరంలో ఉన్న 43 జాతీయ, ప్రైవేటు, సహకార బ్యాంకులకు చెందిన అధికారులతో సమావేశమయ్యారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గత నాలుగైదు రోజుల్లో నెలకొన్న పరిస్థితులు, బ్యాంకర్లు అనుసరించిన విదానాలు, ఖాతాదారులకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్‌ సమీక్షించారు. అనంతరం విలేకర్లతో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో వివిధ బ్యాంకులకు చెందిన 730 శాఖలు ఉన్నాయని, 1,140 ఏటీఎంలు ఉన్నాయని తెలిపారు. అన్ని బ్యాంకుల్లో నగదు మార్పిడి జరుగుతోందన్నారు. రూ. 100 నోట్లు తక్కువగా వస్తున్నందున ఇబ్బంది ఎదురవుతోందని, రూ. 500 కొత్త నోట్లు ఇంకా రాలేదన్నారు. ఆర్‌బీఐ సమాచారం ప్రకారం ఒకటి రెండురోజుల్లో అవి అందుబాటులోకి వస్తాయన్నారు. రూ. 2000 నోట్ల అధికంగా ఉన్నాయని, వీటిని తీసుకొనేందుకు జనం నిరాకరిస్తున్నారన్నారు. అంతా రూ. 100 నోట్లు కావాలని అడుతున్నందున కొరత ఏర్పడుతోందన్నారు. తీసుకున్న రూ. 100 నోట్లు మళ్లీ వినియోగంలోకి రావడం లేదని, దీనివల్ల సమస్య మరింత జటిలమవుతోందన్నారు. తీసుకున్న రూ. 100 నోట్లు వినియోగంలోకి తెస్తే ఇబ్బందులు తప్పుతాయన్నారు. ఏటీఎంలో రూ. 2 లక్షలకు మించి రూ. 100 నోట్లు పెట్టే పరిస్థితి లేదని తెలిపారు. ఒకసారి నోట్లు అయిపోయిన తర్వాత మళ్లీ ఏటీఎంలో నింపాలంటే అయిదారు గంటలు పడుతోందన్నారు. ఆంధ్రాబ్యాంకుకు రూ. 33 కోట్ల మేర చిల్లర నోట్లు పంపినట్లు ఆర్‌బీఐ సమాచారం ఇచ్చిందని, ఈ నగదు 7 బ్యాంకులకు కేటాయించారని తెలిపారు. ఇంతవరకూ రూ. 954 కోట్ల డిపాజిట్లు వచ్చాయని, రూ. 303 కోట్లు పంపిణీ చేశామన్నారు.
24 వరకూ గడువు పొడిగింపు

ఆసుపత్రులు, పెట్రోలు బంకుల్లో ఈనెల 24 వరకూ రద్దయిన నోట్లను తీసుకోవాలని కేంద్రం ఆదేశించిందని కలెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నీరు, ఆస్తి తదితర పన్నులకు పాత నోట్లను వినియోగించుకోవచ్చన్నారు. ఆసుపత్రులు, పెట్రోలు బంకులపై నిఘా ఉంచామని, ఆరోగ్యశాఖ, పౌరసరఫరాల శాఖకు చెందిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని, ఎక్కడైనా ఎవరైనా పాత నోట్లను నిరాకరిస్తే కేసులు పెడతామని కలెక్టర్‌ హెచ్చరించారు. బ్యాంకుల వద్ద తాగునీరు వసతి కల్పిస్తున్నామని, షామియానాలు వేస్తున్నామని చెప్పారు. సమీక్షలో ఆంధ్రాబ్యాంకు డీజీఎం విజయలక్ష్మి, లీడ్‌బ్యాంకు అధికారి శరత్‌బాబు పాల్గొన్నారు.