News

Realestate News

మురిసిన విశాఖ

మురిసిన విశాఖ
రాష్ట్రస్థాయిలో ఇనుమడించిన ఖ్యాతి
పర్యటకానికి ఆదరణ
విశాఖపట్నం – ఈనాడు
విశాఖపట్నం బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచేలా నిర్వహించిన మహత్తర ఉత్సవం ఆదివారంతో ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవానికి జనం నీరాజనం పలికారు. ప్రారంభ వేడుకల నుంచే ఉత్సవాన్ని తిలకించేందుకు నగర వాసులు సాగరతీరానికి పోటెత్తారు. వారంతం కావడంతో శని, ఆదివారాల్లో విశాఖతో పాటు చుట్టు పక్కల పరిసరాలను అధిక సంఖ్యలో జనాలు రావడంతో సాగరతీరంలో మరో సంద్రం కనిపించింది. ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించారు. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, వుడా ఉపాధ్యక్షుడు బాబూరావునాయుడు, జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్‌, పోలీస్‌శాఖ ఉన్నతాధికారులంతా ఉత్సవం విజయవంతంలో కీలకపాత్ర పోషించారు.ఉత్సవానికి తరలివచ్చిన మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు తరలివచ్చి విశాఖవాసుల్లో ఉత్సాహం నింపారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, శాసనసభాధిపతి కోడెల శివప్రసాదరావు, సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, గంటా శ్రీనివాసరావు ప్రారంభ వేడుకలకు తరలి రాగా రెండో రోజున అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి వచ్చారు. ముగింపు వేడుకలకు వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, యానాం మంత్రి మల్లాడి కృష్ణారావు తరలి వచ్చారు. విశాఖ ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన స్థానిక మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా అధికారగణాన్ని కొనియాడారు.మనసు దోచిన అనూప్‌ రూబెన్‌
బీచ్‌రోœü: విశాఖ ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా సంగీత దర్శకులు అనూప్‌ రూబెన్‌ బృందం ఆదివారం రాత్రి ప్రధాన వేదిక వద్ద జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సంగీత విభావరి ఆకట్టుకుంది. విశాఖ అందాలు, సంస్కృతి, పునర్నిర్మాణం తదితర అంశాలను స్పృశిస్తూ అనూప్‌ రూబెన్‌ బృందంతో పాట పాడారు. ఈ గేయాన్ని విశాఖ వాసులకు అంకితమిస్తున్నట్లు తెలిపారు. మనం చిత్రంలోని చిన్నిచిన్ని ఆశ పాట తరహాలోనే వేదిక వద్ద చరవాణి దీపాలను వెలిగించి సందడిగా పాటలు ఆలపించారు. జనం మధ్యలోనికి వచ్చి చిందులు వేస్తూ పాటలు పాడడంతో ఉరిమే ఉత్సాహంతో సంగీత కార్యక్రమం జరిగింది. శ్వేత పండింటü గానామృతంతో అలరించారు.

ఆకట్టుకున్నవి ఇవే..
* ఉత్సవంలో జనాల్ని విశేషంగా ఆకట్టుకున్న వాటిలో పరిమళ పుష్ప ప్రదర్శన ఒకటి. 150 రకాలకుపైగా సొగసైన పూలను ప్రదర్శనగా ఉంచడంతో పాటు అమరావతి స్థూపాన్ని, బుద్దుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చూపరులకు కనువిందు కలిగించాయి.
* ఉత్తరాంధ్ర నమూనా దేవాలయాలన్నీ ఒకే ప్రాంగణంగా ఏర్పాటు చేయడంతో వాటిని దర్శించుకోవడానికి జనాలు బారులు తీరారు.
* సాంస్కృతిక కార్యక్రమాలకు, క్రీడలకు, జనపద కళలకు సంబంధించి వేర్వేరుగా వేదికలను ఏర్పాటు చేసి ప్రదర్శించడం పట్ల నగర జనం సంతృప్తి వ్యక్తం చేశారు.
* ఈ ఏడాది కొత్తగా పర్యటకానికి సంబంధించి క్వార్డ్‌ బైక్‌ రేసింగ్‌, గాలిలో తేలే పారా మోటారింగ్‌ను పరిచయం చేయడంతో నగరవాసులు వీటి పట్ల ఆసక్తిని కనబర్చారు. వీటితో భవిష్యత్తులో విశాఖ పర్యటకం కొత్త పుంతలు తొక్కబోతుందని అధికారులు తెలియజేశారు.
* మూడు రోజులుగా లక్షలాది జనం వచ్చినా తాగునీటికి ఇబ్బందిలేకుండా ప్రతి 20 మీటర్లకు మంచినీటి సదుపాయాన్ని కల్పించారు.
* రెండో రోజు ఉత్సవంలో సినీ హీరో రానా పాల్గొని ఘజీ సినిమా ట్రైలర్‌ను విడుదల జేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
* అదే రోజున జిల్లా పాలనాధికారి కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఈలపాటతో తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.
* ఉత్సవం మొత్తం మంత్రి గంటా శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగింది. జిల్లాకే చెందిన మరో మంత్రి అయ్యన్నపాత్రుడు ఉత్సవాల్లో పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది.
* మొత్తంగా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించి నగరవాసుల మెప్పు పొందారు.