News

Realestate News

ముచ్చటగా..మూడు

ముచ్చటగా..మూడు
రూ. 113 కోట్లతో ఎన్‌ఏడీ పైవంతెన పనులకు..
రూ.10 కోట్లతో టీయూ- 142 యుద్ధవిమాన ప్రదర్శనశాలకు..
విలయం నుంచి వికాసం వైపు అడుగులేసిన విశాఖలో ఆనంద దీపావళికి..
నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా శ్రీకారం
ఈనాడు – విశాఖపట్నం
మొదటి అడుగు.. అత్యంత రద్దీగా ఉండే ఎన్‌ఏడీ కూడలిలో ట్రాఫిక్‌ చిక్కులను తొలగించడానికి పై వంతెన పనులకు శంకుస్థాపన..

రెండో అడుగు.. పర్యాటకంగా విశాఖ నగర ప్రతిష్ఠ పెంచే దిశగా టీయూ-142 యుద్ధవిమాన ప్రదర్శనశాల పనుల ప్రారంభం

మూడో అడుగు.. విలయం నుంచి వికాసం వైపు అడుగులు వేసి స్ఫూర్తి నింపిన విశాఖ ప్రజల కోసం ఆనంద దీపావళి మంగళవారం నిర్వహించనున్న ఈ మూడు కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్నారు. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, వుడా వీసీ పట్నాల బసంత్‌కుమార్‌.. పర్యాటకశాఖ ఆర్డీ ఆర్‌.శ్రీరాములునాయుడు ఆధ్వర్యంలో చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.

* ప్రాజెక్టు: ఎన్‌ఏడీ పైవంతెన నిర్మాణం * నిర్మాణ వ్యయం: రూ. 113 కోట్లు * సమస్య: నిత్యం ట్రాఫిక్‌ చిక్కులు ఎదురయ్యే కీలక కూడలి * పరిష్కారం: ఇక్కడ రోటరీ మోడ్‌ సపరేటర్‌ తరహాలో పైవంతెన నిర్మాణం * ప్రాజెక్టు పూర్తికి గడువు: రెండేళ్లు

పశ్చిమ ఎమ్మెల్యే పీవీజీఆర్‌ నాయుడు (గణబాబు)తోపాటు ఆ నియోజకవర్గ ప్రజలు.. నగర వాసుల విన్నపం మేరకు ఈ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. అండర్‌ పాసేజ్‌.. రోటరీ.. ఫ్లై ఓవర్‌ నిర్మాణాలతో మూడు వరుసల్లో రోటరీ సపరేటర్‌ తరహాలో నిర్మిస్తారు.

* ప్రాజెక్టు: టీయూ-142 యుద్ద విమాన ప్రదర్శనశాల * నిర్మాణ వ్యయం: రూ. 10 కోట్లు * ఉద్దేశం: పర్యాటకంగా విశాఖ నగర ప్రతిష్ఠ ఇంకా పెంచాలన్నదే.. * పనుల పూర్తికి గడువు: డిసెంబరు

ఇప్పటికే విమానం బిగింపు పూర్తయింది. కింది భాగంలో గ్రానైట్‌ ఫ్లోరింగ్‌.. రాత్రివేళల్లో రన్‌ వేను తలపించేలా విద్యుత్తు కాంతుల అమరిక పూర్తయింది.ఈ విమానాన్ని, ప్రదర్శనశాల పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం సాయంత్రం ప్రారంభిస్తారు. డిసెంబరు మొదటి వారంలో నౌకాదళ దినోత్సవానికి హాజరుకానున్న రాష్ట్రపతి చేతుల మీదుగా.. ప్రదర్శనశాలను ప్రారంభించాలని భావిస్తున్నారు.

3. * కార్యక్రమం: ఆనంద దీపావళి *ఎక్కడ: రామకృష్ణ బీచ్‌లో.. * ఎప్పుడు..?: ఈ నెల 17, 18 తేదీల్లో * ప్రత్యేకత: హుద్‌హుద్‌ విపత్తు నుంచి విశాఖ నగరం కోలుకుని మూడేళ్లు గడిచిన నేపథ్యంలో… భావితరాల్లో స్ఫూర్తిని నింపేందుకు 2 వేలమంది చిన్నారుల నడుమ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీకారం చుడతారు. మూగ, బధిర, అంధ, అనాథ బాలలతో ప్రారంభిస్తారు. ఈ రెండు రోజులూ సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు నోవాటెల్‌ ఎదురుగా వేదికపై ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాట్లు చేశారు. బాణసంచా పేలుళ్లు ఉండకుండా శబ్దరహితంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నింగిలోకి దూసుకెళ్తూ రంగులు విరజిమ్మే తారాజువ్వలు, బీచ్‌రోడ్డు పొడవునా విద్యుత్తు దీపాలంకరణలు.. నోరూరించే వంటకాలతో నక్షత్ర హోటళ్ల ఆధ్వర్యంలో ఆహారశాలలు.. 50 శాతం రాయితీ ప్రముఖ షాపింగ్‌మాల్స్‌ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌ స్టాళ్లు ఏర్పాటుచేయనున్నారు. సాగర తీరాన్ని సోమవారం రాత్రికే విద్యుత్తు ధగధగలతో నింపేశారు.

అనుమతులు రాక ఆగిన హెలీ..
ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఈ నెల 17న హెలీటూరిజం అందుబాటులోకి తేవాలని వుడా భావించింది. మైసూరులో దసరా ఉత్సవాలకు వెళ్లిన హెలికాప్టర్‌ను ఇక్కడికి రప్పించి సీఎం చేతుల మీదుగా ట్రైల్‌ రన్‌కు జెండా వూపించాలని అనుకున్నారు. అనుమతులు రాకపోవడంతో నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు.