News

Realestate News

మీ సేవ.. అక్రమాల తోవ..!

మీ సేవ.. అక్రమాల తోవ..!
విపరీతమైన జాప్యం
పైగా అదనపు వసూళ్లు
జిల్లాలో మీసేవా కేంద్రాలు 785
జీవీఎంసీ పరిధిలో..293
వీటి ద్వారా అందాల్సిన సేవలు: 321
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలోని కేంద్రాలు: 22

ఏవీఎన్‌ కళాశాలకు సమీపంలోని ఓ మీ-సేవా కేంద్రంలో నిర్దేశిత రుసుములకంటే అదనంగా వసూలు చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు అధికారులు పరిశీలించి ఇటీవలే మూయించేశారు.

సీతమ్మధారలోని ఓ ప్రాంతంలో మీ సేవా కేంద్రానికి అనుమతిస్తే సదరు నిర్వాహకుడు ఏకంగా తహసిల్దారు కార్యాలయం పక్కనే పెట్టేశాడు. దీన్ని పరిశీలించిన అధికారులు.. అనుమతి లేకుండా కేంద్రాన్ని మార్చినందుకు మూయించేశారు.

ఈ రెండే కాదు.. ఇటీవల మురళీనగర్‌, ఉషోదయ కూడలిలో రెండు కేంద్రాల నిర్వహణలోనూ లోపాలను గుర్తించిన అధికారులు మూయించేశారు. పత్రికల్లో కథనాలు వస్తేనో.. బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనో మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు. నేరుగా పర్యవేక్షించే యంత్రాంగం లేకపోవడంతో మీ-సేవా కేంద్రాల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు..

సులభం.. వేగం.. ఇదే మీ సేవ ట్యాగ్‌లైన్‌. వాటి సంగతి అటుంచితే పనులు చేయించుకోవడానికి జనం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. నిర్దేశిత రుసుములకంటే.. అర్జీదారుల అవసరం.. పనిని బట్టి నిర్వాహకులు వసూళ్లకు దిగుతున్నారు. రెవెన్యూ, విద్యార్థుల సేవల విషయంలో మితిమీరి వెళ్తున్నట్టు ఫిర్యాదులొస్తున్నాయి. పింఛన్ల కోసం ఆధార్‌లో వయసును మార్చేసి రూ. వేలల్లో గుంజిన సంఘటనలు ఇటీవల బయటపడిన సంగతి తెలిసిందే. ఈ అక్రమాలపై మంత్రి అయ్యన్నపాత్రుడు స్వయంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి విచారణ జరిపించాలని కోరారు. సాంకేతిక కారణాలు చూపించి నేటికీ విచారణ చేయించలేకపోయారు. అయినా.. మీ-సేవా కేంద్రాల్లో మార్పు రాలేదు. విద్యాసంస్థల్లో చేరికలకు అవసరమైన ధ్రువపత్రాల కోసం విద్యార్థులు వాటి చుట్టూ తిరుగుతున్నా.. సకాలంలో ఇవ్వటం లేదు. దళారులతో వచ్చిన వారికే పనవుతోంది. ఇందుకోసం అదనపు మొత్తాన్ని విద్యార్థులు భరించాల్సి వస్తోంది.
జిల్లాలోని ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా 118, రామ్‌ ఇన్‌ఫో టెక్‌ ఆధ్వర్యంలో 229 కేంద్రాలను నిర్వహిస్తున్నారు. మిగిలినవి గ్రామీణ జిల్లాలో సీఎమ్‌ఎస్‌ కంప్యూటర్‌ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. రెండు నెలల క్రితం వరకు సేవలకు కనిష్ఠ రుసుము రూ. 35 ఉండేది. ఇపుడది రూ. 45కు చేరింది. సేవల కోసం దరఖాస్తుతోపాటు సమర్పించే పత్రాలు అయిదులోపుంటే నిర్దేశిత రుసుమే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఉంటే వాటిని స్కాన్‌ చేయడం కోసం ప్రతి అదనపు డాక్యుమెంటుకు రూ. 2 చొప్పున చెల్లించాలి. దరఖాస్తుదారుల అవగాహన లేమిని అడ్డం పెట్టుకుని నిర్వాహకులు అడ్డంగా వసూళ్లు చేసేస్తున్నారు.

అవసరాన్ని ఆసరాగా..
చాలామంది అత్యవసరమైనపుడే ధ్రువపత్రాల కోసం వస్తున్నారు. ఈ పరిస్థితులనే దళారులు అనువుగా మార్చుకుంటున్నారు. కులం, స్థానికత, పుట్టిన తేదీ కలిపి సమీకృత ధ్రువపత్రంగా జారీ చేస్తుంటారు. దీనికి రూ. 45 రుసుముగా చెల్లిస్తే సరిపోతుంది. 30 రోజుల్లోగా ఇవ్వడానికి అధికారులకు సమయం ఉంది. వారు తలచుకుంటే 30 నిమిషాల్లో ఇచ్చేయొచ్చు. కొంతమంది బాగానే స్పందిస్తున్నా.. చాలామంది రోజుల తరబడి తిప్పించుకుంటున్నారు.
* ఆధార్‌లో తప్పుల సవరణ.. ఆలస్యపు జనన నమోదు విషయంలో నిర్దేశిత రుసుముకంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు.
* అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి జారీ చేయాల్సిన ధ్రువపత్రాల విషయంలోను అదనంగా సమర్పించుకోవాల్సి వస్తోంది.
* వలస (మైగ్రేషన్‌), డూప్లికేట్‌ మెమొరాండం ఆఫ్‌ మార్కుషీట్లకు దరఖాస్తు సమయంలో ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారు.