News

Realestate News

మీ ఇల్లు ఏ రేటింగ్‌?

మీ ఇల్లు ఏ రేటింగ్‌?

ఇంట్లో గృహోపకరణాలు కొనుగోలు చేసే ముందు మూడు నక్షత్రాల గుర్తుందా?.. నాలుగు నక్షత్రాలదా? అన్నింటికంటే ఉత్తమమైన ఐదు నక్షత్రాల రేటింగ్‌ ఉందా అని చూస్తున్నాం. ముఖ్యంగా వాషింగ్‌మిషన్‌, రిఫ్రిజిరేటర్‌ వంటి అధికంగా విద్యుత్తు వినియోగమయ్యే ఉపకరణాల్లో బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ఇచ్చే రేటింగ్‌ ఉన్న వాటినే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంట్లో ఒక పరికరం కొనుగోలులోనే ‘స్టార్‌ రేటింగ్‌’ చూస్తున్నప్పుడు.. ఏకంగా ఇల్లు కొంటున్నప్పుడు రేటింగ్‌ గురించి ఆరా తీయరా అంటే? ఇటీవల కొనుగోలుదారులకు ఎదురవుతున్న అనుభవాలతో కచ్చితంగా వాకబు చేస్తున్నారు అంటున్నారు నిర్మాణదారులు.

ఈనాడు, హైదరాబాద్‌
కొనుగోలుదారుల ఆలోచనలను, అభిరుచులను పరిగణనలోకి తీసుకొంటూ… భారీ ప్రాజెక్ట్‌లు చేపడుతున్న గృహ నిర్మాణ సంస్థలు.. ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) రేటింగ్‌తో వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా వేసవి కాలం వస్తే నగరవాసులు నీటి కోసం అదనంగా చాలా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయినా కొన్నిసార్లు సమయానికి నీటిలభ్యత లేక ఇబ్బందులు పడటం .. దాదాపు ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు అనుభవమే. ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి ఈ సమస్యలు మరీ అధికం. చాలా అపార్ట్‌మెంట్లలో నిత్యం ట్యాంకర్‌ రానిదే రోజు గడవని పరిస్థితి ఉంటోంది. ఇలాంటి వారు సొంత ఇల్లు కొంటున్నప్పుడు నీటిని ఆదా చేసే ప్రాజెక్టులవైపు మొగ్గు చూపుతున్నారు.

వాననీటి సంరక్షణ..
నీటిని ఎంత మేరకు ఆదా చేసే అవకాశముంది… ఎటువంటి విధానాలు ప్రాజెక్టుల్లో అవలంభిస్తున్నారనే విషయాలూ రేటింగ్‌ను నిర్ధారిస్తాయి. పెద్ద ప్రాజెక్టులన్నీ భవనాలపై పడిన నీటిని నిల్వ చేసుకునేలా భారీ ట్యాంకులను భూగర్భంలో నిర్మిస్తున్నాయి. వర్షం పడిన సమయంలోనే శుద్ధి చేసి వీటిలోకి తరలిస్తున్నారు. దీంతో పాటూ బోర్‌వెల్స్‌ రీఛార్జ్‌ అయ్యేలా.. ఇంజెక్షన్‌ వెల్స్‌ ఏర్పాటు చేసి ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నారు. ఇలా అవకాశమున్న అన్ని మార్గాల్లో వాననీటిని సంరక్షిస్తున్నారు. ఇంతేకాకుండా గృహ అవసరాలకు ఉపయోగించే నీటిని తిరిగి ఉపయోగించుకునేలా మురుగునీటి శుద్ధి కేంద్రాలను (ఎస్టీపీ) సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాల్లో శుద్ధి చేసిన నీటిని గార్డెనింగ్‌కు, ఇళ్లలోని టాయిలెట్‌ ఫ్లషింగ్‌కు వాడేలా చూస్తున్నారు. ఫలితంగా నీరు చాలావరకు ఆదా కావటంతోపాటుగా .. వాడిన నీరు పునర్వినియోగం అవుతుంది. ఇంటి రేటింగ్‌ నిర్ణయిం చటంలో ఇది ముఖ్యభూమికను పోషిస్తుంది.

వాస్తుతో పాటూ..
కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా డిజైన్లలో మార్పులతో స్థిరాస్తి సంస్థలు రేటింగ్‌ పొందుతున్నాయి. దరఖాస్తులో పొందుపర్చే అంశాల ఆధారంగా ఐజీబీసీ పాయింట్లను కేటాయిస్తుంది. వీటిని బట్టి ప్రాజెక్ట్‌కు ప్లాటినం, గోల్డ్‌, సిల్వర్‌ రేటింగ్‌ ఇస్తారు. వాస్తుతో పాటూ ఈ మధ్య ప్రాజెక్ట్‌ల్లో రేటింగ్‌కు పెద్దపీట వేస్తుండటం నిర్మాణ రంగంలో వచ్చిన మార్పునకు నిదర్శనం. నిర్మాణానికి ఉపయోగిస్తున్న సామగ్రి, సాంకేతిక తదితర అంశాలూ రేటింగ్‌లో కీలకమే.

తేడా గుర్తిస్తారు..
ఒకసారి రేటింగ్‌ ఇచ్చిన గ్రీన్‌హోమ్‌లోకి దిగాక విద్యుత్తు, నీటి ఆదాలో కొనుగోలుదారుడికి స్పష్టంగా తేడా తెలుస్తుందని స్థిరాస్తి వ్యాపారులు అంటున్నారు.

మీ ఇంటికి కూడా..
స్థిరాస్తి సంస్థలు నిర్మించే భవనాలే కాదు.. వ్యక్తిగతంగానూ గ్రీన్‌ బిల్డింగ్‌ సర్టిఫికేషన్‌ పొందవచ్చు. ఎంత విస్తీర్ణంలో ఇంటిని నిర్మిస్తున్నారనే ఆంక్షలేమీ లేవు. రేటింగ్‌కు అవసరమైన విధంగా ఇంటి డిజైన్‌, ఉపయోగించే సామగ్రి, ఇంకుడు గుంతల ఏర్పాటు, వాననీటి సంరక్షణ, విద్యుత్తు ఆదా వంటి చర్యలతో ఐజీబీసీ రేటింగ్‌ పొందవచ్చు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో 100 చ.మీ., ఆపై విస్తీర్ణంలో నిర్మించే ఇళ్లలో ఇంకుడు గుంతలు ఉంటేనే నివాసయోగ్యత సర్టిఫికెట్‌ ఇచ్చే విధంగా నిబంధనలు మార్చబోతున్నారు.

విద్యుత్తు పొదుపు..
ఒకప్పుడు ఇళ్లలో విద్యుత్తు వినియోగం తక్కువగా ఉండేది. వాతావరణంలో వస్తున్న మార్పులతో ప్రస్తుతం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా వేసవిలో ఎంతో అధికంగా ఉంటోంది. ఈ బిల్లులు జేబుకు చిల్లు పెడుతుంటాయి. ఇదంతా ఇంట్లో చల్లదనం కోసమే. నిర్మాణ సమయంలోనే గది ఉష్ణోగ్రతలు కొంతవరకైనా తగ్గించే సామగ్రిని ఉపయోగిస్తే చాలావరకు సమస్య తీరినట్లే కదా! వెలుతురు వచ్చేలా ఇంటి డిజైన్‌ ఉంటే.. విద్యుత్తు బిల్లు గణనీయంగా తగ్గుతుంది. గృహ కొనుగోలుదారులు కోరుకుంటున్నదీ ఇదే. అందుకే కొత్త ప్రాజెక్ట్‌ల్లో ఇల్లు కొనేటప్పుడు ఐజీబీసీ రేటింగ్‌ గురించి కూడా ఆరా తీస్తున్నారు.

ఇవీ ప్రయోజనాలు..
విద్యుత్తు ఆదా 20 నుంచి 30 శాతం
నీటి ఆదా 30 నుంచి 50 శాతం
గాలి స్వచ్ఛత పెరుగుతుంది..
పుష్కలంగా పగటి వెలుతురు
వనరులను పొదుపుగా వినియోగించడం, పునర్వినియోగం

వస్తేనే ప్రచారం
బడా స్థిరాస్తి సంస్థలు ప్రస్తుతం గ్రీన్‌ బిల్డింగ్‌ రేటింగ్‌ విషయంలో పోటీపడుతున్నాయి. ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్న సంస్థలు రేటింగ్‌ కోసం అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయితే ఇక్కడ ప్రతీ సంస్థ ప్లాటినం రేటింగ్‌ను ఆశిస్తోంది. ఇది వస్తే గొప్పగా ప్రచారం చేసుకొంటున్నాయి. రేటింగ్‌ ఏమాత్రం తగ్గినా గోల్డ్‌, సిల్వర్‌ వచ్చినా ఆ విషయం వినియోగదారులకు చెప్పడం లేదు.

Source : http://www.eenadu.net/