News

Realestate News

మావోయిస్టుల అణచివేతకు

మావోయిస్టుల అణచివేతకు
ఇజ్రాయిల్‌ సాంకేతిక సహకారం
రాళ్లగెడ్డ అవుట్‌ పోస్టును సందర్శించిన డీజీపీ
నేటి నుంచి నక్సల్బరీ వారోత్సవాలు
చింతపల్లి, న్యూస్‌టుడే: ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో సోమవారం నిర్వహించిన ఏరియల్‌ సర్వేలో భాగంగా పోలీసు ఉన్నతాధికారులు చింతపల్లి మండలంలోని రాళ్లగెడ్డ పోలీస్‌ అవుట్‌ పోస్టును సందర్శించారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో వీరి పర్యటనను పోలీసు శాఖ గోప్యంగా ఉంచింది. ఇటీవల రాళ్లగెడ్డ అవుట్‌పోస్టుకు సమీపంలోనే మావోయిస్టులు మందుపాతర అమర్చి హోంగార్డును బలిగొన్నారు. తొలిసారిగా ఈ నెల 24 నుంచి మావోయిస్టులు నక్సల్బరీ వారోత్సవాలకు పిలుపునిచ్చారు. ఈ సంఘటన నేపథ్యంలో డీజీపీ సాంబశివరావు, జిల్లాకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు మన్యంలోని సరిహద్దు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. డీజీపీ వెంట ఇంటిలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐబీ ఐజీ బి.శ్రీనివాసరావు, ఐజీ కుమార్‌విశ్వజిత్‌, గ్రేహౌండ్స్‌ అడిషనల్‌ డీజీ సురేంద్రబాబు, జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ, విశాఖ, విజయనగరం ఓఎస్డీలు బాబూజీ, అప్పలనాయుడు తదితరులు ఉన్నారు. ఏవోబీలో మావోయిస్టుల అణచివేతలో విదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు వీలుగా ఇజ్రాయిల్‌ దేశానికి చెందిన ముగ్గురు సాంకేతిక సలహాదారులు ఏరియల్‌ సర్వేలో పాల్గొన్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.