News

Realestate News

మాట… ఆకట్టుకునేలా…

vizag news

ఉపన్యాస కళకు ఆత్మవిశ్వాసమే ఆలంబన
‘ఈనాడు-ఈతరం క్లబ్‌’ పబ్లిక్‌ స్పీకింగ్‌ కోర్సులో వ్యక్తిత్వ వికాస నిపుణులు రాజు
డాబాగార్డెన్స్‌, న్యూస్‌టుడే: ఆకట్టుకునేలా మాట్లాడటం.. అందర్నీ కట్టిపడేసేలా ప్రసంగించడం వరం లాంటిది. దాన్ని సాధన ద్వారా కూడా సాకారం చేసుకోవచ్చని వ్యక్తిత్వ వికాస నిపుణులు జి.వి.ఎన్‌.రాజు అన్నారు. డాబాగార్డెన్స్‌లోని హోటల్‌ డాల్ఫిన్‌లో ఈనాడు-ఈతరం క్లబ్‌ ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు నిర్వహించిన పబ్లిక్‌ స్పీకింగ్‌ కోర్సుకు మంచి స్పందన లభించింది. ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంచి వక్తగా ఎదగాలంటే ఆత్మవిశ్వాసం చాలా అవసరమన్నారు. ఎదుటివారు ఏమనుకుంటారోననే భయం వల్ల మనలోని సృజనాత్మకత బయటపడదన్నారు. మాటల ద్వారా మనస్సులను రంజింపజేసే వారికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. మంచి వ్యక్తులు మంచి వక్తలు కాగలిగితే వాళ్లు సమాజంలో ఎంతో మందిని ప్రభావితం చేయగలుగుతారన్నారు. స్పష్టత, శ్రావ్యత, చక్కటి ముఖాభినయం, శారీరక భాష, ముఖ్యంగా సమయ స్ఫూర్తి వంటి లక్షణాలు మంచి వక్తలకు చాలా అవసరమన్నారు. శిక్షణలో రాజమహేంద్రవరం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, పలు రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధుల పాల్గొని మెలకువలు తెలుసుకున్నారు.

ఆకట్టుకున్న ప్రసంగాలు…
శిక్షణలో భాగంగా పాల్గొన్నవారికి పలు అంశాలపై వక్తృత్వ పోటీలు నిర్వహించారు. తొలిరోజు తమనుతాము పరిచయం చేసుకోవడంలోనే తడబడిన వీరు శిక్షణ పూర్తయ్యాక ఆకట్టుకునేలా మాట్లాడారు. ఈ పోటీలో పి.శశాంక్‌, ఎ.రాజ్యలక్ష్మి, బి.నారాయణరావులు ఉత్తమ వక్తలుగా నిలిచారు. వీరికి జ్ఞాపికలు బహుకరించారు. శిక్షణలో పాల్గొన్న వారికి ధ్రువపత్రాలను అందజేశారు.

ఆగస్టు 27, 28 తేదీల్లో తరగతులు..
ప్రాక్టికల్‌ పబ్లిక్‌ స్పీకింగ్‌ కోర్సును ఆగస్టు 27, 28 తేదీల్లో విశాఖపట్నం డాల్ఫిన్‌ హోటల్‌లో నిర్వహించనున్నారు. ఈ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు రూ.5,000 ఫీజు చెల్లించాలన్నారు. ఆసక్తి గలవారు 9618775577, 8008551064 నెంబర్లలో సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

* ఉద్యోగ రీత్యా చాలా ఉపయోగం
వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేస్తున్న నేను నిత్యం రైతులతో సమావేశాలు నిర్వహించాల్సిన ఉంటుంది. ఆ సమయంలో రైతులకు పలు అంశాలపై అవగాహన కలిగించడానికి ఈ కోర్సు నాకు చాలా ఉపయోగపడుతుంది. అన్నింటికంటే ఉన్నత స్థాయి ఉద్యోగాల ఎంపికకు వెళ్లేటప్పుడు మౌఖిక పరీక్షను గెలవడానికి సాయపడుతుంది.

– చాందిని, శ్రీకాకుళం

* ప్రజాప్రతినిధిగా…నాకు చాలా అవసరం
శ్రీకాకుళం జిల్లాలో సింగుపురం ఎంపీటీసీగా ఉన్న నాకు ఇలాంటి తరగతులు చాలా అవసరం. నిత్యం ప్రజా సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులు, పార్టీ పెద్దల ముందుకు తీసుకెళ్లాలంటే స్పష్టంగా.. దైర్యంగా..ధారాళంగా మాట్లాడే వాక్‌చాతుర్యం కావాలి. ఎంతో కొంత మాట్లాడగలను కానీ అది సరిపోదు. ఈ శిక్షణ నాకు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది.