మాటలు నమ్మకండి.. వాస్తవాల్ని సరిచూసుకోండి!

అక్రమ లేఅవుట్లలో స్థలం కొంటే తప్పవు అగచాట్లు
కొత్త లేఅవుట్లకు వుడా అనుమతులు తప్పనిసరి
ముందస్తు పరిశీలనతో కొనుగోలుదారులకు మేలు
మర్రిపాలేనికి చెందిన వినయ్ భీమునిపట్నం మండలంలో 350 గజాల ఖాళీ స్థలాన్ని మూడేళ్ల క్రితం కొనుగోలు చేశారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యింది. స్థలంలో ఇంటి నిర్మాణం కోసం ఇటీవల ఒక జాతీయ బ్యాంకు అధికారులను కలిసి రుణం కావాలని కోరారు. దీనిపై సంబంధిత వర్గాలు ముందస్తు ప్రక్రియ పూర్తి చేస్తే తరువాత చూద్దామని హామీ ఇవ్వడంతో వినయ్ తగిన ఏర్పాట్లు చేశారు. అంతా పరిశీలించిన బ్యాంకు అధికారులు చివరి క్షణంలో లేఅవుట్‌కు వుడా అనుమతి లేనందున, ఇంటి నిర్మాణం కోసం రుణం మంజూరు సాధ్యం కాదని స్పష్టం చేయడంతో అతడికి దిక్కు తోచలేదు. అప్పటివరకు ఆయనకు వుడా అనుమతి లేని లేఅవుట్లో ఇళ్ల స్థలాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయవని, స్థానిక సంస్థలు అనుమతులు (ప్లాను) ఇవ్వవన్న విషయం తెలియదు. ప్రస్తుతం అతడు లబోదిబోమంటున్నాడు.
సీతమ్మధారకు చెందిన చక్రధర్ సబ్బవరం మండలంలో 450 చదరపు గజాల ఇంటి స్థలాన్ని రెండున్నరేళ్ల క్రితం కొనుగోలు చేశారు. ఇటీవల వుడా అధికారులు ఈ లేఅవుట్లో నిర్మాణాలను తొలగించారు. దీంతో ఉలిక్కిపడిన చక్రధర్ సంబంధిత అధికారులను సంప్రదిస్తే అక్రమంగా వేసిన లేఅవుట్లో స్థలాన్ని కొనుగోలు చేసిన విషయం బయటపడింది. స్థలాన్ని విక్రయించిన వ్యాపారిని కలిస్తే మాట మార్చేశాడు. లేఅవుట్‌కు వుడా అనుమతి ఉందని అమ్మేటపుడు తానెవరికీ చెప్పలేదని బుకాయించేశాడు. మీకు ఇష్టమై కొన్నారు, ఇప్పుడు వుడా ఉద్యోగులు తొలగించారు… సమస్యను మీరు పరిష్కరించుకోవాలి తప్పితే తనకు సంబంధం లేదని తప్పుకున్నాడు. దీంతో చక్రధర్‌కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
ఈనాడు – విశాఖపట్నం
నగర శివారు, గ్రామీణ జిల్లాలో విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ లేఅవుట్లలో కొనుగోలు చేస్తున్న స్థలాలతో చాలా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. తక్కువ ధరకు వస్తుందని ఆశ పడో, సమస్య తలెత్తినా నాలుగు డబ్బులిచ్చి పరిష్కరించుకోవచ్చునన్న ధీమాతో స్థలాలు కొనుగోలు చేస్తున్న కుటుంబాలకు ఇప్పుడు అనుకోని ఇబ్బందులు ఎదురవ్వడంతో లబోదిబోమంటున్నారు. గత పది రోజుల వ్యవధిలో 555 ఎకరాల్లో వేసిన 108 అక్రమ లేఅవుట్లను వుడా అధికారులు తొలగించారంటే వీటి తీవ్రత, మోసాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో స్పష్టమవుతోంది. విభజన తరువాత ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న విశాఖపట్నంలో ఖాళీ స్థలం కొనుగోలు చేయాలని ప్రజలు ఆశపడటం సహజం. భవిష్యత్తు అవసరాలకు, పిల్లల కోసం ఉపయోగపడుతుందని చాలామంది కొనుగోలు చేస్తుంటారు. పెట్టుబడిగా పెట్టి వీటిలో లాభాలు ఆశించిన వారూ లేకపోలేదు. ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడం తప్పు కాకపోయినా, తగిన జాగ్రత్తలు తీసుకుంటే తరువాత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండదు. వ్యాపారులు చెప్పే మాయ మాటలు నమ్మి అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొని చాలామంది నష్టపోతున్నారు.
ఇలాంటి జాగ్రత్తలు అవసరం
లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసే ముందు విశాఖ నగరాభివృద్ధిసంస్థ (వుడా) నుంచి ‘లేఅవుట్ పర్మిషన్’ (ఎల్పీ) ఉందా? లేదా? అనేది తెలుసుకోవడం తప్పనిసరి. ఎల్పీ లేదనుకుంటే వ్యాపారులతో సంప్రదింపులు చేయడం అనవసరం.
వుడా నుంచి ఎల్పీ లేకపోయినా ఉన్నట్లుగా చాలామంది వ్యాపారులు ఈ మధ్య ప్రచారం చేసి స్థలాల్ని అమ్మేస్తున్నారు. ఈ విషయాలను నిర్ధరించుకోవడానికి www.vuda.gov.in వెబ్సైట్లో పరిశీలించాలి. ఇందులో వుడా అనుమతి పొందిన లేఅవుట్ల వివరాలన్నీ ఉంటాయి. అప్పటికీ సాధ్యం కానపుడు సిరిపురంలోని వుడా ప్రధాన కార్యాలయంలోని చీఫ్ అర్బన్ ప్లానర్ (సీయూపీ) విభాగంలో సంప్రదించినా వ్యాపారి చూపించిన ఎల్పీ నిజమా? కాదా? అనేది నిర్దారించుకోవచ్చు.
వ్యాపారులు కొందరు వుడా ఇచ్చిన ఆర్సీ నంబరు కూడా చూపించి స్థలాలు విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్పీ కోసం వుడాకు దరఖాస్తు చేసినపుడు దస్త్రం ముందుకు వెళ్లే క్రమంలో ఆర్సీ నంబరు ఇస్తుంటారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్పీగా భావించడానికి లేదు. ఆర్సీ నంబరు ఇచ్చినా భూములపై హక్కులు సరిగా లేవనో, అందులో ప్రభుత్వ భూమి కలిసి ఉందనో, లేఅవుట్‌కు సరైన అప్రోచ్ రోడ్డు చూపలేదనే కారణంతో చివరి క్షణంలో ఎల్పీ ఇవ్వకుండా దరఖాస్తుని వెనక్కి పంపే అవకాశాలూ ఉన్నాయి. అందువల్ల వుడా ఆర్సీ నంబరు చూపించి స్థలాలు విక్రయించే వ్యాపారుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
వుడా నుంచి ఎల్పీ ఉంటుంది. ఆపై లేఅవుట్‌కు వెళ్లేందుకు 40 అడుగుల వెడల్పులో అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేస్తారు.
వుడా నిర్దేశించిన మేరకు లేఅవుట్ లోపలి భాగంగా రహదారులు, మురుగు నీటి కాలువలు, విద్యుత్తు దీపాలు, తాగునీరు వంటివి ఏర్పాటు చేస్తారు.
నిర్దేశించిన మౌలిక సదుపాయాలు డెవలపర్ కల్పించారని అధికారులు నిర్దారించుకున్నాకే అప్పటికే వుడా పేరుతో లేఅవుట్లో తనాఖా పెట్టిన పది శాతం స్థలాన్ని విడుదల చేస్తారు.
ప్రతి డెవలపర్ వుడా నుంచి ఎల్పీ తీసుకునేముందు లేఅవుట్లో పదిశాతం స్థలాన్ని వుడా పేరుతో తనాఖా పెట్టి సమీప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయిస్తారు. నిబంధనలకు లోబడి లేఅవుట్లో అన్ని సదుపాయాలు కల్పించాకే తనఖా విడుదల చేస్తారు.
పది శాతం స్థలాన్ని తనఖా పెట్టాక డెవలపర్లు ఎవరైనా విడుదల చేయించుకునేందుకు గడువులోగా ముందుకు రాకపోతే, స్థలాన్ని వుడా అధికారులు విక్రయించి వచ్చిన డబ్బుతో లేఅవుట్లో మౌలిక సదుపాయాలు కల్పించే అధికారమూ ఉంది.
లేఅవుట్‌కు వుడా ఎల్పీ ఉన్నట్లయితే బ్యాంకుల నుంచి రుణాలు మంజూరవుతాయి. ఇతరులకు విక్రయించినా రిజిస్ట్రేషన్ పరంగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తవు. స్థలంలో ఇంటి నిర్మాణాలకు సమీప పంచాయతీ, పురపాలక సంఘం, నగరపాలక సంస్థల నుంచి అనుమతులు మంజూరవుతాయి.
అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవచ్చు….
అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం గతంలో ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో దాదాపు 8 వేల అక్రమ లేఅవుట్లను వుడా పరిధిలో క్రమబద్ధీకరించారు. మరో 7వేల దరఖాస్తులు వుడాలో ఆపరిష్కృతంగా మిగిలిపోయాయి. మరోసారి ఎల్ఆర్ఎస్ను ప్రవేశ పెట్టే విషయాన్ని ప్రభుత్వ వర్గాలు పరిశీలిస్తున్నాయి. ఈ పథకంతో సంబంధం లేకుండా కూడా అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించే అధికారం వుడాకు ఉంది. వుడా నిర్దేశించిన మేరకు లేఅవుట్‌కు 40 అడుగుల వెడల్పులో అప్రోచ్ రోడ్డు, లేఅవుట్ లోపల రహదారులు, కాలువలు, విద్యుత్తు, తాగునీటి సౌకర్యం, మురుగు నీటి సరఫరా వంటివి ఏర్పాటు చేయాలి. దీనిపై ఆయా ప్రాంత భూముల ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా 14 శాతం రుసుం వసూలు చేసి అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరిస్తారు.
ఎల్పీ ఉన్న లేఅవుట్లలో కొనుగోళ్లు చేయాలి
వుడా ఎల్పీ ఉన్న లేఅవుట్లలో మాత్రమే ఇళ్ల స్థలాలను ప్రజలు కొనుగోలు చేయాలి. ఈ విషయాన్ని అసోసియేషన్ తరఫున కూడా ఎప్పటికప్పుడు సూచిస్తున్నాం. అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేయడంతో తరువాత అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. తక్కువ ధరకు వస్తున్నాయనో, ఇతరత్రా కారణాలతో స్థలాలు కొనుగోలు చేయడం ప్రజలకు శ్రేయస్కరం కాదు. అన్ని అనుమతులూ ఉన్నాయని నిర్ధారించుకున్నాకే ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడం మంచిది.
ఉపేక్షించేది లేదు
అక్రమ లేఅవుట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ఇక నుంచి ప్రాథమిక దశలోనే వీటిని గుర్తించి తొలగించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. విక్రయాలు పూర్తయ్యాక వుడా చర్యలకు దిగుతుందనే విమర్శను తొలగించేందుకు ఇక నుంచి నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. వుడా అనుమతులు తీసుకోకుండా లేఅవుట్ వేశారని తెలియగానే చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎవరైనా వ్యాపారులతో కుమ్మక్కైనట్లు తెలిస్తే శాఖాపరంగా చర్యలు తప్పవు.
