మాజీ సైనికులు, సమరయోధుల అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు తొలగిన అడ్డంకి

307 జీవోను రద్దు చేసిన ప్రభుత్వం
విశాఖపట్నం, ఈనాడు: మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు చెందిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. జిల్లా యంత్రాంగం నుంచి ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆ భూముల క్రయ విక్రయాలపై రిజిస్ట్రేషన్లు చేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సన్నద్ధమవుతోంది. ఆ అసైన్డ్ భూములను పదేళ్ల తరువాత వాటి లబ్ధిదారులు ఇతరులకు విక్రయించుకోవచ్చు. 2013 జూన్ 6న వెలువడిన జీవో 307 ప్రకారం ఈ భూముల విక్రయ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ తప్పనిసరి చేశారు. ఇవి తెచ్చుకోకపోతే రిజిస్ట్రేషన్ చేయటం లేదు. ఇలా నగర, గ్రామీణ జిల్లాలో గత మూడేళ్లలో 58 దస్తావేజులు పెండింగులో ఉన్నట్లు తెలుస్తోంది. రూ. 50 లక్షల్లోపు విలువైన భూములకు కలెక్టర్, రూ. 50 లక్షల నుంచి రూ. కోటిలోపు విలువైన భూములకు సీపీఎల్ఏ, అంతకంటే విలువైన భూములపై ప్రభుత్వం ఎన్ఓసీ జారీ చేయాల్సి ఉంది. 307 జీవో కారణంగా జిల్లా స్థాయిలో ఎన్ఓసీ కోసం భారీగా సొమ్ములు చేతులు మారిన సందర్భాలున్నాయి. గతంలో ఇక్కడ పని చేసిన ఒక కలెక్టర్ అందినకాడికి వెనకేసుకొని ఎన్ఓసీలు జారీ చేశారని ఆరోపణలున్నాయి. కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు సైతం అలాంటి భూములను కొనుగోలు చేసి ఎన్వోసీల కోసం డబ్బు విరజిమ్మేవారు. ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం వసూళ్లకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఈ నెల 4న 279 జీవోని జారీ చేస్తూ… ఇన్నాళ్లూ అమల్లో ఉన్న జీవో 307ను రద్దు చేసింది. కలెక్టర్, సీసీఎల్ఏ, ప్రభుత్వం నుంచి ఎన్ఓసీలు ఇక అవసరం లేదని తేల్చి చెప్పింది. రెండు రోజుల క్రితం స్టాంపులు, రిజిస్టేష్రన్లశాఖకు ఉన్నతాధికారుల నుంచి ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
కలెక్టర్ ఆదేశాలే తరువాయి….
ప్రభుత్వం నుంచి జీవో విడుదలైనా.. కలెక్టర్ నుంచి తదుపరి ఉత్తర్వులు రాగానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే మాజీ సైనికులు, సమరయోధుల భూములు అసైన్డ్ పరిధిలోకి రావడంతో చాలా వరకు కలెక్టర్ 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చారు. అందువల్ల వీటి రిజిస్ట్రేషన్‌కు వీలు కాదు. కలెక్టర్ ఆధ్వర్యంలో తహసిల్దార్లు తమ పరిధిలోని మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధుల భూములను పునఃపరిశీలించి.. ఎలాంటి వివాదాల్లేవని గుర్తించి 22ఏ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు వివరాలు పంపాలి. అపుడే ఇలాంటి దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేసే అవకాశాలున్నాయి. కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చే తదుపరి ఆదేశాలు రాగానే 22ఏ జాబితాలో తొలగించిన భూముల విక్రయాలపై రిజిస్ట్రేషన్లను చేస్తామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారి ఒకరు తెలిపారు. మధురవాడ, భీమునిపట్నం, పెందుర్తి, సబ్బవరం, అనకాపల్లి తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో మాజీ సైనికుల, స్వాతంత్య్ర సమరయోధుల భూములు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.