News

Realestate News

మాకు విశాఖే కావాలి..

మాకు విశాఖే కావాలి..
ఐపీఎల్‌ నిర్వాహకులతో పుణె
మ్యాచ్‌లు తరలిస్తే ధోని జట్టుకు సొంతగడ్డ అదే
సమయం కావాలన్న ముంబయి ఇండియన్స్‌
దిల్లీ

కరవుతో అల్లాడుతున్న మహారాష్ట్ర నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లను తరలించడం ఖరారైతే.. విశాఖపట్నం కనీసం నాలుగు మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వడం దాదాపు ఖాయం! మ్యాచ్‌లు తరలించే పక్షంలో తమకు సొంత మైదానంగా విశాఖపట్నం స్టేడియమే కావాలని కోరుకుంది రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌. అన్నీ అనుకున్నట్లు జరిగితే ధోని నేతృత్వంలోని ఈ జట్టు విశాఖలో మూడు వారాల పాటు సందడి చేయబోతున్నట్లే!

విశాఖపట్నంతో మహేంద్రసింగ్‌ ధోనికి ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ధోని అంటే ఏంటో ప్రపంచానికి తెలిసింది ఈ వేదికలోనే. 2005లో పాకిస్థాన్‌పై అతడి మెరుపు శతకాన్ని భారత అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. ఆ తర్వాత కూడా వైజాగ్‌లో ధోని ఎన్నో మధురానుభూతులున్నాయి. ఇటీవల శ్రీలంకతో టీ20 ఆడిన సందర్భంలో కూడా విశాఖ తనకెంతో నచ్చిన నగరం అని చెప్పాడు. ఈ నగరం మీద మహికి ఉన్న ఆ ప్రత్యేక అభిమానాన్ని దృష్టిలో ఉంచుకునేనేమో.. పుణెలో తాము ఆడాల్సిన మ్యాచ్‌లను తరలించే పక్షంలో వైజాగ్‌ కేంద్రంగా తమ సొంతగడ్డ మ్యాచ్‌లను ఆడాలని నిర్ణయించుకుంది సూపర్‌ జెయింట్స్‌. నీటి సమస్య తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర నుంచి మే నెలలో జరగాల్సిన ఐపీఎల్‌ మ్యాచ్‌లన్నింటినీ తరలించాలని బొంబాయి హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించేందుకు శుక్రవారం లీగ్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ముంబయి ఇండియన్స్‌, పుణె సూపర్‌జెయింట్స్‌ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈ రెండు ఫ్రాంఛైజీలు కలిపి సొంతగడ్డపై ఆడాల్సిన ఏడు మ్యాచ్‌లను ఇప్పుడు వేరే వేదికల్లో నిర్వహించాల్సి ఉంది. సమావేశం సందర్భంగా లీగ్‌ నిర్వాహకులు విశాఖపట్నం, రాయ్‌పుర్‌, జైపుర్‌, కాన్పుర్‌లను ప్రత్యామ్నాయ వేదికలుగా సూచించారు. వీటిలో తమకు నచ్చిన వేదికను సొంతగడ్డగా ఎంచుకోవాలని అడగ్గా.. పుణె ప్రతినిధులు విశాఖపట్నం వైపు మొగ్గు చూపారు. ముంబయి ఫ్రాంఛైజీ తమకు రెండు రోజుల సమయం కావాలని కోరింది. ఐతే మ్యాచ్‌ల తరలింపుపై ఐపీఎల్‌ పాలకమండలి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఓవైపు మహారాష్ట్ర నుంచి మ్యాచ్‌లను తరలించడానికి ఏర్పాట్లు చేస్తూనే.. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాన్ని కూడా పరిశీస్తోంది ఐపీఎల్‌ యాజమాన్యం. ఆ ఆలోచన విరమించుకుంటే.. విశాఖలో మ్యాచ్‌లు జరగడం ఖాయం. మేలో పుణె సొంతగడ్డపై నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తరలింపు ఖరారైతే 1, 10, 17, 21 తేదీల్లో జరిగే మ్యాచ్‌లను సూపర్‌జెయింట్స్‌ వైజాగ్‌ వేదికగా ఆడే అవకాశముంది.

ఫైనల్‌ బెంగళూరులో:ప్లేఆఫ్‌ దశ నుంచి మహారాష్ట్రలో జరగాల్సిన మ్యాచ్‌లను బెంగళూరు, కోల్‌కతాలకు పంచాలని ఐపీఎల్‌ పాలకమండలి ఓ నిర్ణయానికి వచ్చింది. ముంబయిలో జరగాల్సిన ఫైనల్‌తో పాటు పుణె ఆతిథ్యమివ్వాల్సిన ఓ ప్లేఆఫ్‌ మ్యాచ్‌ను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి కేటాయించాలని నిర్ణయించారు. పుణెలోనే జరగాల్సిన ఇంకో ప్లేఆఫ్‌ మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో నిర్వహించాలని భావిస్తున్నారు.

Source : http://www.eenadu.net/

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo