మహా మారథాన్

ఉత్సాహంగా పాల్గొన్న యువత
తూర్పునౌకాదళం ఈస్ట్రన్ నేవల్కమాండ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి సాగరతీరంలో విశ్వప్రియ ఫంక్షన్ హాల్ సమీపంలో నుంచి మారథాన్ పరుగు ప్రారంభమైంది. దీనిని నాలుగు కేటగిరిలుగా విభజించారు. 42 కిలోమీటర్లు, 21.కి.మీ, 10 కి.మీ., 5 కిలోమీటర్లు వారిగా పరుగు పోటీలు నిర్వహించారు. మారథాన్‌కు ఉదయం 4.15 గంటలకు, 5.15, 6.15, 6.45 నిమిషాలకు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తూర్పు నావికాదళ వైస్ అడ్మిరల్స్ హెచ్‌సీఎస్ బిస్త్, అతుల్ కుమార్జైన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా తూర్పు నావికా దళాధిపతి హెచ్‌సీఎస్ బిస్త్ మాట్లాడుతూ ఇప్పటి వరకు విశాఖలో ఇది మూడోసారి నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన తరువాత మొదటిసారిగా అత్యధికంగా ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. మారథాన్‌లో మొత్తం 10,500 మంది పాల్గొన్నారని ఆయన తెలిపారు. మారథాన్‌లో దేశంలో ఇతర రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి యువత, విదేశీయులు కెన్యా, అఫ్రికా వంటి దేశాల నుంచి పాల్గొన్నారు. వికలాంగులు కూడా మేముసైతం అనే విధంగా పోటీల్లో పాల్గొన్నారు. మొదటిసారిగా విశాఖలో నిర్వహించినప్పుడు 1500 మంది, రెండోసారి నిర్వహించినప్పుడు ఐదువేలమంది పాల్గొన్నారని ఈసారి అత్యధికంగా పాల్గొని కొత్త ఉత్సాహాన్ని నింపారని తెలిపారు. మారాథాన్‌లో పాల్గొనే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ప్రతిచోట మెడికల్ కిట్లు ఏర్పాటు చేశారు. ముందుగానే పోలీసులు, నేవీ పోలీసులు ఎక్కడికక్కడే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో ప్రశాంతగా పరుగు సాగింది. విజేతలకు మానవ నవరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొని బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ యోగానంద్, నేవీ మారథాన్ రేస్ డైరక్టర్ నన్నపనేని మురళీ పాల్గొన్నారు.