News

Realestate News

మహానంద నందనవనం

మహానంద నందనవనం
ముడసర్లోవలో బహుళ ప్రయోజన ఉద్యానవనం
నగర సిగలో మరో ఆభరణం!
రూ. 30 కోట్లతో ఏర్పాటు
ప్రపంచ ప్రసిద్ధ నమూనా గ్రామాల ఏర్పాటు
ఈనాడు – విశాఖపట్నం
ప్రాజెక్టు: బహుళ ప్రయోజన ఉద్యానవనం
ప్రాంతం: ముడసర్లోవ
విస్తీర్ణం: 150 ఎకరాలు
అంచనా వ్యయం: 30 కోట్లు

ప్రత్యేకతలు:
* 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ముడసర్లోవ జలాశయంపై తేలియాడే రెస్టారెంట్‌ ఏర్పాటు. దీనికోసం ప్రఖ్యాత ప్రయివేట్‌ సంస్థ ముందుకొచ్చింది. ఇటీవల భాగస్వామ్య సదస్సులో ఒప్పందం కుదిరింది. ఈ తరహా రెస్టారెంట్‌ ఆంధ్రప్రదేశ్‌లో మొదటిదవుతుంది.

* సందర్శకుల ఆరోగ్య సాధన కోసం పదెకరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు. ఆరు బయట జిమ్నాయిజం, యోగా జోను, చిన్న గోల్ఫ్‌ కోర్టు, జంగిల్‌ బుక్‌ ట్రీ హౌస్‌ వంటివి రాబోతున్నాయి.

* సందర్శకులు రాత్రిపూట బస చేసేందుకు పదెకరాల్లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోగల ప్రసిద్ధ నమూనా గ్రామాల ఏర్పాటు. వీటిలో సూక్ష్మ గ్రామం, గుగ్గురేట్‌ సూక్ష్మ గ్రామం (గుడారాల తరహా నమూనాలో), ఇండియన్‌ రెడ్‌ విలేజ్‌ నమూనాలు ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన గాలి లభించేలా వాతావరణ ప్రాంగణాన్ని రూపొందిస్తారు.

* మరో 50 నుంచి 60 ఎకరాల్లో పచ్చదనం పెంపొందిస్తారు. ఏడు నుంచి ఎనిమిది పచ్చదన ప్రాంగణాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి మధ్యలో రహదారులు, సమావేశ మందిరాలు, సాంస్కృతిక ప్రదర్శనల కోసం వేదికలు, నీటి కొలనులు, ఫలహారశాలలు వంటివి ఉంటాయి.

మహా విశాఖ నగరం మరో అందాల అద్భుత ఆభరణాన్ని సొంతం చేసుకోబోతోంది. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో నగర శివారులోని ముడసర్లోవలో బహుళ ప్రయోజన ఉద్యానవనం ఏర్పాటు కాబోతోంది. నభూతో అన్న రీతిలో వినోద, పర్యాటక రంగాల అభివృద్ధికి వీలుగా ఎన్నెన్నో సౌకర్యాలను కల్పించనున్నారు. 150 ఎకరాల విస్తీర్ణంలో రూ. 30 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని తీసుకురానున్నారు. 70 ఎకరాల్లో జలాశయం, మరో 80 ఎకరాల్లో ఉద్యానవనం అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రతిపాదనలు, ఆకృతులకు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూత్రపాయంగా ఆమోదం తెలిపారు. తదుపరి చర్యలను తీసుకోవటంలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. నగరం నడిబొడ్డున వుడా ఆధ్వర్యంలో ‘సిటీ సెంట్రల్‌ పార్కు’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నగర పరిధిలో ఇలాంటి మరిన్ని ఉద్యానవనాలు అవసరమని చెప్పడంతో అధికారులు ముడసర్లోవలో బహుళ ప్రయోజన ఉద్యానవనం ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. దీన్ని విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) చేపడుతుంది.

మహా విశాఖ నగరనపాలక సంస్థ (జీవీఎంసీ) ఆధ్వర్యంలో ముడసర్లోవ ఉద్యానవనాన్ని ఏనాడో ఏర్పాటు చేశారు. నిర్వహణపై తగిన శ్రద్ధ లేకపోవటంతో అది శిథిలావస్థకు చేరింది. ఇప్పటికీ జన సందడి ఉన్నా తగిన సదుపాయాల్లేక అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనిని ఆనుకుని జలాశయం ఉన్నప్పటికీ సందర్శకుల కోసం ఏర్పాట్లు లేవు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతాన్ని బహుళ ప్రయోజన ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. తొలుత జీవీఎంసీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాలని భావించినా నిధుల కొరత కారణంగా దీని బాధ్యతను ప్రభుత్వం వుడాకు అప్పగిస్తోంది. నిర్మాణ దశ నుంచే ప్రభుత్వ, ప్రయివేట్‌ భాగస్వామ్యం ఉంటుందా? ఉద్యానవన నిర్మాణం పూర్తయ్యాక అప్పగిస్తారా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

అనేక ప్రత్యేకతల కలబోతగా….
150 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ భారీ ఉద్యానవనం అనేక ప్రత్యేకతల కలబోతగా ఉండేలా కార్యాచరణ ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అడుగు పెట్టింది మొదలు చివరి వరకు ఎంతో ఆహ్లాదకర, ఆనందదాయక వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దబోతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు అనువుగా, ప్రత్యేకించి చిన్నారుల కోసం అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఆకృతులను సిద్ధం చేశారు. పనులు ప్రారంభించిన ఏడాదిన్నరలో ప్రాజెక్టును పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధమవుతోంది.